Tuesday, November 5, 2024

బీజేపీపై కాలుదువ్వుతున్న కేసీఆర్

  • బీజేపీపైనే దాడిని కేంద్రీకరించడంలో మతలబు ఏమిటి?
  • బండి సంజయ్ పైన మాత్రమే గురి ఎందుకు పెట్టారు?
  • రేవంత్ రెడ్డి ప్రస్తావనే లేదు, ఎందుకని?
  • హైదరాబాద్ లో చెడామడా తిట్టి దిల్లీ వెళ్ళి దండం పెట్టి వస్తారా?
  • కేసీఆర్ డెయిలీ మీడియా సమావేశాలపై ఊహాగానాలు

ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి, గెలుపులోనే కాదు, ఓటమిలోనూ తన చెయ్యి పైన ఉండేలా ఎట్లా చూసుకోవాలి, ప్రజల్లో సందడి ఎలా కలుగచేయాలి,  ప్రత్యర్ధుల్లో అలజడి ఎలా సృష్టించాలి, అందరూ తన వైపు చూసేట్టు, కొందరు తనకేసి చూడకుండా ఉండేట్టు ఎలా సెట్ చేసుకోవాలి మొదలైన విద్యలన్నీ బాగా తెలిసిన రాజకీయ నాయకులలో, నేటి తరంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ తొలి వరుసలో నిలుస్తారు. దానికి తగిన భాష, దేహభాష (లాంగ్వేజ్ & బాడీ లాంగ్వేజ్ ), మాండలికం, సామెతలు, పిట్టకథలు, అంకెలు, రంకెలు, ఛలోక్తులు, హావభావాలు ఆన్నీ కెసిఆర్ దగ్గర సిద్ధంగా ఉంటాయన్నది ప్రసిద్ధం.

Also read: పెనంపై నుంచి పొయ్యిలో పడుతున్న పంజాబ్ కాంగ్రెస్

ఎదురుదాడి ఎందుకో?

హుజూరాబాద్ ఉపఎన్నికలో టి ఆర్ ఎస్ ఓటమి, ఈటెల రాజేందర్ గెలుపు, బండి సంజయ్ వంటి బిజెపి నేతల ఘాటు వ్యాఖ్యల పరంపరలో, వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కె సి ఆర్ ఎదురుదాడికి దిగుతున్నారు. రెండురోజుల నుంచి సుదీర్ఘంగా మాట్లాడుతూ, మీడియా మిత్రుల ప్రశ్నలకు నవ్వుతూ కూల్ గా సమాధానాలు చెబుతున్నారు. ఇక నుంచి రోజూ ప్రెస్ మీట్ పెడతానంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. బిజెపిపై కె సి ఆర్ చేస్తున్న ఎదురుదాడిలో, స్థానికం నుంచి అంతర్జాతీయం వరకూ అనేక అంశాలు ప్రస్తావనలోకి వస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ మళ్ళీ ప్రస్తావనలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, టి ఆర్ ఎస్, కెసిఆర్ పై రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు అంతే ఘాటుగా మాట్లాడుతున్నా, ఈ రెండు రోజుల మీడియా సమావేశంలో ముఖ్యంగా బిజెపి, బండి సంజయ్ పైనే ప్రధానంగా కె సి ఆర్ బాణాలు ఎక్కుపెట్టారు. దీనితో ఆయన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినట్లయింది. బిజెపినే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నట్లయింది. ఈ తరుణంలో  బండి సంజయ్ ను పరోక్షంగా హీరోను చేసినట్లయింది. మరో రెండు సంవత్సరాల లోపే (2023) తెలంగాణలో ఎన్నికలు జరగాల్సివుంది. గత ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందుగా నిర్వహించడం గమనార్హం. రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న తీరు, మాట్లాడుతున్న అంశాలను చూస్తుంటే రాబోయే ఎన్నికలకు శంఖారావం ఇప్పుడే పూరించినట్లుగా కనిపిస్తోంది. పనిలోపనిగా ‘దళిత బంధు’ పై తన వైఖరిని మరోసారి చాటిచెప్పారు. దళిత ఓటుబ్యాంక్ ను మరింత దృఢపరుచుకునే దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు. దేశంలోనే ఇంత వరకూ ఇటువంటి పథకం లేకపోవడం వల్ల, ఆ వైశిష్ట్యాన్ని ( exclusiveness) సద్వినియోగం చేసుకోడానికి ఆయన సిద్ధమవుతున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలనుకుంటున్న కెసిఆర్ కు ఈ అంశం కలిసిరావచ్చు. ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆయన అప్పుడప్పుడూ మాట్లాడుతుంటారు. సమయం,సందర్భం బట్టి ఆయన వాక్కులు జాతీయ రాజకీయాల చుట్టూ తిరుగుతుంటాయాన్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారా? లేదా? ఎప్పుడు పాల్గొంటారు? అన్నది ఆయనకే ఎరుక. 2024 లో సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆయన ప్రస్థానంపై ఒక స్పష్టత రావచ్చు.

Also read: ఒకే గూటిలోకి (ఇందిరా)గాంధీ పరివార్!

హుజూరాబాద్ దెబ్బ ఫలితమా?

ఈలోపు  పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల గెలుపుఓటములు, 2023లో తెలంగాణ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ పార్టీ సాధించుకున్న ఫలితాలు, జాతీయ స్థాయిలో బిజెపి, నరేంద్రమోదీ గ్రాఫ్ మొదలైన పరిణామాలను బట్టి కెసిఆర్ తత్కాల్ నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేయవచ్చు. హుజూరాబాద్ ఫలితాలను ఆయన తేలికగా తీసుకున్నట్లు పైకి మాట్లాడుతున్నా, బిజెపి విషయంలో కె సి ఆర్ మరింతగా అప్రమత్తమవుతున్నారని అర్ధమైపోతోంది. బిజెపిపై,  ఆ పార్టీ అగ్రనేతలపై నేడు కెసిఆర్ మాటల ఫిరంగులు పేలుస్తున్నా, సమీప కాలంలోనే దిల్లీ వెళ్లి నాలుగురోజులు మకాం వేసి, ప్రధాని నరేంద్రమోదీని, హోంమంత్రి అమిత్ షా వంటి ముఖ్యనేతలను మర్యాద పూర్వకంగా కలిసి, సంబంధాలలో సమతుల్యతను పాటించే విషయాన్ని విస్మరించరాదు  అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ పై కేంద్ర పన్నుల విధానం, యాసంగిలో వడ్లు, దిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమం, ధాన్యం కొనుగోలులో కేంద్ర సహకార రాహిత్యం, ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం, రాయలసీమకు నీరు,ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ఈ.డి, సిబిఐ, ఇన్ కమ్ టాక్స్ వంటి జాతీయ ఏజెన్సీల దాడులు, బెదిరింపులు చుట్టూ తెలంగాణ ముఖ్యమంత్రి రెండు రోజుల మీడియా సమావేశాలు సాగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, ఇప్పటి నుంచే కె సి ఆర్ ఆట మొదలుపెట్టారనిపిస్తోంది. బిజెపి ఎత్తుగడలు, పెంచుకొనే ప్రజాభిమానం, ముఖ్యనేతల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం మొదలైన అంశాలు గెలుపుఓటములపై ముఖ్య పాత్రను పోషిస్తాయి. హుజూరాబాద్ లో గెలుపుతో ఈటెల రాజేందర్ మంచి ఊపు మీద ఉన్నారు. బిజెపి తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయం కూడా తేలాల్సి వుంది. పార్టీలో కిషన్ రెడ్డి, మురళీధరరావు వంటి సీనియర్ నేతలు, బండి సంజయ్ వంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు, ఈటెల రాజేందర్ వంటి ప్రజాబలం ఉన్న నాయకులు ఉన్నారు. వీరందరి మధ్య సమతుల్యతను సాధించడం బిజెపికి అంత తేలికైన విషయం కాదు. దానికి తోడు  ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే, ఇంకా చాలా బలపడాల్సివుంది.  ఇప్పటి శక్తిసామర్ధ్యాలు సరిపోవు. రేపటి ఎన్నికల సమయానికి టి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తవుతుంది. హ్యాట్రిక్ కొట్టాలంటే ఇంకా కసరత్తులు చేయాలి. ఇప్పటి వరకూ పార్టీ బలంగానే ఉంది. కానీ, పార్టీలో అసంతృప్తులు లేకపోలేదు. పాలనపట్ల అన్ని వర్గాల ప్రజాభిమానాన్ని ఇంకా చూరగొనాల్సి వుంది. వై ఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల కొత్తగా రణక్షేత్రంలో దిగుతున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వంటి ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. వీటన్నిటిని కాచుకుంటూ టీ ఆర్ ఎస్ అధినేత ముందుకు సాగాల్సి వుంది. ఏది ఏమైనా, రాబోయే సార్వత్రిక ఎన్నికలు అంత ఆషామాషీగా ఉండవు. కేంద్ర ప్రభుత్వంపై, బిజెపి విధానాలపై ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, ధర్నాలకు దిగుతామని కెసిఆర్ అంటున్నారు.ఎవరికీ, దేనికీ భయపడేది లేదని ఆయన సవాల్ విసురుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.

Also read: హుజూరాబాద్ లో ఈటల విజయ పతాక

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles