పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్ ఏ మషేల్కర్ దేశంలోని శాస్త్ర-సాంకేతికవేత్తలలో ప్రముఖులు. దేశంలోని అత్యున్నత పదవులను ఆయన అలంకరించారు. భారత జాతీయ శాస్త్ర అకాడెమీ (నేషనల్ సైన్స్ అకాడెమీ) అధ్యక్షులుగా, శాస్త్ర, సృజనాత్మక పరిశోధనల అకాడెమీ (అకాడెమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటీవ్ రీసెర్చ్) అధ్యక్షులుగా పని చేశారు. నా తాజా పుస్తకం ‘ద థర్డ్ ఐ ఆఫ్ గవర్నెన్స్’ (2021) కి ఆయన రాసిన ముందుమాట నాపైన చెరగని ప్రభావం వేసింది. నా పుస్తకం ‘‘విస్తారమైన ఆత్మపరిశీలనకూ, చర్చోపర్చలకూ, అన్ని స్థాయిలలో పరిశోధన విస్తృతినీ, నాణ్యతనూ పెంచేందుకూ అవసరమైన కొత్త పరిష్కారాలు కనుగొనడానికీ దారితీస్తుందని’’ ఆయన ఆశించారు. డాటా (సమాచారం), స్టాటిస్టిక్స్ (అంకెలు), పరిశోధన రాజకీయ ఇష్టాయిష్టాలకు లొంగిపోయి ఎట్లా వివాదాస్పదంగా మారాయో నేను ఆ పుస్తకంలో వివరించాను.
Also read: ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ మంత్రతంత్రాలు
1947లో పేదరికానికీ, నిరాక్షస్యతకూ, మతకలహాలకూ, కొరతలకూ ఆలవాలమైన భారత దేశం కడచిన 75 ఏళ్ళలో చాలా దూరం ప్రయాణం చేసింది. ఇప్పుడు ఇది మిగుళ్ళతో పుష్కలంగా ఉంటూ బలమైన ఉత్పత్తి రంగంతో సాటిలేని విద్యావ్యవస్థతో, కమ్యూనికేషన్ రంగంలో అధునాతన సదుపాయాలతో, ఆరోగ్య సదుపాయాలతో, పరిశోధనాసంస్థలతో, సాప్ట్ వేర్ రంగంలో వైతాళికులై ప్రపంచాన్ని శాసిస్తున్న వారితో విరాజిల్లుతున్న దేశం. కొన్ని లోపాలు ఉండవచ్చు. కానీ ఈ దేశం గణనీయమైన విజయగాథకు ఉదాహరణ. ఇదంతా ఎట్లా సాధ్యమైంది?
సంపన్నమైన వారసత్వం, కొత్త విషయాలు తెసుకోవాలన్న ఆసక్తి కలిగిన ప్రజలు, రాజ్యాంగం ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. దేశం వివిధ రంగాలలో పరిశ్రమించి విజయాలు సాధించడానికీ రాజకీయ నాయకత్వం, పౌరసమాజం, వార్తాపత్రికారంగం చేసిన కృషి కూడా కారణం. అయితే, ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విధానాలూ, ప్రాథమ్యాలూ నిర్దేశించడంలో అంతిమ నిర్ణేతలుగా ఎదిగాయి. కొన్ని సందర్భాలలో పౌరుల, సామాజికవర్గాల, పౌరసమాజం అభిప్రాయాలను ఖాతరు చేయకుండా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకునే పరిస్థతి ఉంది.
Also read: పీకే ఎన్నికల తంత్రమే గెలుపు మంత్రమైతే ప్రజాస్వామ్యం ఏమౌతుంది?
స్వతంత్ర పరిశోధనపైన దృష్టి
డెబ్బయ్ ఏళ్ళ కిందటే ముందు చూపుతో చూసినట్టు నెహ్రూ-మహలానొబీస్ జంట అంకెలూ, విశ్లేషణలూ కొత్త మార్గాలు చూపిస్తాయన్న విశ్వాసంతో క్షేత్ర సర్వేలకూ, క్షేత్రం నుంచి సమాచారం తెప్పించుకునే విధానాలకూ శ్రీకారం చుట్టారు. రాజకీయ నాయకులూ, అధికారులూ చెప్పినట్టు కాకుండా శాస్త్రవేత్తలూ, సాంకేతిక నిపుణులూ, ఆర్థికవేత్తలూ స్వతంత్రంగా పని చేయాలని వారు కోరుకున్నారు. లోపలి నుంచి – అంటే ఎవరైతే విధానాలను అమలు చేస్తారో వారి నుంచి (రాజకీయ నాయకులూ, అధికారులు) వచ్చే అంకెలు అంతగా వస్తునిష్టంగా ఉండవని వారు విశ్వసించారు. అందుకే వారు స్వతంత్ర పరిశోధన చేయడానికీ, గణాంకాలు సేకరించడానికీ, లెక్కలు కట్టడానికీ అవసరమైన సంస్థలను స్వతంత్ర ప్రాతిపదికపైన నెలకొల్పారు. అటువంటి సంస్థలకు స్వయం నిర్ణయాధికారాలు ఉండాలని నిర్ణయించారు. వాటి పనితీరును పరిశీలించి అవసరమైతే దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి తగిన వ్యవస్థనూ ఏర్పాటు చేశారు. ఆర్థికాభివృద్దికి మాత్రమే కాకుండా సామాజికాభివృద్ధికి కూడా స్వతంత్ర, నిరంతర పరిశోధన ఏకాగ్రదృష్టితో సాగాలని వారు భావించారు. దేశంలో సామాజికార్థిక ప్రగతిని వేగవంతం చేయడానికి స్వతంత్ర పరిశోధన పట్ల వారికి గల అవగాహన దోహదం చేసింది. పరిశోధనకు గల శక్తిసామర్థ్యాలను గుర్తించడం వల్లనే వారు దేశంలో సామాజికార్థిక పరివర్తనలో వేగాన్ని పెంచగలిగారు. ఇదంతా స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 20-25 ఏళ్ళలో సంభవించింది. ఆ తర్వాత అటువంటి ప్రాతిపదికను నిర్లక్ష్యం చేయడం ద్వారా అంతవరకూ జరిగిన కృషిని నిష్ఫలం చేశారు. 1970 – 2020లో పరిశోధన అవకాశాలూ, ప్రాథమ్యాలలో విధాన నిర్ణేతల ఆలోచనా ధోరణి ప్రకారం మారాయి. దేశ ప్రగతిమార్గంలో కొన్ని చోట్ల మార్పులూచేర్పులూ జరిగాయి. విధాన నిర్ణయ క్రమంలో రాజకీయ పార్టీల ఆధిక్యం పెరగడంతో ఎన్నికలలో విజయం సాధించడమే పరమావధిగా మారింది. పరిశోదనలో కూడా ఇది అంతర్లీనంగా ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ ధోరణి మరింత విస్పష్టంగా, విస్తృతంగా కనిపిస్తోంది. పరిశోధనలో సైతం ప్రజలను ఎట్లా సుముఖులను చేసుకోవాలనే అంశానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ పార్టీలు చేస్తున్న పనిని ఆమోదిస్తూ వారికి దోహదం చేసే పరిశోధన (సపోర్టివ్ రీసెర్చ్) చేయడం సర్వసాధారణమైంది. సంక్షేమ విధానాలు ప్రజలను ప్రభుత్వంపైన ఆధారపడే జీవులుగా చేస్తాయి. ప్రజల స్థాయిని లబ్ధిపొందే పౌరులుగా దిగజార్చుతాయి. భారత దేశం ఎక్కువగా అభివృద్ధి సాధించకపోవడానికీ, ఐక్య రాజ్య సమితి (2005-2030) నెలకొల్పిన కనీస ప్రగతి లక్ష్యాలనూ, నికర అభివృద్ధినీ సాధించడంలో విఫలం కావడానికీ ఈ విధానాలే దారితీశాయి. ఇటీవలి దశాబ్దాలలో ఈ దిగజారే ధోరణిని గమనించడం, అర్థం చేసుకోవడం అవసరం.
Also read: పౌరుల ప్రభుత్వాధీనత పెరుగుతోంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గుతోంది
పరిశోధన తప్పనిసరి
అమెరికా అవతరించిన వందేళ్ళకే అగ్రరాజ్యం (సూపర్ పవర్)గా ఎదిగింది. ఇజ్రాయెల్ చిన్నదేశమైనా, కొత్త దేశమైన ఏర్పడిన నాలుగు దశాబ్దాలలో బలమైన రాజ్యంగా రూపాంతరం చెందింది. జపాన్ హిరోషిమా, నాకసాకీ బాంబింగ్ లు సర్వనాశనమైన తర్వాత పీనిక్స్ పక్షిలాగా అగ్రారాజ్య స్థాయికి స్వల్పకాలంలో ఎదిగిపోయింది. పరివర్తన, సంపద సాధించడంలో ఆధునిక మలేషియా ఒక సముజ్జ్వలమైన ఉదాహరణ. ఈ నాలుగు దేశాలకూ వర్తించే ఉమ్మడి అంశం ఏమంటే ఆ దేశాలలో బలమైన పరిశోధనా వ్యవస్థని నెలకొల్పుకొని శాస్త్రీయ దృక్పథాన్ని ఆచరిస్తున్నారు. దీనికి తోడు కష్టపడి పని చేసే మనస్తత్వం ప్రజలకి ఉంది. దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకత్వం కూడా అందుబాటులో ఉంది. భారత పరిశోధకులు దేశం వెలుపల ఘనవిజయాలు సాధిస్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశం వదిలి బయటికి వెళ్ళిన తర్వాత భారతీయ యువత అగ్రశ్రేణిలో అగ్రగాములుగా వెలుగొందుతున్నారు ఎందుకని? వారి సృజనాత్మక శక్తులను వినియోగించేందుకు దేశంలోపల వారికి అవకాశాలు లభించవా? దేశ ప్రాథమ్యాలలో ఎక్కడైనా ఏదైనా పొరబాటు ఉన్నదా? సాంఘికార్థిక ప్రగతిలోనూ, అసమానతలను తగ్గించడంలోనూ ఎందుకు మనం ముందు లేము? పరిశోధనలో, ప్రగతిలో మనం అగ్రగాములుగా ఎందుకు లేము? ప్రపంచ దేశాల వ్యవస్థలో దేశాల స్థాయిని నిర్ణయించేది పరిశోధన, అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ – ఆర్ అండ్ డీ) కార్యక్రమాలకు దర్శకత్వం వహించే వ్యవస్థ శక్తిసామర్థ్యాలేనా? అమెరికా, జపాన్, కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు దేశ ఆదాయంలో మూడు శాతానికి పైగానే పరిశోధన, అభివృద్ధి రంగాలపైన ఖర్చు చేస్తూ ఉంటే ఇండియా చేస్తున్న ఖర్చు ఒక్క శాతం కూడా లేదు. నిజానికి ఎంత శాతం ఖర్చు చేశామన్నదానికంటే కూడా పరిశోధన ఎంత పారదర్శకంగా జరుగుతోందీ, దాని ఫలితాలను అధికారులూ, ప్రభుత్వాలూ ఎంతగా ఉపయోగించుకుంటున్నాయనేది ముఖ్యం. మనం దారి తప్పామా? మన దేశానికి వందేళ్ళు వచ్చే 2050 నాటికి మన దేశ ప్రజల పరిస్థితి ఎట్లా ఉండబోతోంది?
Also read: చర్చ లేకుండా బిల్లుల ఆమోదం: రాజ్యాంగ సూక్ష్మాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి
పరిశోధన విఫలమైనదని కాదు. విధాన నిర్ణేతల అవసరాలూ, ప్రాథమ్యాలూ మారాయి. ఎన్నికల రాజకీయమే అన్నిటి కంటే ప్రధానం కనుక దాని ప్రభావం పరిశోధనపైనా పడుతోంది. తక్షణ ప్రభావం, ఫలితాలు ఎన్నికల రాజకీయానికి అవసరం. పరిణామశీలమైన ప్రణాళికలకు ప్రభావ పరిశీలన, విలువకట్టడం, క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకోవడం వంటి కార్యక్రమాలు ప్రధానం. వ్యక్తిగత ప్రయోజనాలకూ, ఆకాంక్షలకూ స్థానం లేదు. ప్రజాస్వామ్యానికి పరిశోధన అనేది విద్య, మీడియా రంగాల వలెనే ఒక రక్షణ కవచం వంటిది. పరిశోధనను ప్రజల మూడో కన్నుగా నవభారత నిర్మాతలూ, ప్రణాళికా రచయితలూ భావించారు. రాజ్య సౌధాన్ని నిలబెట్టే మూలస్తంభాల లాగానే వీటిని కూడా సమర్థమైన, ఆచరణయోగ్యమైన అంశాలుగా పరిగణించారు.
Also read: జనాభా విధానం ఎన్నికల హెచ్చరికా? ఎన్నికల వాగ్దానమా?
గణాంకాల పవిత్రత
‘ప్రగతి (డెవలప్ మెంట్),’ ‘సంక్షేమం (వెల్ఫేర్),’ ‘శక్తిమంతం చేయడం (ఎంపవర్ మెంట్)’ అన్నవి గణాంకాల సాయంతో సాకారం కావాలి. అనుభవంలోకీ, అవగాహనలోకీ రావాలి. ప్రభుత్వ విధానాలు ప్రచార విధానాలుగా (పబ్లిసిటీ పాలసీస్), ప్రజారంజకమైన విధానాలుగా (పాలిసీస్ ఆఫ్ పాపులిజం) తయారైనప్పుడు జనరంజకం(పాపులిజం) అనే భ్రమకు హద్దూపద్దూ ఉండదు. నాయకులూ, పార్టీలూ, ప్రభుత్వాలూ, వార్తాసంస్థలూ బూటకపు ఫలాలపైనే ఆధారపడాలి. అటువంటి పరిస్థితులలో మనం ఇప్పుడు ఉన్నాం. స్పందించే గుణం మనలో ఉన్నదా? ఇటువంటి పెడధోరణులు వేళ్ళూనుకుంటే, తక్షణ సర్వేలూ, రేటింగులూ వెంటవెంటనే ఇచ్చుకూంటూ అసహజమైన సంతృప్తి పొందే సమాజంలో సుపరిపాలన సాధ్యమా? పరిశోధన వ్యవస్థ గురించి కొత్త విద్యావిధానం కనీసం ప్రస్తావించినందుకు సంతోషించాలి.
Also read: ప్రాథమి విద్యను ప్రోత్సహిస్తున్నామా? పాడుచేస్తున్నామా?
దేశంలోని విద్యావ్యవస్థలో పని చేస్తున్న సహచరులకు నా విజ్ఞప్తి ఒక్కటే. ఏమీ పట్టనట్టు ఉండకండి. దేన్నీ నిర్లక్ష్యం చేయకండి. కంటికి కనిపిస్తున్న ధోరణులనూ, తక్షణ, సుదీర్ఘకాలంలో సంభవించే వాటి పర్యవసానాలనూ గమనించండి. ఉదాహరణకు టీఆర్ పీ రేటింగ్ పరిగెత్తించే టీవీ చానళ్ళూ, ఎన్నికల సమయంలో ప్రకటించే ఉచితాలూ, ‘సంక్షేమ’ పథకాలూ ఒకే విధంగా పనిచేస్తాయి. ప్రభావాన్నీ, విశ్లేషణనూ స్వతంత్రంగా, స్వేచ్ఛగా, విశ్వసనీయంగా అధ్యయనం చేయడం ఇటువంటి పరిస్థితులలో ఎట్లా సాధ్యం అవుతుంది? ఏవరో ఒకరికి విధేయత కలిగి పోటీ పడి చేస్తున్న తాత్కాలికమైన సర్వేలూ, రేటింగ్ లూ, పరిశోధనల నుంచి ఉద్భవిస్తున్నగణాంకాల విశ్వసనీయతను న్యూస్ ఎడిటర్లూ, విశ్లేషకులూ గమనంలో పెట్టుకోవాలి. అటువంటి వనరులు రాజకీయ పార్టీలకు సరిపోతాయి కానీ మీడియా సంస్థలకు కాదు. వార్తాసంస్థలూ, విద్యాసంస్థలూ, చురుకైన పౌరులూ నిత్యం జరిగే రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఆలోచించేవారూ గమనంలోకి వస్తున్నఅంకెల పవిత్రతనూ, విశ్వసనీయతనూ పరిశీలించిన తర్వాతనే స్వీకరించాలి.
Also read: మనదేశంలో గాంధీజీ ఆదర్శాలు వేళ్ళూనుకున్నాయా?
(డాక్టర్ ఎన్ భాస్కరరావు గత యాభై ఏళ్ళుగా పరిశోధన ప్రాతిపదికగా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేస్తూ విశ్లేషిస్తూ ఉన్నారు. డజనుకుపైగా గ్రంథాలు రచించారు.)