Tuesday, December 3, 2024

అమరావతి విషయంలో సుప్రీం ధర్మాసనం అన్నది ఏమిటి? మనం అనుకుంటున్నది ఏమిటి?

సోమవారంనాడు సుప్రీంకోర్టు బెంచ్ అమరావతికి సంబంధించిన పిటిషన్లపైన విచారిస్తూ చేసిన వ్యాఖ్యల్ని, ప్రకటించిన నిర్ణయాలను ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకొని సంబరం చేసుకున్నారు. వైసీపీ అనుకూల మీడియా ఒక రకంగానూ, వ్యతిరేక మీడియా దానికి విరుద్ధంగానూ విషయాన్ని అన్వయించాయి, ప్రచురించాయి, ప్రసారం చేశాయి. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం  చేసిన వ్యాఖ్యలలో కొన్ని న్యాయవిచారణలో భాగంగా చేసినవి. తీర్పులో భాగంగా చేసినవి కావు.

అన్ని వసతులతో రాజధాని ప్రాంతాన్ని నెలరోజులలోగా అభివృద్ధి చేయాలని ఆదేశించడానికి హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? చీఫ్ ఇంజనీరా? ఏపీలో కార్యనిర్వాహక విధులు హైకోర్టుకు ఎందుకు? హైకోర్టే ప్రభుత్వమైతే కేబినెట్ ఎందుకు? ప్రజాప్రతినిధులు ఎందుకు? ఆరు నెలలో రాజధాని నిర్మాణం సాధ్యమా? ఇటువంటి ప్రశ్నలు ధర్మాసనం నిర్ణయాలకు అనుగుణంగానే ఉన్నాయి. మొత్తం ఏడు అంశాలలో మూడు నుంచి ఏడు వరకూ గల అయిదు అంశాలపైనా ధర్మాసనం స్టే మంజూరు చేసింది. అవన్నీ గడువులకు సంబంధించిన అంశాలే. మిగతా రెండు అంశాలపైన విచారణ కొనసాగిస్తుంది. కేసును జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.

అంతవరకే. అమరావతే రాజధాని అనీ, మూడు రాజధానుల ప్రస్తావన లేదనీ, హైకోర్టు అమరావతిలోనే ఉంటుందనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవమే. వెనక్కి వెళ్ళలేరని న్యాయమూర్తులు ఎవ్వరూ అనలేదు. దేశంలోని అన్ని పత్రికలూ ప్రచురించిన వార్తల శీర్షిక ‘ఆరు మాసాలలో అమరావతిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు నిర్ణయంపైన సుప్రీంకోర్టు స్టే విధింపు’ అనే. కాగా కొన్ని తెలుగు పత్రికలు హైకోర్టు తీర్పుపైన స్టే ఇవ్వబోమని చెప్పినట్టు రాశాయి. మొదటి రెండు అంశాలపైన స్టే ఇవ్వకుండా విచారణ కొనసాగిస్తున్న మాట మాత్రమే నిజం. డిసెంబర్ నెలాఖరులోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేసుకు సంబంధించినవారందరికీ సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

2015లోని 2,3 షెడ్యూళ్ళలో పొందుపరచిన బాధ్యతలను ఏపీసీఆర్ డీఏ నిర్వర్తించాలి. ప్రజల నుంచి సమీకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏఫీసీఆర్ డీఏ కానీ రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం మినహా ఇతరులకు ధారాదత్తం చేయకూడదు. తనఖా పెట్టకూడదు. మూడో పార్టీకి ప్రయోజనం కల్పించరాదు. నెల రోజుల్లో సకల సౌకర్యాలు కల్పించాలనే అంశంపైనా, టౌన్ షిప్ ప్లానింగ్ పూర్తి చేయాలనే అంశంపైనా, ఆరు నెలల లోపు అమరావతి నగరం, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి అభివృద్ది చేయాలనే అంశంపైనా, అమరావతి రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లలో ప్రతిదానికీ అప్రోచ్ రోడ్లు, తాగునీరు, విద్యుత్తు సదుపాయం వగైరా వసతులన్నీ కల్పించాలన్న అంశంపైనా, అభివృద్ధి చేసిన ప్లాట్లను  ఏపీ ప్రభుత్వం, ఏపీసీఆర్ డీఏలు మూడు మాసాలలోగా సదరు రైతులకు అందజేయాలన్న అంశంపైనా సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేసింది.

ఇవి తాత్కాలిక ఉత్తర్వులు. ఎవ్వరి విజయమూ కాదు. అపజయమూ కాదు. రాజధానిని మార్చే శాసనాధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపైన స్టే మంజూరు చేయడానికి ధర్మాసనం అంగీకరించలేదు. ఎందుకంటే  ఆ విషయాన్ని విచారించబోతున్నది కనుక. స్టే ఇవ్వడానికి నిరాకరించడాన్ని పిటిషన్ ను కొట్టివేసినట్టు అన్వయించుకొని సంతోషిస్తే ఎట్లా? శాసనాధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు చేసిన వ్యాఖ్యను సుప్రీంకోర్టు సమర్థించిందని రాసుకుంటే ఎట్లా?  రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు నిరంజనరెడ్డి, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, సీనియర్ అడ్వకేట్ నఫ్డే వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం నిరుడు (2021) నవంబర్ 15న ఉపసంహరించుకున్నది.  చట్టాన్ని చేసే అధికారం శాసనసభకు లేదనే అధికారం హైకోర్టుకు లేదని వేణుగోపాల్ స్పష్టం చేశారు. అటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉన్నది కానీ రాష్ట్ర శాసనసభకు లేదని చెప్పడం కూడా సరికాదని ఆయన చెప్పారు. ఒక సారి చట్టాన్ని ఉపసంహరించుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం స్థానంలో మరో చట్టం తెస్తుందేమోనని హైకోర్టు వేచి ఉండాలని కూడా వేణుగోపాల్ అన్నారు.

వేణుగోపాల్ ఏదో అబద్ధం చెప్పినట్టు కొందరు యాంకర్లు వ్యాఖ్యానించారు. వేణుగోపాల్ ఏడు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో అవాస్తవాలు చెప్పిన సందర్భం లేదు. న్యాయపరమైన అన్వయం వేరుగా ఉండవచ్చును కానీ వాస్తవాలను వక్రీకరించే వ్యక్తి కాదు.

‘రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూరుస్తోంది. రెండకరాల్లోపు భూములున్న 29 వేలమంది చిన్న, సన్నకారు రైతులు భూములిచ్చారు. అందుకు సంబంధించిన చట్టబద్ధమైన ఒప్పందం ఉంది’’ అని జస్టిస్ జోసెఫ్ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్దంగా వ్యవహరించిందని అన్నప్పుడు ‘అదేమీ లేదు. అదంతా లేదు.  ఆ చట్టం రద్దయింది’ అని చెప్పారు. చట్టం రద్దు అయినప్పుడు సీఆర్ డీఏ పునరుద్ధరణ జరిగింది. చట్టం రద్దయిందంటే చట్టం రాకముందు ఉన్న పరిస్థితులే ఉంటాయి. అంటే అమరావతే రాజధానిగా ఉంటుంది. హైకోర్టూ అక్కడే ఉంటుంది. ఎప్పటి దాకా? కొత్త శాసన చేసే వరకూ. అటువంటి శాసన చేసేఅధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉన్నదా లేదా అన్న విషయం సుప్రీంకోర్టు తేల్చవలసి ఉంది. అదే ఈ వివాదంలో అత్యంత ముఖ్యమైన అంశం. సుప్రీంకోర్టు అభిప్రాయం తెలుసుకోవాలంటే ఇంకా చాలా మాసాలు ఆగాలి. కేంద్ర ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందో అన్నది ప్రధానం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles