రామాయణమ్ – 61
తెల్లవారగానే సుతీక్ష్ణ మహాముని వద్ద సెలవు తీసుకొని దండకారణ్యములో నివసించే మునుల ఆశ్రమాలను చూడటానికి బయలు దేరాడు రాముడు.
అంతకుముందే వారందరికీ, మిమ్ములను రక్కసుల బారి నుండి కాపాడతానని, అభయమిచ్చివున్నాడు రాఘవుడు,
ముగ్గురూ ఎప్పటిలాగే నడవ సాగారు.
Also read: దండకారణ్యంలో నివాసయోగ్యమైన స్థలంకోసం రాముడి అన్వేషణ
అప్పటి దాకా మౌనంగా ఉన్న సీతమ్మ, రామా నేనొక మాట చెపుతాను విను అన్నది.
‘‘మనిషికి కామము వలన మూడు రకాలైన వ్యసనాలు జనిస్తాయి.
వాటిలో మొదటిది అబద్ధమాడటం!సత్యసంధుడవైన నీవు కలలో కూడా అసత్యమాడవు. ఆ విషయములో సందేహములేదు.
‘‘ఇక రెండవది, పరుల భార్యలను కామించుట! ఏకపత్నీవ్రతుడవైన నీవు అలాంటి పాపపు పని ఎప్పుడూ చేయవు. అలాంటి కోరిక నీకు ఇప్పుడు లేదు. ఇక ముందు కూడా కలుగదు. ఇది సత్యము.
‘‘ఇక మూడవది, అకారణముగా వైరము పూని క్రూరముగా ప్రవర్తించటం. నీకు రాక్షసులు ఏ అపకారం చేసారని వారితో వైరం పెట్టుకోవాలనుకుంటున్నావు? నీకు ఏ అపకారం చేయనివారిని సంహరిస్తానని మునులకు ఎందుకు మాట ఇచ్చావు?
Also read: దండకారణ్యంలో విరాధుడి వధ
తాపస వృత్తినవలంబించి పదునాలుగేండ్లు అరణ్యములో గడపటానికొచ్చాము. ఆ పని పూర్తి చేసుకొని తిరిగి వెళ్దాము. అయోధ్యకు వెళ్ళిన తరువాత మరల క్షత్రియ ధర్మము పాటించవచ్చు. అడవిలో వద్దు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణాలు నీలో క్రౌర్య ప్రవృత్తిని పెంచరాదు. నీ సహధర్మచారిణిగా ధర్మము అని నాకు తెలిసినది నీకు చెప్పటం నా బాధ్యత. ధర్మమూర్తివి! నీకు తెలియని ధర్మమేమున్నది.’’
అని హితవు పలికింది సీతమ్మ.
(భర్తకు ఏ సమయములో ఏ హితవు చెప్పాలో తెలిసిన తల్లి సీతమ్మ.
మౌనంగా ఏమీ కూర్చుని ఆయనతో నడవలేదు. అరణ్యములో రాక్షససంహారము చేస్తాను అని మాట ఇచ్చాడాయన! దాని ఫలితమే రాబోయే రోజులలో వారిరువురూ ఎదుర్కొన్న కష్టాలు. ముందే ఊహించి ఆవిడ హితవు పలికింది.)
‘‘జనకరాజపుత్రి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధం గానే మాట్లాడావు నీవు. కానీ సీతా! వనములలో కందమూల ఫలములు తింటూ తపస్సు చేసుకొంటున్న మునులతో రాక్షసులు అకారణంగా వైరం పెట్టుకొని వారి తపస్సు భగ్నం చేసి వారిని హింసించి చంపి తింటూ వుంటే నిస్సహాయులైన వారు నా వద్దకు వచ్చి మొర పెట్టుకున్నారు. శరణు కోరిన వారిని రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నుండి దూరంగా ఎలా జరిగేది? నీవేకదా చెప్పావు నాకు…..”పీడితులైన వారి దీనాలాపములు వినబడకుండా ఉండటానికే క్షత్రియులు ధనుస్సు పట్టుకుంటారు” అని. ‘‘సీతా, వారు అడగక పోయినా దుఃఖితులైనవారిని పాలించటం నా కర్తవ్యం. పైగా ఇప్పుడు మాట కూడా ఇచ్చాను. నా ప్రాణాన్ని, నిన్ను, లక్ష్మణున్నిఅయినా వదులుకుంటాను గానీ ఇచ్చిన మాట తప్పను’’ అని స్థిర చిత్తంతో పలికాడు రాముడు.
Also read: సీతారామలక్ష్మణుల అరణ్య ప్రవేశం
అలా పలికి ముందు నడిచాడు రామచంద్రుడు. ఆయన వెనుక సీతమ్మ, ఆవిడను అనుసరిస్తూ లక్ష్మణుడు నడుస్తున్నారు.
మునులందరితో కలసి ఆశ్రమ సముదాయమునకు చేరుకొని అక్కడ కొంతకాలము వారితో కలిసి జీవించారు. ఆ ఆశ్రమ వాటికలోనే సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాల కాలం గడిపేశారు.
ఒకరోజు రాముడు సుతీక్ష్ణ మహాముని చెంత కూర్చొని, ‘‘స్వామీ ఈ ఆశ్రమానికి దగ్గరలోనే అగస్త్య మహాముని కూడా ఉన్నారని మునులంతా చెప్పుకుంటూ ఉంటే విన్నాను. నాకు ఆ మహర్షిని దర్శించాలనే కోరిక కలిగింది. ఆయన ఆశ్రమానికి దారి చూపండి’’ అని అడిగాడు.
‘‘రామా, నేనే ఆ విషయం నీకు చెప్పాలనుకున్నాను. నీవే స్వయంగా అడిగావు. ఇక్కడనుండి నాలుగు యోజనాల దూరం వెళితే అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది’’ అని చెప్పి అక్కడికి ఎలా వెళ్ళాలో వివరంగా తెలిపారు సుతీక్ష్ణ మహర్షి.
Also read: సీతారామలక్ష్మణులకు అత్రి, అనసూయల ఆతిథ్యం
వూటుకూరు జానకిరామారావు