Sunday, December 22, 2024

రిషి సునాక్ ఎందుకు ఓడిపోయారు?

బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ప్రమాణం స్వీకరించారు. ప్రధాని నివాసమైన లండన్ లోని టెన్ డౌనింగ్ స్ట్రీట్ భవనంలోకి మంగళవారంనాడే మారిపోయారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మూడో మహిళగా ట్రస్ చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. ఆమె సెప్టెంబర్ మొదటివారంలో జరిగిన కన్సర్వేటివ్ పార్టీ ఎలక్టర్స్ ఓటింగ్ లో భారత సంతతికి చెందిన రుషి సునాక్ ను ఓడించారు. మొదట కన్సర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులలో 137 మంది సునాక్ కు అనుకూలంగా ఓటు  వేస్తే లిజ్ ట్రస్ కి అనుకూలంగా 112 మంది మాత్రమే వేశారు. కానీ కన్సర్వేటివ్ పార్టీలో ఓటింగ్ హక్కు ఉన్న మొత్తం సభ్యులలో 81,326 మంది ట్రస్ కూ, 60,399 మంది రిషి సునాక్ కూ ఓటు వేశారు. సోమవారంనాడు జరిగిన ఓట్ల లెక్కింపులో ట్రస్ గెలుపొందినట్టు ప్రకటించారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత కన్సర్వేటివ్ పార్టీ అంతా ఒకే కుటుంబం లాంటిదనీ, కలసికట్టుగా ఉంటుందనీ, తాను కొత్త ప్రధానికి మద్దతు ఇస్తాననీ సునాక్ ప్రకటించారు.

పాకిస్తాన్ సంతతికి చెందిన సజీద్ జావిద్ రిషి సునాక్ కు సన్నిహితుడు. ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకున్నట్టు ప్రకటించగానే తాను ఆ పదవికి పోటీలో ఉన్నట్టు సునాక్ ప్రకటించాడు. దాంతో జావిద్ దూరమైనాడు. సునాక్ ప్రతిపాదిస్తున్న ఆర్థిక విధానాలు బ్రిటన్ కు హానికరంగా పరిణమిస్తాయని చెప్పాడు. ఒక జావిద్ మాత్రమే కాదు. మరో మంత్రి నధీం జహావీ కూడా ట్రస్ ను బహిరంగంగా బలపరిచారు. వీరిద్దరూ ఆసియా సంతతికి చెందినవారు. చాలా మంది కన్సర్వేటివ్ నాయకులు సునాక్ దూరమైనారు.

సునాక్ పరాజయంలో జాతివివక్ష పాత్ర ఉన్నదనే వాదనలో నిజం లేదని ఇటీవల కన్సర్వేటివ్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రస్ మంత్రిమండలిలో కూడా నాలుగు ప్రధానమైన శాఖలు శ్వేతజాతేతరుల చేతుల్లో ఉన్నాయి. కన్సర్వేటివ్ పార్టీ ఓటర్లలో శ్వేతజాతీయులూ,  వృద్ధులూ, పురుషులూ ఎక్కువగా ఉంటారు. వారి మనసుల్లో జాతి భావన బొత్తిగా లేదని చెప్పజాలము కానీ అదే ప్రధానమైన నిర్ణాయకాంశం కాదని గట్టిగా చెప్పవచ్చు. అన్నిటికంటే ప్రధానమైన అంశం సునాక్ కు వెన్నుపోటుదారుడనే పేరు స్థిరమైంది. జాన్సన్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేసిన సునాక్ అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ, 50మంది ఎంపీలూ రాజీనామాలు చేశారు. దాంతో జాన్సన్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు. జాన్సన్ రాజీనామా చేసిన వెనువెంటనే తాను రంగంలోకి దిగుతున్నానంటూ సునాక్ ప్రకటించడంతో, ‘రెడీ ఫర్ సునాక్’ అంటూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించడంతో  జాన్సన్ బాగా మనోవేదన చెందినట్టు అభిజ్ఞులు అంటున్నారు. ఎవరినైనా గెలిపించండి కానీ సునాక్ ను మాత్రం ఓడించాలని తన సన్నిహితులకు జాన్సన్  చెప్పినట్టు వార్తలు వచ్చాయి. జాన్సన్ ఎన్ని పొరబాట్లు చేసినా అతనికి కన్సర్వేటివ్ పార్టీలో మద్దతుదారులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. తన స్వార్థం కోసమే సునాక్ బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని పడగొట్టారని నమ్మేవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. కన్సర్వేటివ్ ప్రధానిగా తాను పోటీ చేయాలని రిషి సునాక్ చాలాకాలంగా అనుకున్నట్టూ, అందుకు సన్నాహాలు చేస్తున్నట్టూ, 2021లోనే రెడీ ఫర్ సునాక్ పేరుతో వెబ్ సైట్ ను రిజిస్టర్ చేసుకున్నట్టూ వార్తలు వచ్చాయి. జాన్సన్ కు ఇదంతా మనోవేదన కలిగించింది. ట్రస్ జాన్సన్ కు నమ్మిన బంటుగా ఉన్నారు. మొన్న తనను ఎన్నికైనట్టు ప్రకటించిన తర్వాత చేసిన ప్రసంగంలో కూడా ఆమె జాన్సన్ ను అదేపనిగా పొగిడారు. మళ్ళీ ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వచ్చి నిలదొక్కుకునే శక్తియుక్తులు జాన్సన్ సొంతం. యూరోపియన్ కామన్ మార్కెట్ నుంచి బ్రిటన్ వైదొలగాలని గట్టిగా వాదించి, వైదొలిగేటట్టు చేసిన ఘనుడు జాన్సన్. బ్రెక్సి ట్ హీరోగా ప్రఖ్యాతి గడించారు. ఆయన ఛణుకులు విసురుతూ హాస్యస్ఫోరకంగా మాట్లాడటాన్నీ, చేసిన తప్పులు ఒప్పుకోవడాన్నీ మెచ్చుకునేవారు చాలామంది ఉన్నారు.

ఆర్థికమంత్రి పదవికి సునాక్ రాజీనామా చేయడాన్ని కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలలో అత్యధికులు హర్షించలేదని సర్వేలు తెలిపాయి. ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో కూడా సునాక్ ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలలో సునాక్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ప్రతి విజేత వెనుక ఒక మహిళ ఉంటారని నానుడి. ఈ విషయంలో మాత్రం సునాక్ పరాజయం వెనుక ఆయన సతీమణి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షిత ఉన్నారు. ఆమె ఇప్పటికీ భారత పౌరసత్వాన్నిఉంచుకున్నారు. ఇన్ఫోసిస్ వాటాల నుంచి తనకు వచ్చే సంపదపైన పన్నులు కట్టనవసరం లేదని ఆమె భావించారు. నిజానికి చట్టప్రకారం కట్టనక్కరలేదు. కానీ దేశ ఆర్థికమంత్రి భార్యగా పన్ను కట్టడంలేదనే నిందను ఎదుర్కోవలసి వచ్చింది. విమర్శలు చెలరేగిన తర్వాత పన్ను కట్టేశారు. కానీ మచ్చ మిగిలింది.

రిషీ సునాక్ అత్యంత సంపన్నుడనే మాట కన్సర్వేటివ్ పార్టీ సభ్యులలో కూడా అయిష్టతకు దారి తీసింది. కోవిద్ మహమ్మారిని అరికట్టడంలో బోరిస్ జాన్సన్ తీసుకున్న చర్యలను రిషి సునాక్ తన ప్రచారంలో భాగంగా విమర్శించారు. జాన్సన్ అప్రతిష్ఠపాలైనారని సునాక్ అంచనా. అది తప్పని తేలింది. పదవీ విరమణ చేసిన తర్వాత జాన్సక్ పట్ల సానుభూతి పెరిగింది.

జాన్సన్ ప్రతికూల వైఖరి కారణంగానే ట్రస్ మంత్రిమండలిలో సునాక్ కు స్థానం లేకుండా పోయింది. ప్రధానమంత్రి పదవికి పోటీ జరిగిన ప్రతిసారి విజేత ఏర్పాటు చేసిన మంత్రిమండలిలో పరాజితులకు స్థానం ఉండేది. పరాజితుడు ఎంత బలహీనమైన వ్యక్తి అయినప్పటికీ మంత్రిమండలిలోకి ఆహ్వానించేవారు. సునాక్ ముందే మంత్రిమండలిలో చేరే ఉద్దేశం లేదని ప్రకటించారు. ఆయనను ఒప్పించే ప్రయత్నం కూడా జరగలేదు. ఇది ఇంతవరకూ అమలు జరుగుతూ వచ్చిన ఆచారానికి భిన్నం. సునాక్ తన రిచ్ మండ్ నియోజకవర్గం ప్రజలకు సేవచేస్తాననీ, వారు కోరుకున్నంతకాలం వారి ప్రతినిధిగా కొనసాగుతాననీ అన్నారు. ఆ విధంగా మనను వలస రాజ్యంగా రెండు వందల ఏళ్లకు పైబడి పరిపాలించిన బ్రిటన్ ను అదే వలస రాజ్యానికి చెందిన ఒక యువకుడు పరిపాలిస్తాడని ఆశించిన భారతీయులకు ఆశాభంగం కలిగింది. కానీ బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి ఒక భారత సంతతి యువకుడు పోటీ పడటమే గర్వకారణం.

ఒక భారత సంతతి వ్యక్తి ప్రధానిగా పోటీ పడటాన్ని హర్షించి 42 శాతం ఓట్లు ఇచ్చిన బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ సభ్యులను సైతం ఈ సందర్భంగా అభినందించాలి. 2004లో సోనియాగాంధీ ప్రధాని అవుతానంటే సుష్మాస్వరాజ్ చేసిన హంగామా గుర్తు తెచ్చుకుంటే బ్రిటిష్ ప్రజల ఔదార్యం మనకు అర్థం అవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles