Sunday, December 22, 2024

డిల్లీ చూపు ఏ.పి. కేంద్రితం ఎందుకయింది?

మరో రెండేళ్లలో మన దేశానికి స్వాత్యంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతాయి. మన  భవిష్యత్తు కొరకు వాగ్దానపూరితమైన ‘లీడర్స్’ గా నవతరం నుంచి అప్పటికి ఈ దేశ రాజకీయ వేదిక మీద ఉండేవారు ఎలా ఉండవచ్చు? నడుస్తున్న చరిత్ర దృష్టి కోణంలో నుంచి దీన్ని చూసినప్పుడు ఇదొక ఆసక్తికరమైన అంశం. అయితే ‘అకడమిక్’ దృష్టితో దాన్ని మనం గమనించాలని కనుక అనుకుంటే, పాతవి కాకుండా సరికొత్తదైన వొక ‘జియో-పొలిటికల్ మ్యాప్’ పరిధిలో జరుగుతున్న పరిణామాలను ప్రామాణికంగా చూస్తేనే; కొత్తగా అక్కడ పరిపాలనలో జరుగుతున్న ‘మార్పు’ లేదా ‘షిఫ్ట్’ విషయంగా వొక సమతూకమైన అంచనాకు మనం రాగలం. ఎందుకంటే అటువంటిచోట సామాజిక-నైసర్గిక సర్దుబాటు (‘జియో – సోషల్ రీమ్యాపింగ్’) తో పాటుగా పరిపాలనా సంస్కరణల అమలుకు ఉన్న అవకాశం ఎక్కువ.

పునాదుల  నుంచి నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్

అలా చూసినప్పుడు, ఈ దశాబ్దిలో జరిగిన రాష్ట్ర విభజన మన వద్దే ఉంది. వాటిలో విడిపోయే నాటికే తెలంగాణకు రాజధాని నగరం ఉంది. దాన్ని మినహయిస్తే, ఈ దేశం తూర్పు తీరంలో కొత్తగా పునాదుల నుంచి నిర్మించుకుంటూ వస్తున్న రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్. కనుక భారత్ ను రేపు వందేళ్ళ స్వాత్యంత్రం ‘మైల్ స్టోన్’ వద్దకు తీసుకువెళ్ళే నాయకత్వాలు ఎలా ఉండబోతున్నవి? అనేది వచ్చే పాతికేళ్ళు పాటు డిల్లీ గానీ… ఆ మాటకొస్తే దేశంగానీ ‘వాచ్’ చేయడానికి అన్నివిధాలా అనువైన నమూనా – ఆంధ్రప్రదేశ్. పైగా అక్కడి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి (47) అర్దిక సంస్కరణల కాలంలో విద్యార్ధిగా ఎదిగి, వాణిజ్య రంగం నుంచి ప్రజాజీవితంలోకి వచ్చినవారు. వీటన్నిటికీ అదనం, ‘రెడ్ ఫోర్ట్’ అంతఃపుర రాజకీయాలు ఎలా ఉంటాయో అనుభవంలో  తెలిసినవాడు కూడా. అందువల్ల డెబ్భై దశకం చివర రాజకీయాల్లోకి వచ్చిన నాయకులతో వీరిని పోల్చడం అస్సలు కుదరదు. అయినా లోపలి విషయాలు తెలిసినవారు అస్సలు  వై.ఎస్. సీనియర్ – జూనియర్ల మధ్యే ఆ తరాల వైరుధ్యం ఉండేది అంటారు.

బైపాస్ పరిష్కారం

ఇటువంటి వైవిధ్య నేపధ్యం మన రాజకీయ యవనిక మీద నెలకొని ఉన్నప్పుడు, వందేళ్ళనాటికి ఏ గమ్యానికి ఈ నాయకత్వం మన దేశాన్ని చేరుస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అందువల్ల, పాతికేళ్ళ తర్వాత దాన్ని చూసే అవకాశంలేని ఇప్పటి పెద్దతరానికి  ‘ఇండియా@75’ మజిలీ వద్ద దాన్ని అంచనా వేయడం వొక ‘బైపాస్’ పరిష్కారం. అయితే, అందుకు వొక షరతు – ఆ పనికి పూనుకునేవాళ్ళు ముందుగా తమ సంచుల్లో ఉన్న పాత తూనికలు కొలతల ‘టూల్స్’ను పూర్తిగా పక్కన పెట్టి ఆ తర్వాతే ఆ పనికి సిద్దపడాలి. అయితే, ఇటువంటి మదింపు వొకటి జరుగుతుందా లేదా అనేదానితో ఏమాత్రం సంబధం లేకుండా, అంధ్రప్రదేశ్ ఇప్పటికే వొక – ‘నెక్స్ట్ జెనరేషన్ రిఫార్స్మ్ ల్యాబ్’ గా మారడం మాత్రం నిజం!

కొత్త ‘సెట్టింగ్స్’

ఎందుకని అని మనం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తునప్పుడు, ‘సెట్టింగ్స్’ ప్రాతిపదికగా ఇక్కడ – కొత్త రాష్ట్రం, కొత్త ప్రాంతీయ పార్టీ, కొత్త నాయకత్వం, కొత్త పరిపాలన, కొత్త ప్రాధాన్యతలు, కొత్త సంస్కరణలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఇవి పరస్పర ఆధారితం కావడంతో, వీటి సమన్వయం తేలిక కావడం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న వొక అనుకూలత. ఇటువంటి అమరిక కుదిరిన నాయకత్వంగాని రాజకీయ పక్షంగాని ఇప్పటికైతే ఇక్కడ మరొకటి లేదు. అందువల్ల తదుపరి ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతున్న సంస్కరణల కంటే మేలైనవి మేము చేస్తామని ఎవరినా ప్రకటించడం గాని, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం తెచ్చిన మార్పుల్ని రద్దు చేయడంగాని అంత సులభం మాత్రం కాదు, అదొక పెద్ద కసరత్తు. అయినా ఇక్కడ అధికారాన్ని ఆశిస్తున్న పాత తరం వర్గాలు ఏవీ కూడా అంత పాటి ‘హోం వర్క్’ చేయగలిగినవి కూడా కాదు. వీళ్ళంతా ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు విఫలమైతే, అప్పుడు మళ్ళీ మేమే ప్రత్యామ్నాయం అవుతాం  అనే సాంప్రదాయ దింపుడు కల్లం ఆశతో కనిపెడుతున్నవారే! అందువల్ల వారికి ఇక మిగిలింది, అవరోధాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని వేగాన్ని తగ్గించడం.

రాహుల్ పై క్రూరమైన పరిహాసం

అలాగని పాత తరంతోనే ఇటువంటి సమస్య ఉంది అని కూడా కాదు. ‘పోస్ట్-రిఫార్మ్స్ ఎరా’ యువ నాయకత్వాలు కూడా అవతలవారు చేసే తప్పుల కోసం ‘కనిపెట్టడం’ జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికీ చూస్తున్నాం. నిజానికి ఎవరైనా ప్రజా జీవితంలోకి రావాలని అనుకున్నప్పుడు, వారు తమదైన ప్రాపంచిక దృష్టినుంచి తమ ప్రాధామ్యాలు ఎంచుకుంటారు. ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కనుక దీన్ని ప్రస్తావించడమే… ఉత్తరప్రదేశ్ లోని ‘హాథ్ రస్’ సంఘటన రాహుల్ గాంధీకి అందివచ్చిన అవకాశం అంటూ ‘ది హిందూ’ అసోసియేట్ ఎడిటర్ వర్గీస్ కే. జార్జి 14 అక్టోబర్ 2020  రాసిన వ్యాసానికి ‘Ferment in the heartland’ అని శీర్షిక పెట్టి – “యూ.పి.లో కులాల మధ్య ఘర్షణ బి.జే.పి.లో చీలికలకు దారితీసి, అమేధీలో ఓడిన రాహుల్ గాంధీకి మళ్ళీ యూ.పి.లోకి ప్రవేశానికి అవకాశంగా మారింది” అన్నారు. జార్జి చేసిన ఈ వ్యాఖ్యను 2020లో ఏ.పి.లోని ప్రాంతీయ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రమాణాల్లో నుంచి చూస్తునప్పుడు, దశాబ్దం క్రితం జాతీయ రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో ‘నంబర్ టు’ స్థానంలో ఉన్న యాభై ఏళ్ల రాహుల్ గాంధీ మీద జార్జి చేసింది క్రూరమైన పరిహాసంగా అనిపిస్తున్నది. వొక జాతీయ పార్టీకి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా పదేళ్లుగా కనిపెడుతున్న రాహుల్ వద్ద, ఆ లక్ష్యం చేరడానికి వొక ‘రోడ్ మ్యాప్’ లేదనీ, అధికార పీఠం మీద ఉన్నవాళ్ళు విఫలమైతే, మళ్ళీ మేమే ప్రత్యామ్నాయం అవుతాము అనే సాంప్రదాయ పాతతరం ఆశతోనే రాహుల్ ఉన్నారనీ దీన్ని బట్టి అర్ధం అవుతున్నది. ఇటువంటి రాజకీయ పర్యావరణంలో, ఆధిపత్య రాజకీయాల్లో వోటమి-గెలుపుల మధ్య అవసరమైన ‘మాస్టర్ కీ’ ని దొరకబుచ్చుకుని, ఏ.పి. సి.ఎం. ‘ప్రామిసింగ్’ గా కనిపించడాన్నే కొత్తగా – ‘ఏ.పి. సెట్టింగ్స్’ అంటున్నది.

మిసింగ్ లింక్స్

నిజానికి దీని ఆరంభం రెండు దశాబ్దాల క్రితం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అప్పటికి ఇక్కడ అప్రతిహతంగా అమలవుతున్న ఆర్ధిక సంస్కరణల్లో ఉన్న ‘మిస్సింగ్ లింక్స్’ ను పట్టుకోవడంతో మొదలయింది. అయితే అప్పడే ఆయన గుర్తించిన ‘లింక్’ ను జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ‘థింక్ ట్యాంక్’ తన పొలిటికల్ ఫిలాసఫీకి అన్వయించే ప్రయత్నం చేసి ఉండవలసింది. కానీ అది జరగలేదు. అప్పట్లోనే అది జరిగివుంటే, ఈనాడు జాతీయభావ ‘ఫిలాసఫీ’ తో ప్రత్యమ్నాయంగా ఎదిగిన శక్తుల అధికారం ముందు వీరికి ఇటువంటి నిస్సహాయ స్థితి వచ్చేది కాదు. అందువల్ల తెలుగునాట కోస్తాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండు మూడు తరాలు పాటు రాజకీయ ఫలాలు పొందినవారు కూడా ఈ రోజున దాన్ని అనాధగా వదిలి వెళ్ళిపోవడానికి కారణం, కాంగ్రెస్ పార్టీకి ఇకముందు భవిష్యత్తు లేదని నిర్ధారణకు రావడమే. పరిమితులకు లోబడినా ‘సీనియర్ వై.ఎస్. డాక్ట్రిన్’ తో ఆ పార్టీ అప్పట్లోనే – ‘పోస్ట్ రిఫార్మ్స్ ఎరా’ రాజకీయాల కోసం – జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల వారీగాను వొక ‘పొలిటికల్ రోడ్ మ్యాప్’ ను సిద్దంచేసి ఉంటే, దాని పరిస్థితి ఇప్పటికంటే తప్పకుండా మెరుగ్గా ఉండేది.

వైఎస్ కాంగ్రెస్ బయటికి వచ్చి ఉంటే?

అయినా మొదటి నుంచి కాంగ్రెస్ రాజకీయాలకు తనదైన ప్రాపంచిక దృక్పధాన్ని జోడించిన, వై. ఎస్. 90 దశకం మధ్యలోనే తనతో ఉన్న పార్టీ శ్రేణుల బలంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉంటే;  వొక శరద్ పవార్ (మహారాష్ట్ర), వొక కే. కరుణాకరన్ (కేరళ) మాదిరిగా తనదైన ‘ఎజెండా’ తో స్థానిక/జాతీయ రాజకీయాలను ఇప్పటికంటే ఇంకా ఎక్కువ కాలం తీవ్రంగానే ప్రభావితం చేసి ఉండేవారు. కానీ చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానికి విధేయుడిగా ఆయన ఉండిపోయారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, గత పాతికేళ్ళ పి.సి.సి. అధ్యక్షుల్లో వొక్కరు కూడా ఆ పార్టీలో లేకపోవడానికి కారణం – వొకప్పుడు ఆ పార్టీలో ‘సామాన్యుడు’ కేంద్రంగా రూపొందిన ‘వై.ఎస్. డాక్ట్రిన్’ పూర్తిగా కనుమరుగు కావడమే. అయితే, ‘జూనియర్ వై.ఎస్.’ కు అదృశ్యంగా వున్న బలమైన తాత్విక భూమిక అదే అయింది! కాంగ్రెస్ అధిష్టానం పరిమితులతో అప్పట్లో తండ్రి చూపలేని చొరవను, ఇప్పుడు కొడుకు చూపుతూ ఉత్తర, దక్షణాదిలో కూడా కొత్తతరం నాయకత్వంలో ఆయన ముందు వరసలో ఉన్నాడు.

చరిత్రలో తనకంటూ ఒక పుట

ఇటువంటి నేపధ్యంలో, జగన్మోహన రెడ్డికి మేము రాజకీయ ప్రత్యర్ధులం కావాలని తలపడేవారు, ఇక్కడ నెలకొని ఉన్న పరిస్థితుల్లో మొదట తమను తాము ‘లోకేట్’ చేసుకుంటేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదికే, చరిత్రలో తనకంటూ వొక పుటను ‘రిజర్వు’ చేసుకునే విధంగా, ఘనీభవ స్థితిలో ఉన్న వ్యవస్థల ఉనికిని ప్రశ్నిస్తున్న స్థాయిలో జగన్ ఇప్పుడు ఉన్నారు. అతని పోటీదారులు ఆ నిజం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఆధిపత్య రాజకీయాల్లో పీఠం కోసం తలపడే పక్షాలు ఎప్పుడూ సమాన జ్ఞాన స్థాయి కలిగినవి కావడం మంచిది. అప్పుడు తమను ఎన్నుకునే సామాజిక శ్రేణుల పట్ల వారికి కనీస గౌరవం ఉంటుంది.

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles