Thursday, November 21, 2024

ఆమె ఎవరు?

రామాయణమ్132

మనస్సులో సకల దేవతలను ధ్యానించాడు.  సంధించి విడిచిన బాణంలాగ రయ్యిన దూసుకుని పోయి అశోక వనంలో ప్రవేశించాడు హనుమ.

అది వసంత ఋతు ఆరంభసమయము. వృక్షములన్నీ విరబూసి నానావిధ వర్ణములతో వనమంతా వింతవింత కాంతులతో ప్రకాశించింది. వివిధములయిన పక్షిజాతులకూతలతో, నెమళ్ళక్రేంకారాతో, తుమ్మెదలఝంకారాలతో, మృగసముదాయము చేసే సందడులతో వనములో ఒక సంగీతోత్సవము జరుగుతున్నట్లుగా ఉన్నది.

Also read: అశోక వనమున వెదకలేదని గుర్తించిన హనుమ

అట్టిమనోహరమైన అశోకవనములో సుందర హనుమంతుడు ప్రవేశించెను. ఆయన ఒకచెట్టుమీదనుండి మరియొక చెట్టుమీదకు దూకుతున్నప్పుడు పక్షులకు నిద్రాభంగమై ఒక్కసారిగా కలకలము చేస్తూ అవి ఎగిరిపోసాగినవి. ఆ పక్షుల రెక్కల టపటపలకు పూవులన్నీ జలజలారాలి హనుమను కప్పివేయగా ఆయన కదులుతున్న పూల కొండలాగా భాసిల్లాడు.

ప్రకాశమానమైన రూపంతో పుష్పాభిషేకం గావించుకుంటూ సంచరిస్తున్న హనుమను చూసి భూతగణములన్నీ

ఓహో! వసంతుడు వచ్చాడోయ్ తోటలోనికి అని అనుకొన్నాయి.

అందమైన పూవులచే అలంకరింపబడిన నేల నూతన వధువులాగా వింతశోభతో భాసిల్లింది.

హనుమంతుడు చేసిన విన్యాసాలకు వృక్షములన్నియు ఆకులను, పూవులను రాల్చివేయగా ఆ వనము ప్రియుని పరిష్వంగములో మత్తిల్లి సోలిన మదవతివలే యుండెను.

Also read: చింతాక్రాంతుడైన ఆంజనేయస్వామి

ఆ అశోకవనమునందలి కట్టడములన్నీ మణిమాణిక్య విరాజితములై యుండెను. బావులన్నీ అమృతతుల్యమైన జలములతో నిండియుండెను.

అక్కడ ఒక అందమైన పర్వతము, దానినుండి దూకి నదిగా మారిన జలపాతము ను హనుమ చూసెను

 ప్రియుని మీద అలిగి కొంతదూరము బెదిరించి వెళ్ళి మరల అతనిని విడిచి ఉండలేని యువతివలే ఆ నది కొంతదూరము ముందుకు ప్రవహించి మరల వెనుకకు తిరిగి పర్వతము వైపుగా ప్రవహించుచుండెను. ఆ పర్వతసమీపాన అనేక ప్రాసాదములున్నవి.

సంధ్యాసమయమున అర్చన చేయుటకు నదిసమీపమునకు సీతమ్మ రాగలదు.

ఒక వేళ బ్రతికియుంటే!

Also read: హనుమ ఎంత వెదికినా కానరాని సీతమ్మ

ఆ విధముగా ఆలోచించి ఒక శింశుపా‌వృక్షమెక్కి గుబురుగా ఆకులు ఉన్నచోట ఎవరికీ కనపడకుండా తనకు మాత్రము అంతా కనపడే విధముగా హనుమంతుడు కూర్చుని‌ వనాన్ని అంతా పరీక్షగా చూడటం మొదలు పెట్టాడు.

ఆ చెట్డుమీద కూర్చుండి పరిసరాలను జాగ్రత్తగా గమనించసాగాడు మారుతి. ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉన్నది. పక్షుల కలకలమంతటా వ్యాపించిఉన్నది. మృగముల సందడి ఎక్కువ అయినది. ఆ వనమంతా నయనమనోహరంగా ఉన్నది. అది దేవేంద్రుని నందనమా? కుబేరుని  విచిత్రమైన చైత్రరధమా? లేక మరింక ఏదైన దివ్యపురుషులచే పెంచబడిన వనమా?  అన్నిటినీ మించి శోభిల్లుతున్నది ఆ అశోక వనము.

Also read: లంకలో హనుమ సీతాన్వేషణ

అన్ని ఋతువులలో లభించు పండ్ల చెట్ల తోను, తేనెల సువాసనలు వెదజల్లు వృక్షములతోను, అక్కడ వీచే గాలి అపూర్వసుగంధాలు మోసుకు వస్తున్నది. ఆ అశోక వన మధ్యములో తాను కూర్చున్న వృక్షమునకు దగ్గరగా వేయి స్తంభములపై నిలచియున్న ఒక ఉన్నతమైన ప్రాసాదమును హనుమ చూశాడు.

అక్కడ ఆయన రాక్షస స్త్రీల మధ్యలో కూర్చున్న ఒక యువతిని చూశాడు.

ఆవిడ శుష్కించిపోయి కనపడతున్నది. శుక్లవిదియనాటి చంద్రరేఖవలే నిర్మలమైన కాంతితో సన్నగా ఉన్నది ఆమె. పొగచూరిన అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆమె మాసిపోయిన బట్టలుకట్టుకొని మాటిమాటికీ నిట్టూర్పులు విడుస్తూ దీనంగా రోదిస్తూ కనపడ్డది హనుమస్వామికి …

ఆమె ఎవరు?

Also read: లంకా నగరిలో సీతమ్మకోసం హనుమ అన్వేషణ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles