- రాష్ట్రపతా? ప్రధానమంత్రా?
- చారిత్రక ఘట్టంలో ప్రతిపక్షాలు లేకపోవడం వెలితి
- ఇప్పటికైనా ప్రధాని మోదీ చొరవతీసుకోవాలి
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారంనాడు ప్రారంభించాలని సంకల్పించడం, అది సరికాదనీ, రాష్ట్రపతి చేతులమీదుగా ఆ పని జరగాలంటూ 19 ప్రతిపక్షాలు పట్టుపట్టడం రాజకీయ ప్రతిష్టంభనకు దారితీసింది. పార్లమెంటులో అలజడి అనంతరం ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన తర్వాత బిల్లులను ఆమోదించిన విధంగానే ప్రధాని నరేంద్రమోదీ తన సహచరుల కరతాళధ్వనుల మధ్య పార్లమెంటు భవనాన్ని ప్రారంభించవచ్చు. కానీ అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ, పార్లమెంటుకు కానీ, ప్రధానికి కానీ, రాష్ట్రపతికి కానీ, ప్రతిపక్ష నాయకులకు కానీ శోభాయమానం కాజాలదు. మన పెద్దల ఇరుకు మనస్తత్వానికి అద్దం పడుతుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనమౌతున్నాయని మేధావులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని ప్రాభవం శ్రుతిమించుతున్నదని అనుకునేవారు ఉన్నారు. దిల్లీ అధికారులపైన నియంత్రణకోసం సుప్రీంకోర్టు తీర్పును నీరు గార్చుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం చూశాం. ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాందీ లోక్ సభ సభ్యత్వాన్నిరద్దు చేయడం, అధికార నివాసం నుంచి ఆయన ఖాళీ చేయడం దేశ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండికొట్టే పనులు ఎక్కువ అవుతున్నాయనేే వేదన సర్వత్రా వినిపిస్తున్నది. అధికారం చేతిలో ఉన్నది కనుక ప్రధాని ఏమి చేసినా ఎదురుండదు. కానీ చరిత్ర ఒకటి ఉన్నదనీ, అందులో స్థానం గురించి ఆలోచించాలనీ రాజకీయ నాయకులు గ్రహించాలి.
నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించడం పద్ధతిగా ఉండేది. ప్రధాని రాష్ట్రపతి పక్కన ఉంటే బాగుండేది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగితే మాజీ రాష్ట్రపతి కోవింద్ ను కూడా ఆహ్వానించవచ్చు. ప్రధాని స్వయంగా ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించడంతో ఇది రాజకీయ వ్యవహారంగా మారింది. ప్రధాని హోదా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల తర్వాతనే. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్ర పతి ప్రసంగించే సంప్రదాయం ఉన్నది. అందులో ఇతర సభ్యులతో పాటు ప్రధాని కూడా కూర్చుంటారు. ఉపరాష్ట్రపతి వేదిక పైన ఉంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడు. లోక్ సభ స్సపీకర్ కూడా వేదికపైన ఉంటారు. మర్యాద పాటించాలనుకుంటే రాష్ట్రపతి కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రాంభించాలి. ఆ సమయంలో ఉపరాష్ట్రపతి, లోక్ సభ సభాపతి రాష్ట్రపతికి రెండువైపులా ఉండాలి. ప్రధాని ప్రముఖంగా ఉండవచ్చును కానీ రాష్ట్రపతినీ, మాజీ రాష్ట్రపతినీ ఆహ్వానించడానికి వీలులేకుండా ప్రధాని స్వయంగా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని పూనుకోవడం సబబు కాదు. భవిష్యత్తరాలు ఫొటో ఆల్బం చూసినప్పుడు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభ సమయంలో ఒక ప్రధాని, ఆయన మంత్రిమండలి సహచరులు మాత్రమే ఉండి, రాష్ట్రపతి లేకుండా, ప్రతిపక్షాల నాయకులు లేకుండా ఉండడం చాలా వెలితిగా ఉంటుంది. ఇంత హటం చేసి తాను మాత్రమే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని అనుకోవడం ఆయనకు సైతం గౌరవప్రదం కాదు. రాజ్యాంగం నిర్దేశించిన క్రమంలో ప్రధానిది మూడో స్థానమని గుర్తించి, గౌరవించాలి.
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాబోమని ప్రకటించిన ప్రతిపక్షాల జాబితాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లేదు. ఆయనకు మొహం చెల్లదు. రాష్ట్ర సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించినప్పుడు గవర్నర్ తమిళసైని సవ్యంగా ఆహ్వానించలేదు. ప్రధాని హైదరాబాద్ సందర్శించినప్పుడు మోదీని కేసీఆర్ స్వాగతించలేదు. కలవలేదు. తాను ప్రధానినీ, గవర్నర్ నీ గౌరవించకుండా ప్రధాని మాత్రం రాష్ట్రపతిని గౌరవించాలనడం ఏమంత సమంజసం? వ్యక్తిగత ఇష్టాయిష్టాలకూ, అహంకారానికీ, అభిజాత్యానికి తావు లేకుండా అందరూ రాజ్యాంగ స్ఫూర్తిని పాటించినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రతిపక్షాలను గౌరవించని ముఖ్యమంత్రులకు ప్రతిపక్షాలను గౌరవించాలని ప్రధానికి ఉద్బోధించే అధికారం ఎక్కుడున్నది? తెలంగాణ సచివాలయ ప్రారంభ సమావేశంలో ప్రతిపక్షాలు కనిపించలేదు. మొత్తం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్, బీఆర్ఎస్ నాయకులూ, మంత్రులూ, ప్రభుత్వ అధికారుల హవా మధ్యనే కార్యక్రమం జరిగింది. నిజాంను తలపించే విధంగా రాచరిక పోకడలు పోతున్నవారికి ప్రదానిని ప్రశ్నించే హక్కు ఉండదు.
జపాన్, పపువా న్యూ గయానా, ఆస్ట్రేలియాలలో పర్యటన ముగించుకొని గురువారంనాడు స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని ఈ విషయంపైన స్పందించారు. తాను భారత సంతతి ప్రజల సమావేశంలో మాట్లాడినప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారని చెప్పారు. అదేదో తనను గౌరవించినట్టుగా ప్రధాని చెప్పుకున్నారు. అది మోదీ గొప్ప దనం కాదు. ఆస్ట్రేలియా ప్రధాని గొప్పదనం. మాజీ ప్రధానిని ఆహ్వానించకుండా, ప్రతిపక్షాలను గౌరవించకుండా ఉంటే వారు మోదీ సమావేశానికి ఎందుకు వస్తారు? ప్రతిపక్ష నాయకులపైన నిఘా సంస్థలు దాడులు చేస్తూ ఉంటే వారు ప్రధాని సభకు హాజరవుతారా? ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షాలు ప్రధానమనే ధ్యాస లేకుండా పార్లమెంటులోనూ, బయటా ప్రతిపక్షాలను ఎద్దేవా చేయడం, విమర్శించడం, తూలనాడటమే పనిగా పెట్టుకున్న ప్రధాని మోదీ కాకుండా మరెవరైనా ఉన్నారా? భారత్ కాకుండా ప్రజాస్వామ్య దేశం మరొకటి ఉన్నదా?
ఇప్పటికైనా మించిపోయింది లేదు. సవరించుకోవడానికి వ్యవధి ఉన్నది. ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకొని కార్యక్రమంలో మార్పులు చేసి ప్రతిపక్షాలు హాజరయ్యే విధంగా సకారాత్మక చర్యలు తీసుకుంటే ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు ప్రతిపక్షాల ప్రతిష్ఠ, పార్లమెంటు ప్రతిష్ఠ, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్ఠ పెరుగుతాయి. మోదీ ప్రతిపక్ష నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించుకుంటే సామరస్య వాతావరణంలో భారత రిపబ్లిక్ లో జరిగే అత్యంత ముఖ్యమైన కార్యక్రమానికి శోభ వస్తుంది. నిండుదనం చేకూరుతుంది. ప్రజలు హర్షిస్తారు. రాజకీయ నాయకుల పట్ల ప్రజల గౌరవం పెరుగుతుంది.