టెడ్రోస్ అథనామ్
- కరోనా తీవ్రదశ ముగిసిపోతుంది
- వాక్సీన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
- ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) నోట తాజాగా మంచి మాటలు వినపడ్డాయి. ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మాట తీరు, చేసిన వ్యాఖ్యలు మొదటి నుంచీ కటువుగానే ఉండేవి. బహుశా వాస్తవాలు చేదుగా ఉంటాయని అర్ధం చేసుకోవాలేమో!
Also read: తెలుగు సినిమాకు మంచి మలుపు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికత
కరోనా గురించి తాజాగా ఆయన అన్న మాటలు చాలా ఆనందాన్ని,ఎంతో ధైర్యాన్ని కలిగిస్తున్నాయి.ఈ ఏడాదిలో కోవిడ్ తీవ్రదశ ముగుస్తుందని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళికి వేయి ఏనుగులబలాన్ని ఇస్తోంది. ఏ సంస్థలు, ఏ నిపుణులు ఏ మాటలన్నా,వాటన్నింటి కంటే డబ్ల్యూ హెచ్ ఓ చేసే వ్యాఖ్యలు, వెలువరించే అభిప్రాయాలకు అధికారిక ప్రామాణికత ఎక్కువ. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ కు ఆయన అత్యంత విలువను ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే ఈ ఏడాదిలోనే కరోనా తీవ్రదశ ముగిసిపోతుందని అంటున్నారు. ఇది జరగాలంటే ఈ జూన్, జులై కల్లా ప్రపంచంలోని 70శాతం మానవాళికి వ్యాక్సిన్లు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టాలి. ఆయన పర్యటిస్తున్న ఆఫ్రికా ఖండంలో ఇప్పటి వరకూ కేవలం 11శాతం మందికే వ్యాక్సిన్లు అందాయి. వ్యాక్సిన్ ప్రక్రియలో దేశాల మధ్య అంతరాలు పోవాలి. కరోనా వైరస్ మిగిలిన వ్యాధుల వంటిది కాదు. అత్యంత వేగంగా మానవాళి మధ్య వ్యాప్తి జరుగుతుంది. ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. న్యూమోనియో సోకడమో,అప్పటికే దీర్ఘకాలికమైన వ్యాధులు ఉండడమో,మిగిలిన తీవ్రమైన బలహీనతలు కూడా కలవడమో జరిగితే అది ప్రాణాలనే హరిస్తుంది. కరోనా ఎంతటి ప్రమాదకారి,ఎంత శక్తివంతమైందో ఈపాటికే ప్రపంచానికి అర్థమై ఉంది. ఇప్పటికే ఎందరినో కోల్పోయాం. అన్ని రకాలుగా నష్టపోయాం. ఇంకా నష్టపోవడానికి ప్రపంచానికి శక్తి లేదు. మన దేశంలో వ్యాక్సినేషన్ వ్యవహారంలో అనుకున్న లక్ష్యాలను ఆశించిన మేరకు దాటేశాం. పిల్లలు, యువతకు కూడా ప్రారంభమైంది. అది కూడా వేగంగానే జరుగుతోంది. దేశాల మధ్య ప్రయాణాలు, రవాణా ద్వారా కరోనా సంక్రమిస్తోంది. మన దేశంలోకి కూడా కోవిడ్ అలాగే ప్రవేశించింది. అన్ని దేశాలకూ అదే జరిగింది. ప్రపంచ దేశాల మధ్య ప్రయాణాలు ఎక్కువకాలం ఆపలేం. కరోనాను అరికట్టడమే ఏకైక మార్గం.దీనిని సాధించాలంటే అన్ని దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలి. ముఖ్యంగా అగ్రరాజ్యాలు, సంపన్న దేశాల చేయూత కావాలి. ఆఫ్రికా వంటి పేద దేశాలను ఆదుకోవాలి.
Also read: హిజాబ్ వివాదం అనర్థదాయకం
టీకాల వేగం పెరగాలి
184 దేశాలలో ఇప్పటి వరకూ 10.3 బిలియన్ డోసులు వేశారు. ప్రపంచంలోని 75 శాతం మందికి మొదటి డోస్ అందడానికే ఇంకా 5నెలల సమయం పడుతుందని ప్రస్తుత వ్యాక్సినేషన్ రేటు బట్టి అంచనా వేయాల్సిఉంటుంది. ఈ లెక్కన చూస్తే రెండు డోసులు పూర్తవ్వాలంటే ఇంకా సమయం పడుతుంది. ఇజ్రాయల్ అందరి కంటే అగ్రభాగాన నిలిచింది. బూస్టర్ డోసులను అందించడంలోనూ దూసుకుపోతోంది. మిగిలిన దేశాలు కూడా ఈ వేగాన్ని అందిపుచ్చుకోవాలి.
తమ దేశంలో వేసుకోవడమే కాక, మిగిలిన పేద, మధ్య తరగతి దేశాలకు పంపిణీ చేయాలి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా సోకుతున్నా, ప్రమాదంగా పరిణమించడం లేదు. వ్యాక్సిన్ వేసుకోనివారిపై దుష్ప్రభావాలు చూపిస్తోందని నిపుణులు అంటున్నారు. జనాభా ప్రకారం చూస్తే, ఇప్పటి వరకూ,ప్రపంచ మానవాళిలోని 63 శాతనికి మొదటి డోస్ మాత్రమే అందింది. దేశాల పరంగా చూస్తే ఈ రేటు వేరువేరుగా ఉంటుంది. రెండో డోస్ ను అందించడంలోనూ వేగం పెరగాల్సి ఉంది. రాజకీయాలకు,ఆర్ధిక స్వార్ధాలకు, జాతి, మత, వర్గ వైషమ్యాలకు అతీతంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలి. ముందు మనిషి ఉనికిని కాపాడుకోవాలి.ఈ కరోనా సమయంలోనూ అగాధాలు, వ్యాపార స్వార్ధాలు కొనసాగుతూనే ఉండడం దారుణం. కరోనా కొత్త వేరియంట్ల భయాలు కూడా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. రోగ నిరోధక శక్తి ప్రపంచ వ్యాప్తంగా పెరగాల్సి ఉంది. వైద్య సదుపాయాలు, వైద్యానికి ప్రభుత్వాలు కేటాయించే బడ్జెట్లు, పరిశోధనలు ఇంకా అధ్వాన్నంగానే ఉన్నాయి. అందులో మన దేశం కూడా ఉంది. తాజా బడ్జెట్ లో ఆరోగ్యరంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల శాతమే దానికి పెద్ద ఉదాహరణ. ఈ వెనుకబాటుతనం నుంచి బయటపడకపోతే దేశం భారీమూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మనది ప్రపంచంలోనే జనాభాలో రెండవ అతిపెద్ద దేశం. జనాభాలో చైనా సంఖ్యకు చాలా దగ్గరగా వచ్చేశాం, అభివృద్ధిలో కాదు .ముందుగా కరోనా నుంచి ప్రపంచం బయటపడాలి. ఈ తరుణంలో, ‘వ్యాక్సినేషన్ గ్లోబల్ కాంపెయిన్’ ను ఉదృతంగా నడపాలని డబ్ల్యూ హెచ్ ఓ సూచిస్తోంది.ఈ సూచనలను ప్రపంచ దేశాధినేతలు పాటిస్తారని ఆశిద్దాం.
Also read: మౌనం వీడి మాయావతి మాయాజూదం