- కోవింద్ కే మరో అవకాశం ఇస్తారా?
- వెంకయ్యనాయుడిని చేస్తారా?
- గులాంనబీ మాట వినిపిస్తోంది ఎందుకు?
- ఎవరిని కావాలంటే వారిని గెలిపించుకునే సత్తా బీజేపీ సొంతం
గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలతో బీజేపీకి కొత్త రెక్కలు పుట్టుకొచ్చాయి. సరికొత్త ఊపు వచ్చింది. రాజ్యసభలో స్వయంగా ఆధిక్యం సంపాదించుకునేందుకు కేవలం మూడు వారాలు ఆగితే సరిపోతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపొందడం ఖాయం. ఎవ్వరితో సంప్రదించనక్కరలేదు. ఎవ్వరినీ బతిమిలాడనక్కర లేదు. దేహీ అనవసలసిన పనే లేదు.
రాజ్యసభ ఎన్నికలు మార్చి 31న జరగబోతున్నాయి. దేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ కలసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కలసి 776 మంది ఉంటారు. 4,120 మంది శాసనసభ్యులు ఉంటారు. ఒక్కొక్క ఎంపీ ఓటు విలువ 708. ఎంఎల్ఏ ఓటు విలువ రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య వ్యత్యాసం ఉంటుంది. జనాభాను బట్టి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఎంఎల్ఏ ఓటు విలువ 208. ఉత్తరప్రదేశ్ లో మిత్రులతో కలిసి మొత్తం 270 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల నల్లేరు మీద బండే అవుతుంది. వీరితో కలసి ఏర్పడే ఎలక్టొరల్ కొలేజీ వోట్లు మొత్తం 10,98,903 ఉంటాయి. ఇందులో బీజేపీ బలం సగానికి పైగా ఉంటుంది.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు మరో సారి రాష్ట్రపదవి ఇస్తారో లేదో తెలియదు. కోవింద్ ప్రస్తుత పదవీ కాలం వచ్చే జులై 15వరకూ ఉన్నది. భారత రిపబ్లిక్ చరిత్రలో ఇంతవరకూ రెండు విడతల రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఒక్క రాజేంద్రప్రసాద్ మాత్రమే. ముప్పవరపు వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేస్తారా లేక ఉపరాష్ట్రపతిగా మరో సారి ఉండమని అడుగుతారా లేక రెండూ ఇవ్వరా అన్నది కూడా అంతుచిక్కని ప్రశ్నే. అప్పుడప్పుడు గులాంనబీ ఆజాద్ ను రాష్ట్రపతి చేయవచ్చునంటూ వార్తలు వచ్చాయి. ఒక ముస్లింని రాష్ట్రపతిగా బీజేపీ ప్రభుత్వం నియమిస్తే హిందూమతాభిమానం అనే ముద్ర తగ్గుతుందనీ, ముస్లింలకు కూడా ఉన్నత పదవి ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందని మంచి సంకేతం పంపవచ్చు. లేకపోతే గులాంనబీని ఉపరాష్ట్రపతి చేసి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిగా పదవోన్నతి కల్పించవచ్చు. వాజపేయి హయాంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా నియమించినట్టే మోదీ గులాంనబీ ఆజాద్ ను నియమించవచ్చు. నబీ ముస్లిం మాత్రమే కాదు కశ్మీరీ ముస్లిం. నబీని నియమించడం వల్ల కశ్మీర్ కు కూడా సానుకూల సంకేతం పంపించవచ్చు. ఆ మధ్య కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ పేరు కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల చర్చలో వినిపించింది. చివరికి మోదీ ఎవరిని ఏమి చేయాలనుకుంటారో వారే అవుతారు. అంతవరకూ చేయగలిగింది ఊహాగానాలు మాత్రమే. ఈ లోగా అధికార బీజేపీ నాయకులు మిత్రపక్షాలతో చర్చలు జరుపుతారు. కూటమిలో లేకపోయినా స్నేహంగా ఉంటున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ, నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతా దళ్ తోనూ చర్చలు జరపవచ్చు. ప్రతిపక్షాలతో సమాలోచన జరిపితే ఇంకా బాగుంటుంది. స్వయంగా గెలిపించుకునే బలం ఉన్నప్పుడు చర్చలూ, సమాలోచనలూ జరపడం బలహీనత కాదు. బలానికీ, ఆత్మవిశ్వాసానికీ సంకేతం. రాజ్యాంగంలోని 58వ అధికరణ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రస్తావించింది.
ఈ ఎన్నికలను పురస్కరించుకొని ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించడానికి ప్రయత్నాలు జరగవచ్చు. బలం లేకపోయినా అభ్యర్థులను పోటీకి పెట్టకుండా ప్రతిపక్షాలు చేతులు ముడుచుకొని కూర్చోవు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం జరుగుతుందని ఎన్నికల ఫలితాలు విడదలయ్యే వరకూ అనుకున్నారు. ఇప్పుడు ఆమెకు మొహం చెల్లుతుందో, లేదో. అరవింద్ కేజ్రీవాల్ చొరవ తీసుకోవచ్చు. త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఇప్పటికే ప్రతిపక్ష ముఖ్యమంత్రుల సమావేశం గురించి ప్రస్తావించారు. ప్రతిపక్ష ఐక్యత సాధించాలని ప్రయత్నిస్తున్నతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, డిఎంకె ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలు కూడా రంగంలో దిగవచ్చు.