Sunday, December 22, 2024

బాబ్రీ తీర్పుపై బీజేపీ మౌనంలో ఆంతర్యం ఏమిటి?

  • ప్రార్థనా స్థలాల చట్టం, 1991 ఏమని చెబుతోంది?
  • సాధువులూ, సంతులూ ఏమంటారు?
  • బీజేపీ ఎత్తుగడ ఏమిటి?
  • విశ్వహిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్ ఏమంటున్నాయి?

కె. రామచంద్రమూర్తి

బాబ్రీమసీదు విధ్వంసంతో బీజేపీ అగ్రనాయకులకు సంబంధం లేదనీ, నిజానికి విధ్వంసాన్ని నివారించడానికి వారు ప్రయత్నించారనీ లక్నో స్పెషల్ సీబీఐ కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు పట్ల బీజేపీ నాయకులలో కానీ కార్యకర్తలలో కానీ ఆనందోత్సాహాలు కనిపించలేదు. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ లోగిళ్లలోనే సందడి కాస్త కనిపించింది. వారిద్దరే వ్యాఖ్యానించారు. ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం తీర్పు వినగానే ‘జైశ్రీరామ్’ అంటూ అడ్వాణీ నినాదం చేశారు. మురళీమనోహర్ జోషీ కూడా తీర్పు పట్ల హర్షం ప్రకటిస్తూ, ‘సబ్ కో సన్మతి దే భగవాన్ (అందరికీ సద్బుద్ధి ప్రసాదించు దేవుడా)’ అని ప్రార్థించారు.

మోదీ, నడ్డా మౌనం

ప్రధాని నరేంద్రమోదీ కానీ, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ నోరు విప్పలేదు. 2019 నవంబర్ లో రామజన్మభూమి టైటిల్ పైన సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంలో సైతం బీజేపీ నాయకులు సంతోషం వెలిబుచ్చలేదు. ఎగిరి గంతులు వెయ్యలేదు. కారణం ఏమిటి?

అధికారంలోకి వచ్చే వరకూ ఉద్యమాలు అవసరం. అధికారంలోకి వచ్చిన తర్వాత సుస్థిరత కావాలి. అయోధ్య, రామజన్మభూమి, రామాలయ నిర్మాణం వంటి అంశాలు బీజేపీ ఎన్నికల ప్రణాళికలో 1989 నుంచీ ఉన్నాయి. అయోధ్యతో పాటు మథురనూ, కాశీనీ చేర్చలేదు. దేశం మొత్తం మీద దేవాలయాలను ధ్వంసం చేసి కట్టిన మసీదులు మూడువేల పైచిలుకు ఉన్నాయనీ, వాటికి విమోచన కల్పించాలనీ హిందూత్వవాదులలో తీవ్రవాదులు కొందరు వాదిస్తూ ఉంటారు. ఇదే ధోరణిలో పోతే ఈ గొడవ ఎంత దూరం పోతుందో, ఎక్కడ ఆగుతుందో ఎవ్వరికీ తెలియదు.

అదికారం ప్రధానం

అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మందిర్ – మసీద్ వివాదం కొనసాగించడం అనవరసరమని విశ్వహిందూపరిషత్తు, ఆర్ ఎస్ ఎస్ భావిస్తున్నాయి. అయోధ్య స్థల వివాదంపైన సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ‘ఇక మీదట మేము వ్యక్తిత్వ నిర్మాణంపైన దృష్టి సారిస్తాం. ఉద్యమాల జోలికి వెళ్ళం,’ అంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినాయకుడు మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ఇదే వైఖరిని ఆర్ ఎస్ ఎస్ మున్ముందు కూడా కొనసాగిస్తుందన్న హామీ లేదు. సమాజం ఏది కోరుకుంటే దానికి అనుగుణంగా ఆర్ ఎస్ ఎస్ నిర్ణయం ఉంటుందని ఆ సంస్థ నాయకులు అంటున్నారు. ఆర్ ఎస్ ఎస్ మథుర, కాశీ వివాదాలలో సంత్ ల, స్వాముల పోరాట వైఖరికి మద్దతు తెలిపితే బీజేపీ ఏమి చేస్తుందనేది వేరే విషయం.

రెండు కారణాలు

బాబ్రీ విధ్వంసం తీర్పు పట్ల బీజేపీ అగ్రనాయకులు మౌనం దాల్చడం వెనుక రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి,  ఈ తీర్పు పట్ల బాధపడుతున్న వర్గాలను మరింత బాధకు గురిచేయకూడదనే వైఖరి. ఇప్పటికే దూరం చేసుకున్న వర్గాలు మరింత దూరం కాకుండా జాగ్రత్త పడటం.  రెండు, గతానికి పాతరేసి ముందుకు ప్రగతిమార్గంలో సాగిపోదాం అనే నిర్ణయం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక వ్యాఖ్య చేశారు. ఈ బాబ్రీ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని బదనాం చేయడానికి పెట్టిందేనని ఆయన అన్నారు. ఇదే వైఖరిని బీజేపీ నాయకులు ప్రతిధ్వనించవచ్చు. తమపైన ఉన్న మతం ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించవచ్చు. See Also: బాబ్రీ కూల్చివేతలో అడ్వాణీ ప్రమేయం లేదు: లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు

మథుర, కాశీల విమోచన? కానీ మథుర, కాశీల పట్ల సంత్ ల, సాధువుల వైఖరి ఎట్లా ఉండబోతోంది? మథుర, కాశీల విమోచన పోరాటమే తరువాయి అంటున్నారు సాధుపుంగవులు. మథురలో శ్రీకృష్ణజన్మస్ధానానికి పక్కనే షాహీ ఈద్ గా ఉన్నది. కాశీలో విశ్వనాధస్వామి ఆలయం పక్కనే గ్యాన్ వాపీ మసీదు ఉన్నది. ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 1991’ను సవరించాలనే ఉద్దేశం సంఘపరివార్ లో కొందరికి ఉన్నది. రామజన్మభూమి వివాదం చెలరేగుతున్న సమయంలోనే ఈ చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని తెచ్చింది బాబ్రీ మసీదు విధ్వంసాన్ని అనుమతించారని ఆరోపణలు ఎదుర్కొన్న పి.వి. నరసింహారావు నాయకత్వంలోని ప్రభుత్వమే. 15 ఆగస్టు 1947లో దేవాలయాలూ, మసీదులూ వగైరా ప్రార్థనాస్థలాలు ఏ విధంగా ఉన్నాయో అట్లాగే కొనసాగాలనీ, వాటి స్థితినీ, స్థాయినీ మార్చడానికి వీలు లేదనీ ఈ చట్టం స్పష్టం చేస్తున్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles