(సకలం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా టి.జీవన్ రెడ్డి పేరు వినిపిస్తున్నది. జీవన్ రెడ్డిపేరు ఖరారు చేశారనీ, సోమవారంనాడే సోనియాగాంధీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారనీ గాంధీభవన్ లో చెప్పుకున్నారు. ఈ ముగ్గురితో పాటు జానారెడ్డి, శ్రీధర్ బాబు, శశిధర్ రెడ్డి పేర్లు కూడా వచ్చి చేరాయి. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పోటీచేసి గెలిచిన తర్వాత ఆయననే టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందనీ, ఆయన అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం కలిగినవాడనీ పార్టీ నాయకులలో అత్యధికుల అభిప్రాయం. పైగా జీవన్ రెడ్డికి పదవిపైన పెద్దగా మోజు లేదు. ఇంతమంది నాయకులను ఒక బాటలో నడిపించగలననే విశ్వాసం లేదని అంటున్నారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకూ…
గాంధీభవన్ బాధ్యులు మంగళవారంనాడు జీవన్ రెడ్డి బయోడేటా తయారు చేసుకొని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లోగా మొత్తం కమిటీని ఒక్కసారే ప్రకటించాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నదనీ, జీవన్ రెడ్డిని నియమించాలనే నిర్ణయంలో మార్పు ఉండబోదనీ, కమిటీలో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయంపైన ఖరారు నిర్ణయం తీసుకోవలసి ఉన్నదని అన్నారు. ప్రస్తుతానికి ఈ కసరత్తును వాయిదా వేసి నాగార్జునసాగర్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకూ టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉత్తమకుమార్ రెడ్డినే కొనసాగించి, ఉపఎన్నికల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం ఉత్తమంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఏఐసీసీ పెద్దలతో ఉన్నది.
రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారంనాడు 10టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కాబోయే టీపీసీసీ అధ్యక్షుడని ధ్వనించే విధంగా మాట్లాడటంతో కాంగ్రెస్ నాయకులలో కలకలం చెలరేగింది. రేవంత్ రెడ్డి సేవలు ఎట్లా వినియోగించుకోవాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం డోలాయమాన స్థితిలో ఉంది. రేవంత్ సమర్థుడైన నాయకుడనీ, మంచి వాగ్ధాటి కలిగినవాడనీ పేరుంది. కానీ ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నమ్మిన బంటు అనీ, ఆయన కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉన్ప్పటికీ చంద్రబాబునాయుడు ప్రయోజనాలకూ, తెలంగాణలో ఆయన(నాయుడు) ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజికవర్గం ప్రయోజనాలకూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారనే అనుమానం కాంగ్రెస్ నాయకులలో బలంగా ఉంది. అదీ కాకుండా, ఓటుకు నోటు కేసు వ్యవహారం చాలా వేగంగా కదులుతోంది. వారంలో రెండు పర్యాయాలు రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావలసి వస్తున్నది. తీరా టీపీసీసీ అధ్యక్షుడుగా ఆయనను నియమించిన తర్వాత ఈ కేసులో ముద్దాయిగా తేలితే పార్టీకి అప్రతిష్ఠ అనే వాదన కొందరు సీనియర్ నాయకులు పార్టీ అధిష్ఠానవర్గానికి బలంగా వినిపించారు. తనకు ప్రచారకమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినా సమర్థంగా పనిచేస్తానంటూ ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పడం వెనుక ఆయనకు కూడా తన పరిమితులపైన అవగాహన ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.
Also Read : టీపీసీసీ అధ్యక్షుడుగా జీవన్ రెడ్డి
ఆత్మవిశ్వాసం కలిగిన నాయకుడు లేడు
తక్కిన నాయకులలో ఎవరికీ వాక్చాతుర్యం కానీ, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిత్వం కానీ లేదు. చాలామంది కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాబల్యంతో మంత్రులై దండిగా డబ్బు చేసుకున్నవారే. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా మంత్రులుగా కొనసాగారు. వారిలో ఒక్కరికి కూడా తమ నియోజకవర్గం ఆవల ప్రాబల్యం లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో కనీసం పాతికమంది నాయకులు తమ నియోజకవర్గాలలో తిరుగులేని ప్రాబల్యం కలిగి ఉన్నారు. నియోజకవర్గం బయట చెల్లుబాటు కారు. ఎవరినైనా టీపీసీసీ అధ్యక్షుడుగా నియమించినా సొంత డబ్బు తీసి రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా 2023లో పార్టీని గెలిపించినా ఆయననే ముఖ్యమంత్రి పదవికి అధిష్ఠానం ఎంపిక చేస్తుందనే విశ్వాసం లేదు. ప్రాంతీయపార్టీ నాయకులకు ఉన్న భరోసా జాతీయపార్టీ నాయకులకు ఉండదు. వేయ్యి కోట్ల రూపాయలకు మించి సంపద ఉన్న నాయకులు తెలంగాణ కాంగ్రెస్ లో అరడజనుమంది ఉన్నారు. కానీ వారు పార్టీకోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేరు. పార్టీకి నిధులు లేవు. ఎన్నికల సమయానికి ఏదో విధంగా నిధులు సమకూరుతాయి. నిజానికి నిధులు సమన్య కాదు. చొరవ, ఆత్మవిశ్వాసం, సాహసం కలిగిన నాయకులు లేకపోవడమే సమస్య.
వైఎస్ వంటి నాయకుడు కావాలి
వైఎస్ రాజశేఖరరెడ్డి 1999. 2004లో స్వయంగా అప్పులు చేసి, పార్టీ కార్యక్రమాలు నడిపించి. పాదయాత్ర చేసి విజయుడైన కారణంగా సోనియాగాంధీ సైతం ఆయన నాయకత్వానికి అభ్యంతరం చెప్పేపరిస్థితి లేదు. కానీ అంతటి తెగువ, సాహసం, ఆత్మవిశ్వాసం కలిగిన నాయకుడికోసం తెలంగాణ కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. ఇటువంటి అవకాశం ఉత్తమకుమార్ రెడ్డికి ఉంది. ఆయనకు అవినీతిపరుడనే పేరు లేదు. నిధులను సమీకరించే సామాజికవర్గం ప్రాబల్యం ఉంది. 2015 నుంచి 2021 వరకూ ఆరేళ్ళు పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ఉండే అవకాశం పార్టీ చరిత్రలో ఇంతవరకూ ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డికే వచ్చింది. పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. నాయకుల మధ్య సమైక్యతను సాధించలేకపోయారు. ఒక్క తాటిపైన నడిపించలేకపోయారు. వ్యక్తిగతంగా ఆయనలో లోపాలు ఏమీ లేకపోయినప్పటికీ పరిస్థితులు కలసి రాలేదు. 2014లో 21 మంది శాసనసభకు గెలిస్తే వారిలో ఒక్క భట్టి విక్రమార్క తప్ప తక్కినవారంతా 2018లో ఓడిపోయారు. జానారెడ్డి, జీవన్ రెడ్డి వంటి జగజ్జెట్టీలు సైతం చంద్రబాబునాయుడి పరిష్వంగం ఫలితంగా ఓటమి చవిచూశారు. 2018లో గెలిచిన 18 మందిలో భట్టి మినహా అందరూ కొత్తవారే. వారిలో 12 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ఆరుగురు సభ్యులు మిగిలారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సమావేశాలకు హాజరుకారు. ఆయన బీజేపీలో చేరుతారనే వదంతులు బలంగా ఉన్నాయి. భద్రాచలం శాసనసభ్యుడు వీరయ్యకు సైతం పార్టీలో పని చేయాలన్న ఉద్దేశం లేదు. ఆయన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని వినికిడి. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటి నాయకులూ, ఏ పార్టీలోకీ వెళ్ళలేని నాయకులు మాత్రం కాంగ్రెస్ లో మిగిలారు. శ్రీధర్ బాబుకు టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వచ్చినా కాంగ్రెస్ లోనే కొనసాగాలనే పట్టుదలతో ఉన్నారు.
ప్రజాదరణ కొదువ లేదు
కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఎవరిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినా వైఎస్ ప్రదర్శించిన చొరవ తీసుకుంటే ఫలితం ఉంటుంది. నాయకుల వ్యవహరణశైలి ఏ విధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పాతికశాతం ఓట్లకు ఇంతవరకూ ధోకా లేదు. బీజేపీ విజృంభించి కాంగ్రెస్ కు ఉన్న స్థలాన్ని ఆక్రమించితే చెప్పలేము కానీ ఇప్పటికైతే కాంగ్రెస్ బతికి బట్టకట్టే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఒక్క నాయకత్వ సమస్యను పరిష్కరించుకొని, నాయకులందరూ ఒక నాయకుడి నాయకత్వంలో సమైక్యంగా పనిచేస్తే పార్టీకి తిరిగి మంచిరోజులు రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 2014 ఎన్నికలలో 28 శాతం ఓట్లు రాగా, 2018 అసెంబ్లీ ఎన్నికలలో 24 శాతం ఓట్లు వచ్చాయి. అనంతరం 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో 26 శాతం వచ్చాయి. కనుక కాంగ్రెస్ కు జనాదరణ ఎంతోకొంత నిశ్చయంగా ఉన్నది. దాన్ని పెంచుకొని విజయతీరాలకు దారితీయగల సమర్థ నాయకత్వం కావాలి. ప్రస్తుతం కథనడిపిస్తున్న సీనియర్ నాయకుల కంటే కొత్త నాయకులకూ, యువనాయకులకూ పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.