- నువ్వా-నేనా అంటున్నమయాంక్, శుభ్ మన్
భారత టెస్టుజట్టులో ప్రస్తుతం ఆరోగ్యవంతమైన పోటీ నెలకొంది. టాపార్డర్ నుంచి టెయిల్ ఎండర్ల వరకూ ప్రతిఒక్క స్థానం కోసం పోటీ తీవ్రంగా మారింది.
ఆస్ట్ర్రేలియాతో ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్ లో పలువురు సీనియర్ ఆటగాళ్లు గాయపడినా…యువఆటగాళ్లతోనే భారతజట్టు సిరీస్ నెగ్గడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ తో ఈనెల 5నుంచి ప్రారంభంకానున్న నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత ఓపెనర్ల స్థానాల కోసం ప్రధానంగా మూడుస్తంభాలాట జరుగుతోంది.
ఓపెనర్ గా వైట్ బాల్ క్రికెట్ స్పెషలిస్ట్ రోహిత్ శర్మ స్థానం ఖాయం కాగా…మరో ఓపెనర్ స్థానం కోసం యువఆటగాడు శుభ్ మన్ గిల్ తో సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పోటీపడుతున్నాడు.
Also Read : రెండో టెస్టు నుంచే ప్రేక్షకులకు అనుమతి
తీవ్ర ఒత్తిడిలో మయాంక్
స్వదేశీ సిరీస్ ల్లో నిలకడగా రాణించిన సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్…కంగారూ గడ్డపై జరిగిన సిరీస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆస్ట్ర్లేలియాతో అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన డే-నైట్ టెస్టు తొలిఇన్నింగ్స్ల్ లో 17 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగుల స్కోర్లకు అవుటయ్యాడు.
అంతేకాదు…ఆ తర్వాత మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో సైతం మయాంక్ దారుణంగా విఫలమయ్యాడు. తొలిఇన్నింగ్స్ లో డకౌటైన మయాంక్…రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారీ గాయంతో ఆఖరిటెస్టు తుదిజట్టులో చోటు సంపాదించిన మయాంక్ తొలిఇన్నింగ్స్ లో 38 పరుగుల అత్యంత విలువైన స్కోరు సాధించాడు. సిరీస్ మొత్తంలో నాలుగు ఇన్నింగ్స్ వైఫల్యాలతో డీలాపడిన మయాంక్ కు ఇంగ్లండ్ తో సిరీస్ లోని తొలిటెస్టు తుదిజట్టులో చోటు దక్కడం అనుమానంగా మారింది.
Also Read : జాతీయ టీ-20 విజేత తమిళనాడు
శుభ్ మన్ గిల్ టాప్ గేర్
మరోవైపు…ఆస్ట్ర్రేలియా సిరీస్ ద్వారా టెస్టు అరంగేట్రం చేసిన శుభ్ మన్ గిల్ తొలిఇన్నింగ్స్ల్ లో 45, రెండో ఇన్నింగ్స్లో 35 నాటౌట్ స్కోర్లతో ఆకట్టుకొన్నాడు.మెల్బోర్న్ వేదికగా ముగిసిన రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో అర్థశతకం, రెండో ఇన్నింగ్స్ లో31 పరుగులు సాధించి అవుటయ్యాడు.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరిటెస్టు తొలిఇన్నింగ్స్ లో కేవలం 7 పరుగులకే అవుటైన శుభ్ మన్ రెండో ఇన్నింగ్స్ లో 91 పరుగులతో భారత్ కు సంచలన విజయం అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఓపెనర్ గా మయాంక్ తో పోల్చి చూస్తే దూకుడుమీదున్న శుభ్ మన్ గిల్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెన్నైటెస్టులో రోహిత్ శర్మతో కలసి శుభ్ మన్ గిల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : సాకర్ స్టార్ మెస్సీకి కుబేర కాంట్రాక్ట్