ఫొటో రైటప్: ఎడమొహం, పెడమొహంగా ఉన్న షీ జిన్ పింగ్, మోదీ
ఈ రోజు 15 జూన్ 2023. సరిగ్గా మూడేళ్ళ కిందట 15 జూన్ 2020నాడు గల్వాన్ కనుమలలో చైనా, భారత్ సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరవైమంది భారత జవాన్లు అమరులైనారు. వారిలో పాత నల్లగొండ జిల్లాలో సూర్యాపేటకు చెందిన కెప్టెన్ సంతోష్ బాబు ఒకరు. అమరుడైన సంవత్సరం తర్వాత సూర్యాపేటలో సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతే. తర్వాత ఆయనను తలచుకోవడం మానేశారు.అమరుల కుటుంబ సభ్యులను కేంద్రమంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఇళ్ళకు వెళ్ళి పలకరించలేదు. రక్షణమంత్రి మాత్రం ఒక ట్వీట్ చేశారు. అందులో సైతం ప్రాణాలు అర్పించిన సైనికుల ధైర్యసాహసాల గురించి ప్రస్తావన ఉన్నది కానీ వారు ఏ దేశ సైనికులతో పోరాడుతూ మరణించారో లేదు. చైనా ప్రస్తావన లేనేలేదు. తెలంగాణ మంత్రి జగదీశ్వరరెడ్డి సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేశారు.
Also read: రైల్వే మంత్రి పదవికి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా పూర్వాపరాలు
మూడేళ్ళ కిందట జరిగిన దాడిలో చైనా భారత భూభాగాన్ని గణనీయంగా ఆక్రమించుకున్నది. కానీ ఈ విషయం దేశ ప్రధాని కానీ, రక్షణ మంత్రి కానీ దేశవాసులకు ఇంతవరకూ చెప్పలేదు. 03 జులై 2020న ప్రధాని గల్వాన్ వెళ్ళారు. అక్కడ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘నేను ఇద్దరు తల్లుల గురించి తలుస్తాను. ఒక తల్లి భారత మాత. మనందరి తల్లి. రెండో తల్లి మీ లాంటియోధులను కనిన వీరమాత. మీ తల్లులందరికీ నమస్కారం. అంతే. ఏ దేశంతో యుద్ధం జరిగిందో, ఎవరితో పోరాడుతూ మన జవాన్లు వీరమరణం పొందారో వివరంగా చెప్పడానికి ప్రధాని సిద్దంగా లేరు. అమరులైన జవాన్లకూ, వారి తల్లులకూ నమస్కారం చేసి వచ్చేశారు. చైనా గురించి మాత్రం పల్లెత్తు మాట మాట్లాడలేదు.
వాస్తవంగా చైనా సైనికులతో తలబడటానికి నెల రోజుల ముందుగానే కొందరు పాత్రికేయులు సరిహద్దులో చలనం ఉన్నట్టు, 2020 ఏప్రిల్ నుంచి చైనా సైనికుల మోహరింపు జరుగుతున్నట్టు వార్తలు రాశారు. వారిలో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. ఒకరు అజయ్ శుక్లా. ఆయన బిజినెస్ స్టాండర్డ్ లోనూ, తన బ్లాగు ‘బ్రాడ్ వర్డ్’లోనూ కథనాలు రాశారు. మరొకరు సుశాంత్ సింగ్. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో రాశారు. ‘టెలిగ్రాఫ్’ లో రాసిన సంఘర్షణ్ ఠాకూర్ ఇంకో జర్నలిస్టు. ప్రధాన స్రవంతికి చెందిన పత్రికలూ, టీవీ చానళ్ళూ అక్కడ ఏమీ జరగనట్టుగానే వ్యవహరించాయి. దీనినే ప్రఖ్యాత జర్నలిస్టు రవీష్ కుమార్ ‘గోదీ మీడియా’ అని పిలుస్తున్నారు. గోద్ అంటే హిందీలో ఒడ అని అర్థం. మోదీ ఒడిలో కూర్చుని వార్తలు ప్రచురించే మీడియాను ‘గోదీ మీడియా’ అని పిలుస్తున్నారు. వారికి సిగ్గూ,శరమూ లేదు. ఉన్నవి లేనట్టూ, లేనివి ఉన్నట్టూ రాస్తున్నారు. 1961-62లో భారత్-చైనా యుద్ధం జరిగినప్పుడు భారత సేనలు విపరీతంగా నష్టపోయాయి. చైనా కొన్ని వేల మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్నది. భారత పార్లమెంటులో ఈ అంశంపైన రెండు రోజుల చర్చ జరిగింది. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రతి ప్రశ్నకూ వివరంగా సమాదానం ఇచ్చారు. నిజానికి పార్లమెంటులో యుద్ధం గురించి చర్చించాలని బీజేపీ పూర్వరూపం అయిన జనసంఘ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు అటల్ బిహారీ వాజపేయి ప్రధానంగా పట్టుపట్టారు. నెహ్రూ సరేనన్నారు. ఓడిపోయామన్నఅవమానాన్ని దిగమింగుతూ పార్లమెంటులో మాట్లాడారు. గల్వాన్ లో ఘర్షణ జరిగి మూడేళ్ళు అయినప్పటికీ ఇంతవరకూ భారత ప్రధాని నరేంద్రమోదీ చైనాతో భారత్ ఘర్షణ జరిగినట్టు కానీ, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నట్టు కానీ వెల్లడించలేదు. మౌనమే ఆయన భాష. పైగా భారత బలోపేతమైన దేశమనీ, మరేదేశం మనవైపు కన్నెత్తి చూడలేదని గొప్పలు చెప్పుకుంటున్నారు.
Also read: అమిత్ షాతో చంద్రబాబునాయుడు భేటీ ఫలితం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గల్వాన్ లో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలతో పంచుకోవాలని ఒకటికి నాలుగు సార్లు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తనతో సహా దేశవాసులందరూ ప్రధాని వెంట నిలబడి ఉంటారనీ, భయపడకుండా జరిగింది ఏమిటో చెప్పాలనీ రాహుల్ విజ్ఞప్తి చేశారు. ‘డరియే మత్’ అంటూ హితవు చెప్పారు. జులై 3 నుంచి జులై 10వ తేదీ వరకూ నాలుగు విడతల రాహుల్ ప్రధానినీ, రక్షణమంత్రినీ ప్రశ్నించారు. ఒక్కరూ సమాధానం చెప్పలేదు. రాహుల్ ని ‘పప్పూ’ అంటూ, బఫూన్ అంటూ బీజేపీ నాయకులు అపహాస్యం చేశారు. సాహసం చేసి వార్తలు రాసిన పాత్రికేయులను దేశద్రోహులని పిలిచారు. అంతే కానీ గల్వాన్ లో ఏమి జరిగిందో, చైనా ఎంతమేరకు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నదో చెప్పలేదు. ఈ రోజు వరకూ ప్రధాని కానీ, రక్షణ మంత్రి కానీ, విదేశాంగమంత్రి కానీ భారత భూభాగం గురించి కానీ, చైనా ఆక్రమణ గురించి కానీ మాట్లాడరు. పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు. నాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ రాహుల్ గాంధీకి ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలుసుకోవాలంటూ ఉపన్యాసం దంచారు. రాహుల్ గాంధీ సైనికులను అవమానించారంటూ బీజేపీ ప్రవక్త సంబిద్ పాత్ర వ్యాఖ్యానించారు. అంతే కానీ మన జవాన్లమీద దాడి చేసింది చైనా సైనికులు అని చెప్పడానికి కూడా వారు సిద్ధంగా లేదు. చైనా పేరు ఇంతవరకూ ఎత్తలేదు. అంత భయం ఎందుకో?
యుద్ధం జరిగినా, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నా చైనాతో భారత వ్యాపారసంబంధాలు సజావుగానే సాగుతున్నాయి. దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. షరా మామూలే. మనతో వ్యాపారం చేయడం వల్ల చైనాకు బోలెడు లాభం. ఒక వైపు భూమి ఆక్రమించుకున్నది. మరోవైపు వాణిజ్యంలో లాభాలు దండుకుంటున్నది. ఒకరకంగా మనం చైనాకు దాసోహం అన్నట్టు లెక్క.
చైనా సైనికులతో భారత సైనికులు ఘర్షణ పడినట్టు 16 జూన్ 2020న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సరిహద్దు నుంచి సమాచారం అందింది. దాంట్లో ముగ్గురు లేదా నలుగురు జవాన్లు మరణించారని ఉంది. తర్వాత 16వ తేదీ రాత్రి గం. 10.20లకు వచ్చిన సైనిక ప్రకటనలో ఇరవై మంది జవాన్లు మరణించారని ఉంది. కానీ జవాన్ల పేర్లు కానీ వారి చిరునామాలు కానీ వెల్లడించలేదు. జవాన్ల కుంటుంబాల పరిస్థితి అగమ్యగోచరం. పేర్లను మూడు రోజుల తర్వాత వెల్లడించారు. గల్వాన్ లో జరిగిన ఘర్షణ వివరాలను రెండు మాసాల పాటు దాచి ఉంచారు. కొన్ని వందల చదరపు మైళ్ళ భూమిని చైనా ఆక్రమించుకున్న అనంతరం భారత దేశంవైపు కన్నెత్తి చూసే సాహసం ఏ దేశం చేయలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ గంభీరంగా, రెప్పవాల్చకుండా దేశ ప్రజలకు చెప్పారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో కూడా గత మూడేళ్ళుగా లద్ధాఖ్ మీద కానీ, గల్వాన్ మీద కానీ, చైనా దురాక్రమణ గురించి కానీ చర్చ ఏ మాత్రం జరగలేదని జర్నలిస్టు సుశాంత్ సింగ్ తెలియజేశారు.
Also read: ఒంటరిగా, గంభీరంగా రాజందండంతో మోదీ
గల్వాన్ ఘటన జరిగిన 36 గంటల తర్వాత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. దేశరక్షణలో ఇరవై మంది భారత యోధులు ప్రాణాలు త్యాగం చేసినట్టు తన సందేశంలో తెలిపారు. కానీ ఏ దేశం సైనికులతో పోరాడుతూ భారత సైనికులు మరణించారో చెప్పలేదు. అసలు చైనాతో ఘర్షణ జరిగినట్టు రక్షణ మంత్రి, ప్రధానమంత్రి చెప్పకపోవడం, చెప్పడానికి సంకోచించడం గమనార్హం. దీనికి సమాధానం విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ 23ఫిబ్రవరి 2023న చేసిన ప్రకటనలో దొరుకుతుంది. ‘‘చైనా పెద్ద ఆర్థికవ్యవస్థ, నేనేమి చేయాలి?మనది చిన్న ఆర్థిక వ్యవస్థ. చైనాతో తలబడమంటారా?’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన చేసిన జైశంకర్ ను బర్తరఫ్ చేయడానికి ప్రధాని సంకోచించవలసిన అవసరమే లేదు. కానీ అటువంటిది ఏమీ లేదు. అంటే జైశంకర్ వ్యాఖ్యానంతో ప్రధాని ఏకీభవిస్తున్నారనుకోవాలి.
ఒక వైపున 15 జూన్ 2020న గల్వాన్ లో ఘర్షణలు జరుగుతుంటే చైనా సైనిక బృందంతో భారత సైనిక బృందం 10 జూన్ వరకు చర్చలు జరిపింది. ఈ చర్చలు ఇంతవరకూ 18 విడతలు జరిగాయి. ఫలితం పూజ్యం. చైనా భారత భూభాగంలోకి ఎనిమిది కిలోమీటర్లు చొచ్చుకొని వచ్చి అట్లాగే నిలబడి ఉన్నదని సంఘర్షణ్ ఠాకూర్ ‘టెలిగ్రాఫ్’ లో రాశారు. ఉత్తరాఖండ్ లోనూ, సిక్కిం లోనూ, లడఖ్ లోనూ, అరుణాచల్ ప్రదేశ్ లోనూ 15 జూన్ 2020 కి పూర్వస్థితి ఇప్పటికీ ఉన్నదా అన్నది జర్నలిస్టు సుశాంత్ సింగ్ ప్రశ్న. 18 విడతల చర్చలు జరిగిన తర్వాత కూడా రెండు ప్రదేశాలలో ఇప్పటికీ రెండుదేశాల సైనికులు సంఘర్షణ వాతావరణంలోనే ఉన్నారు. గల్వాన్, తదితర ప్రాంతాలలో రెండు దేశాల సైనికులు యద్ధ వాతావరణం నుంచి బయటపడినప్పటికీ ఆ రెండు ప్రదేశాలలో మాత్రం తుపాకులు పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. 26 పెట్రోలింగ్ పాయింట్ల దగ్గరికి భారత సైనికులు వెళ్ళే పరిస్థితులు లేవు. ఎందుకీ పరిస్థితి ఉన్నదనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. ప్రధాని చెప్పరు. రక్షణ మంత్రి చెప్పరు. విదేశాంగమంత్రి తనదైన రీతిలో చెబుతారు. ఇదీ చైనాతో మన వ్యవహారం. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్న మోదీని ప్రపంచ నాయకుడుగా కీర్తించడానికి జీ-20 వేదికను జైశంకర్ వినియోగించుకున్నారు. మోదీ ఏమి మాట్లాడుతారోనని ప్రపంచ దేశాల అధినాయకులందరూ చెవులు రిక్కించుకొని ఎదురు చూస్తున్నారంటూ జైశంకర్ అంటున్నారు. చైనాకు వ్యతిరేకంగా భారత్ ను మోహరించాలని అమెరికా ప్రయత్నం. అందుకే మోదీకి వాషింగ్టన్ లో అసాధారణ స్థాయిలో ఆహ్వాన సన్నాహాలు జరుగుతున్నాయి. చైనా అంటే జంకుతున్న మోదీ వాషింగ్టన్ లో ఎట్లా స్పందిస్తారో చూడాలి. చైనాతో ఏ పరిణామానికైనా సిద్ధంగా ఉండాలనీ, అదే సమయంలో చైనాను రెచ్చకొట్టగూడదని భారత ప్రభుత్వ విధానమని అర్థం చేసుకోవాలి.