భగవద్గీత – 69
పోనీ, పోనీ,
పోతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
పోతే పోనీ!
రానీ, రానీ!
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్, రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ!
రానీ రానీ!
కానీ, కానీ!
గానం, ధ్యానం!
హాసం, లాసం!
కానీ, కానీ!
కళారవీ! పవీ! కవీ!
ఇది శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం లోని కవిత. ఇలా ఒక మనిషి ఉండటం సాధ్యమా? ఉంటే, అతని మనస్సు ఎలా ఉంటుంది?
Also read: కనులుమూసినా నీ రూపే
ఒక గ్లాసులో అది నిండిన తరువాత కూడా నీళ్ళు పోశామనుకోండి… ఆ నీళ్ళు పొర్లిపోతాయి.
ఒక చెరువు పూర్తిగా నిండిన తరువాత కూడా నీరు చేరినదనుకోండి… ఆ నీళ్ళు కట్టలు తెంపుకొని ప్రవహిస్తాయి.
ఒక నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండి చెప్పలేనంత నీరుప్రవహిస్తే… ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోతాయి. అంత వరదలతో నిండిన నదులెన్ని సముద్రంలో కలిసినా సముద్రం చెలియలికట్ట దాటుతుందా? దాటదుగాక దాటదు. ఎంతో జలరాశి వచ్చి చేరుతుంది. మరింకెంతో జలరాశి నిత్యం ఆవిరవుతూ ఉంటుంది. అయినా సముద్రుడు పొంగడు, కుంగడు.
ఇంద్రియాలు గ్రహించే వాటిని విషయాలు అని చెప్పుకున్నాం కదా! మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్ని విషయాలున్నాయి…
అందమైన స్త్రీ పురుషులున్నారు. అచ్చెరువొందించే ప్రకృతి ఉంది. ఆహ్లాదకరమైన సంగీతముంది. చవులూరించే రుచులున్నాయి. సుగంధద్రవ్యాలు అనేకమున్నాయి. వీటి ఉనికిని ఇంద్రియాలు గ్రహించినప్పుడు మనిషి మనసు చలించకుండా ఉంటుందా?
Also read: అత్యాశ వినాశకారిణి
ఇవి ‘‘విషయాలు’’ అనే వరద. అలాగే ఇష్టమైన వారి వియోగాలు, బాధలు, గాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దుర్వాసనలు, భరించలేని టాపులేచిపోయేంత విపరీతధ్వనులు, తినలేని వస్తువులు దుర్గంధభరితవాతావరణం. ఇవికూడా మనచుట్టూ ఉన్నాయి. ఇవి మనలను విముఖులను చేసే విషయాలు.
ఇంద్రియాలు వీటి సామీప్యంలోకి వస్తే కుంగిపోని, విముఖుడు కాని మానవుడు ఉంటాడా? కానీ ఒకడుంటాడు.
తాజమహలు దగ్గరకు వెళ్ళినప్పుడు అతడు `ఆహా ఓహో అనడు!` అతనికి అది కేవలం బండరాళ్ళతో పేర్చిన ఒక కట్టడం మాత్రమే.
ఒక నయగారా జలపాతం దగ్గర గంతులు వేయడు. అది కేవలం నీరు తన గమనంలోవచ్చిన మార్పుమాత్రమే అనుకుంటాడు.
ఒక క్లియోపాత్రా అంతటి సౌందర్యరాశిని చూసినప్పుడు రాజులు ఆ సౌందర్యాన్ని చూసి మూర్ఛితులయ్యారట (Kings swooned in her presence)! కానీ అంతటి సౌందర్యమైనా, కుబ్జ అంతటి వికారి అయినా అతడికి అది కేవలం అస్థిపంజరాన్ని ఆవరించిన రక్తమాంసాలుగానే కనపడతాయి.
Also read: భోగాలు రోగాలకు దారితీస్తాయి
అంతెందుకు అతడికి ‘‘కావడి’’ అంటే కొయ్యబద్ద అని, ‘‘కుండ ’’ అంటే మన్ను మాత్రమే అనే స్పృహ ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటివాడి మనస్సులో శాంతి ఎల్లప్పుడు స్థిరంగా ఉంటుంది అని పరమాత్మ నొక్కి వక్కాణిస్తున్నారు.
ఆపూర్యమాణం అచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే
స శాంతి మాప్నోతి న కామకామీ (2-70)
ఏ విధముగా నానా నదులనీరు అన్నివైపుల నిండియున్న సముద్రములో కలిసిపోయి దానికేమాత్రమూ క్షోభ కలిగించక కలిసిపోవునో, అదే విధముగా ప్రాపంచిక సుఖభోగాలు ఏ పురుషునిలో ఏ వికారమూ కలిగించక కలిసిపోవునో అతడే పరమశాంతిని పొందును. అతడు భోగలాలసుడు కాడు.
Also read: విషయాలపై ఆసక్తి పతన హేతువు