వోలేటి దివాకర్
అత్యున్నత పదవిలో కూర్చునే దేశ ప్రధమ పౌరుడి ఎన్నికలు కొన్ని ప్రత్యేకతలు, ఆసక్తికర అంశాలతో ముడిపడి ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం జూలై 12న రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ సచివాలయాలకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయడం ప్రారంభించింది.
వివిధ రాష్ట్రాలకు ఎన్నికల మెటీరియల్‌ని పోలింగ్ రోజున ఉపయోగించేందుకూ, వాటిని తిరిగి తీసుకురావడానికీ ఎయిర్‌లైన్స్‌లో ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ కోసం ప్రయాణీకుల టిక్కెట్‌లను బుక్ చేసింది.
‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ అంటే ఏమిటి?
ఎన్నికల సామగ్రిని రవాణా చేసే సమయంలో, ఉక్కుతో తయారైన బ్యాలెట్ బాక్స్ లు విమానం ముందు వరుసలో ప్రయాణీకుడిగా ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో ప్రత్యేక విమాన టిక్కెట్‌పై ఎగురుతాయి. వ్యక్తిగత పర్యవేక్షణలో మెటీరియల్‌ను రవాణా చేసే అధికారి పక్కనే పెట్టె ఉంటుంది. అలాంటి ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ జూలై 12న సాయంత్రం 5:10 గంటలకు ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు విస్తారా విమానంలో బయలుదేరింది. జూలై 12న 14 బ్యాలెట్ బాక్సులను పంపగా, జూలై 13న మరో 16 బ్యాలెట్ బాక్సులు పంపారు. ఈ పెట్టెలు రాష్ట్రపతి ఎన్నికలలో ఉపయోగం కోసం మాత్రమే ఉద్దేశించబడ్డాయి. అయితే కొన్ని బ్యాలెట్ బాక్స్ లు – హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు వెళ్లే పెట్టెలు – రోడ్డు మార్గంలో ప్రయాణిస్తాయి.
‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ దాని గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో వీడియో నిఘాలో గతంలో శానిటైజ్ చేయబడిన, సీలు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో వాటిని నిల్వ చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత, సీల్ చేసిన ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ ఇతర ఎన్నికల సామగ్రిని అందుబాటులో ఉన్న తదుపరి విమానంలో తిరిగి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి, రాజ్యసభ సెక్రటేరియట్‌కు రవాణా చేయబడుతుంది. ఎన్నికల సమయంలో పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 37 మంది పరిశీలకులను కూడా నియమించింది.
53 ఏళ్ల సంప్రదాయం
బ్యాలెట్ బాక్సులను ప్రయాణికులుగా రవాణా చేయడం 53 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. 1969లో ఎన్నికల సంఘం పౌర విమానయాన శాఖ నుండి ఈ ప్రత్యేక హక్కును పొందింది. భారత తదుపరి రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరగనుండగా, జూలై 24న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జూలై 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై సంఖ్యాపరంగా ముందంజలో ఉన్నారు, ప్రత్యేకించి ముర్ముకు బిజు జనతాదళ్, వైఎస్ఆర్సీపీ, ఎన్డీయే లో భాగస్వామ్యంలో లేని టీడీపీ, శివసేన వంటి ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా లభించిన నేపథ్యంలో ఆమె విజయం ఖాయంగా కనిపిస్తోంది.