నిర్గుణుండు విశ్వమెటుల సృజియించె
నిరాకారు రూపమెటుల బంధించే
నిరంజను స్తోత్ర మెటుల స్పృశియించే
ఉన్నను లేడనుపించువాడు
లేనట్లు తోచి ఉన్నవాడు
పిలచినను పిలువకున్నను నిశ్శబ్దమున పలుకువాడు,
మాధవుడొ, ఉమాధవుడొ,
వేరొకడో, నాయందు నిలిచి యున్నాడు
కొలుచుదు వాని నేను విశ్వంభరునిగా
గురునిగా, గూఢ విభుఁనిగా, వేరొండు చోట వెదుకగానేల?
కనిపించడు, ఊహలకు అందడు, చేష్టలకు లొంగడు,
హృదయపల్లవిని వినిపించుకోడు,
జ్ఞాన పల్లమెరిగి ప్రవహించడు,
వినతులు విని తలయూపడు,
కష్టమెఱిగి కనుబొమ్మలైన కదపడు,
కఠినాత్ముడు, కపటి, ఎటుల వేగుదు వీనితోడ,
కానిలే, ఎందు పోగలడు,
భక్తి తమకమ్మున దక్కకపోడు.
Also read: తమ్ముడు
Also read: కోడి
Also read: బొమ్మలు
Also read: పుష్ప వేదన
Also read: తపస్సు