- టీడీపీ-కాంగ్రెస్ నడుమ చీలుతున్న ఓట్లు
- టీఆర్ఎస్‌కు అదే విజయసోపానం
- ప్రజలు విశ్వసిస్తే బీజేపీకీ అవకాశం
- ఎమ్ఐఎమ్ స్థానం సుస్థిరం
- మేయర్ స్థానం కారుకే సొంతం?
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందుకు సాక్ష్యం దిల్లీ నుంచి హేమాహేమీలు ప్రచారానికి తరలి వస్తుండడం. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్‌ను సైతం రంగంలోకి దించడం ఆ పార్టీకి ఈ సారి ఎలాగైనా కార్పొరేషన్‌ను దక్కించుకోవాలన్న కాంక్ష బలంగా ఉందని చెప్పకనే చెబుతోంది. స్మృతీ ఇరానీ బుధవారం తన కర్తవ్యాన్ని పూర్తిచేసి వెళ్ళారు. మరొక పక్క గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పదునైన వ్యాఖ్యలతో ఏఐఎమ్ఐఎమ్‌పై విరుచుకుపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఎమ్ఐఎమ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వలసలతో బీజేపీ బలపడుతున్నట్లే కనిపిస్తోంది. అలాగే, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ సైతం కాషాయాంబరధారి అయ్యారు. ఏ పార్టీ ఏం చేసినా.. అంతిమంగా హైదరాబాద్ మేయర్ పీఠంలో కూర్చొనడానికే.
ఎంఐఎం తరఫున హిందూ అభ్యర్థులు
ప్రస్తుతం ఎమ్ఐఎమ్ తన డ్రామాతో రక్తి కట్టిస్తోంది. టీఆర్ఎస్‌తో పడనే పడదన్నట్లు ప్రవర్తిస్తోంది. ఆ పార్టీతో తమకు ఎటువంటి పొత్తు లేదని కుండబద్దలు కొడుతోంది. ప్రస్తుత కార్పొరేషన్‌లో ఆ పార్టీకి 44 సీట్లున్నాయి. టీఆర్ఎస్‌కు 99 సీట్లున్నాయి. బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 2, టీడీపీకి ఒకటి సీట్లున్నాయి. ఎంత చూసుకున్నా ఎమ్ఐఎమ్‌కు పాతబస్తీ పెట్టని కోటే. మిగిలిన ప్రాంతాలలో ముస్లిం ఓటర్లు ఉన్న చోట కూడా గెలిచే అవకాశముంది. కొన్ని ప్రాంతాలలో ఆ పార్టీ కూడా హిందూ అభ్యర్థులను నిలబెట్టింది. బోరబండలో గెలిపించుకుంది కూడా. కారణం ఇక్కడ హిందూ, ముస్లిం ఓటర్లు సమానంగా ఉండడం. లోపాయకారీ ఒప్పందాలు కూడా ఆ పార్టీకి కలిసి వస్తున్నాయి. బలహీన అభ్యర్థిని నిలబెట్టడమో లేదా అసలు పోటీకే పెట్టకపోవడమో వంటి నిర్ణయాలు ఎమ్ఐఎమ్‌కు లబ్ధి చేకూర్చేవే. మనకు అవకాశం లేకపోతే.. మనకు పనికొచ్చే పార్టీకి మద్దతునివ్వడం తప్పు కాదు. ఇది అన్ని ఎన్నికలకూ, అన్ని పార్టీలకూ వర్తిస్తుంది.
బీజేపీ ఆత్మవిశ్వాసం
నాలుగు సీట్ల నుంచి కార్పొరేషన్‌లో అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ అంటోంది. ఇలా అనడం ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని చాటుతోంది. అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తూ, అవసరమైన చోట సవాళ్ళు విసురుతూ సాగుతోంది బీజేపీ. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం ఆ పార్టీకి ఊపిరులూదింది. ఆ విజయం స్ఫూర్తిగా ఇప్పుడు బల్దియాపై జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ కార్పొరేటర్ స్థానాలను ఎక్కువ గెలుచుకున్నప్పటికీ మేయర్ స్థానం దక్కడం కష్టమే. టీఆర్ఎస్ స్థానాలు ఇప్పుడున్న దానికన్నా సగానికి పడిపోయినా ఎక్స్అఫిషియో సభ్యుల సాయంతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ సునాయాసంగా చేజిక్కించుకోగలదు. అప్పుడు అవసరమైతే, ఎమ్ఐఎమ్ సహకారం తీసుకునే అవకాశాలుంటాయి.
దిక్కులు చూస్తున్న కాంగ్రెస్ ఓటుబ్యాంక్
ప్రస్తుతం బీజేపీ ఒంటరిగా ఎన్ని స్థానాలను గెలుచుకోగలదనేది ఆసక్తికరం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరవాత టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయింది. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు. ఒకవేళ ఓట్లు వేసి, గెలిపించుకున్పప్పటికీ విజేతలు అధికార పార్టీలో చేరిపోరనే గ్యారంటీ లేదు. ప్రస్తుతం టీడీపీ ఓటర్లను పీడిస్తున్న అంశం ఇదే. ఇక కాంగ్రెస్ సంగతి – నాయకత్వ కుమ్ములాటలతో ఆ పార్టీ బిజీగా ఉంది. వారి కుమ్ములాటల కారణంగా ఉన్న ఓటు బ్యాంకు దిక్కులు చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోటీ చేసినట్లు గ్రేటర్‌లోనూ చేయి కలిపి ఉంటే ప్రయోజనం ఉండి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోయింది. టీడీపీ మూటగట్టుకున్న అపప్రథ తమకున్న కొద్దిపాటి విజయవకాశాలనూ దెబ్బతీస్తుందనే భయం కాంగ్రెస్ ఉండడంతో అవి ఆ దిశగా ఆలోచించలేదు. ఓటు ఇక్కడే చీలిపోతోంది. లేకపోతే ఈ కూటమికి మర్యాదకరమైన సంఖ్యలోనే స్థానాలు దక్కే వీలుంది. ఈ ఓటు చీలికే, టీఆర్ఎస్ విజయానికి బాటలు గతంలో వేసింది. ఇప్పుడూ వేస్తుందని ఓ అంచనా. ఈ క్రమంలో బలమైన విశ్వాసం బీజేపీపై ఏర్పడితే తప్ప అది కార్పొరేషన్‌లో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉండవు. టీఆర్ఎస్ విజయానికి ఇదే బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు.