Wednesday, December 25, 2024

గెలుపెవ‌రిది?

  • వైట్ హౌస్ ట్రంప్ దేనా, బైడెన్ హస్తగతం అవుతుందా?
  • అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ‌

‘వుయ్ విల్ విన్‌….’ అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థులు డోనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్ ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది. ఇద్ద‌రూ త‌మ‌త‌మ గెలుపుపై అత్యంత ఆత్మ విశ్వాసాన్ని క‌న‌బ‌రుస్తున్నారు. స్వింగ్ స్టేట్స్ లో కౌంటింగ్ ఇంకా కొన‌సాగుతోంది. ఈ వార్త రాసే స‌మ‌యానికి (బుధవారం రాత్రి పదకొండు గంటలు) 227 ఎల‌క్టొర‌ల్ స్థానాల‌తో బైడెన్ ఆధిక్య‌త‌లో ఉన్నారు. 213 స్థానాల‌తో ట్రంప్ రాబోయే ఫ‌లితాల‌పై ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

ట్రంప్ ఆధిక్యంపై అంచనాలు

రానున్న 86 ఎల‌క్టొర‌ల్ స్థానాల్లో 80 స్థానాల్లో ట్రంప్ ఆధిక్య‌త క‌న‌బ‌రుస్తుండ‌డ‌మే దీనికి కారణం. బైడెన్ కేవ‌లం 6 స్థానాల్లోనే అక్క‌డ ఆధిక్య‌త‌లో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్ల వల్ల ఆధిక్యం మారితే ఈ అంచాలు కూడా మారతాయి.  86 స్థానాలున్న రాష్ట్రాలలో బ్యాలెట్ల‌ను చేత్తో  లెక్కిస్తున్నారు. దీనివ‌ల్ల ఈ రాష్ట్రాల ఫ‌లితాలు రావ‌డానికి మ‌రో మూడు రోజులు ప‌డుతుంద‌ని అంచ‌నా. అంటే విజేత ఎవరో తేల‌డానికి అంత‌వ‌ర‌కూ టెన్ష‌న్ త‌ప్ప‌ద‌న్న మాటే. తాను క‌న‌క ఓడిపోతే సుప్రీం కోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని ట్రంప్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆయ‌న మూడు ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

మడతపేచీకి ట్రంప్ సిద్ధం

నెగ్గినా కోర్టుకు వెడ‌తానంటున్నారాయ‌న‌. డెమొక్రాట్లు ఓటింగును అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని కేసు వేస్తానంటున్నారాయ‌న‌. ఒక‌వేళ ఓడిపోతే, వైట్ హౌస్‌ను విడిచిపెట్టకుండా ఉండ‌డానికి కూడా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. ‘ఇండియా టుడే’ చానెల్ చ‌ర్చ‌లో పాల్గొన్న ఒక విశ్లేష‌కుడు ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. ఇద్ద‌రికీ స‌మానంగా ఓట్లు వ‌స్తే అన్న చ‌ర్చ కూడా సాగుతోంది. అప్పుడేం చేస్తార‌నే అంశం ఆస‌క్తిక‌రం. 538 స్థానాలున్న ఎల‌క్టొర‌ల్ కాలేజ్‌లో స‌గం 269. 270 వ‌చ్చిన వాళ్ళు విజేత‌ల‌వుతారు. 50 రాష్ట్రాల‌లోనూ 42 రాష్ట్రాల‌లో ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. విస్కాన్సిన్‌, మిచిగ‌న్‌, పెన్సిల్వేనియా, నార్త్ క‌రోలినా, జార్జియా,  నెవ‌డా, అల‌స్కాల‌లో లెక్కించాల్సి ఉంది. ‘అమెరికా ఫ‌స్ట్’ అనే నినాదంతో ట్రంప్ త‌న విజ‌యంపై ధీమాను క‌న‌బ‌రుస్తున్నారు.
2016 ఎన్నిక‌ల‌లో సైతం ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది. కానీ, పోస్ట‌ల్ బ్యాలెట్ ట్రంప్‌ను గట్టెక్కించింది. చివ‌రి నిముషం వ‌ర‌కూ ఉత్కంఠ కొన‌సాగింది. అప్ప‌ట్లో ప‌త్రిక‌లు హిల్ల‌రీ క్లింట‌న్ విజ‌యం సాధించింద‌నే బ్యాన‌ర్లు కూడా సిద్ధి చేసేసుకున్నాయి. కానీ ఫ‌లితం చివ‌ర‌కు తారుమారైంది.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌

నోబెల్‌ గ్రహీతలతో సహా 81మంది శాస్త్రవేత్తలంతా కలిసి ”ట్రంప్‌ను ఓడించండి” అని పిలుపునివ్వడం ఓ విశేషం.  తాజాగా పోలింగ్‌కు ముందు ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్స్‌ సైతం అదే పిలుపునిచ్చాయి. ఇలాంటి సందర్భం ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిది కావొచ్చు! ”నేచర్‌”, ”సైంటిఫిక్‌ అమెరికన్‌”, ”న్యూ ఇంగ్లాండ్‌ జనరల్ మెడిసిన్‌”  పత్రికలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల గురించి తప్ప ఎన్నడూ రాజకీయాల గురించి ప్రచురించింది లేదు. తమ సంపాదకీయాలలో, వ్యాసాలలో  ట్రంప్‌ను ఓడించమని ప్రజలను కోరడమే కాదు, ఎందుకు ఓడించాలో కూడా వివ‌ర‌ణ ఇచ్చాయి. ట్రంప్‌ శాస్త్ర విరుద్ధమైన పాలన ప్రగతికి ఆటంకమని కుండబద్దలు కొట్టాయి. ఇందుకు ఆధారాలతో సహా అనేక ఉదాహరణలు ప్రజలముందుంచాయి.

కరోనా నివారణలో దారుణ వైఫల్యం

ప్రత్యేకించి కరోనా నివారణలో సైన్స్‌ హెచ్చరికల్ని పూర్తిగా విస్మరించి వ్యవహరించిన ఫలితమే ఇప్పుడు అమెరికా అనుభవిస్తున్నదని పేర్కొన్నాయి. మాస్క్ లు ధరించకపోవడం, భౌతికదూరాన్ని పాటించకపోవడం మొదలు ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడం వరకూ ట్రంప్‌ ప్రదర్శించిన బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టాయి. ట్రంప్‌ విపత్తు ముంగిట శాస్త్ర విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడమేకాదు, వారి ప్రఖ్యాత ”సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌” లాంటి సంస్థల హెచ్చరికల్ని కూడా పట్టించుకోలేదు. అమెరికా ప్రభుత్వం హాస్పటల్స్‌ అన్నింటికీ ”సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌”కు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దనీ, నేరుగా డేటా మొత్తాన్ని అమెరికా ఆరోగ్యశాఖకు మాత్రమే పంపించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎందుకంటే ఆ సంస్థ సైంటిఫిక్‌గా నిజాలను చెప్పి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. అది ట్రంప్‌ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాదు, అతని రాజకీయ ప్రయోజనాలకూ భంగం కలిగిస్తుంది.

అసత్యం, అశాస్త్రీయం

ప్రధానంగా వైరస్‌ తీవ్రత ప్రజలకు తెలిస్తే తను ఆర్థిక, ఉత్పాదక రంగాలలో కార్యకలాపాలను పునఃప్రారంభించడం పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతుంది. అందుకే ట్రంప్‌ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తన రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య మార్గాల్నీ ఆశాస్త్రీయ మార్గాల్నీ ఎంచుకున్నారు. కరోనా బాధితులకు శానిటైజర్స్‌ ఎక్కించండనే మూర్ఖపు వ్యాఖ్యలకు తెగబడ్డారు. ఒకవైపు శాస్త్రీయమైన వైద్య పరిశోధనలు జరుగుతుండగానే, మరోవైపు వాటితో సంబంధమే లేకుండా ఏకపక్షంగా నిరూపితం కాని డ్రగ్స్‌ (యాంటీ మలేరియల్‌, హైడ్రాక్సి క్లోరోక్విన్‌)ను అశాస్త్రీయంగా పంపిణీ చేసి వాటి వాడకాన్ని ప్రోత్సహించారు. ఇది ప్రజల పట్ల బాధ్యత గల నాయకుడు చేయగలిగే పనేనా?! దేశాధినేతలే ఇలా ఉంటే ఇక దేశమేమైపోతుంది? అందుకే ”శాస్త్ర విరుద్ధమైన ఈ అశాస్త్రీయ భావాల ట్రంప్‌ను ఓడించండి” అంటూ శాస్త్రవేత్తలు, సైన్స్‌ జర్నల్స్‌ ప్రజలను కోరాల్సిన అవసరమొచ్చింది. మరి అమెరికా ప్రజలు ఎలా స్పందించారో వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles