అది కొండో, పర్వతమో తెలీదు
నాకెదురుగా, నాకడ్డుగా,
ఎత్తుగా, నల్లగా, నున్నగా,
గంభీరంగా, కొంత భీకరంగా…
నా ధైర్యాన్ని పరీక్షిస్తున్నట్లు,
నా తెగువకు సవాలు విసురుతున్నట్లు!
ఆవలివైపు ఏముందో?
స్వర్గమా, నరకమా, కైవల్యమా,
లేక కేవలం శూన్యమా?
అయినా తప్పదు…
ఇది నా ప్రస్థానం, ఆఖరి ప్రస్థానం…
పట్టుకోసమ్ చూసాను, మెట్టు కోసం వెతికాను…
రాయి, రాయి లాగి పరీక్షించాను…
ఎక్కడో గుబులు, ఎదో భయం…
ఇంతవరకు నేను పాదచారిని…
ఇప్పుడీ పర్వతారోహణ…
వెనుకకు తిరిగి చూసాను…
నేనొచ్చిన దారి కరిగిపోయింది,
నా పాతలోకమే కనుమరుగై పోయ్యింది.
ఇక తప్పదు.
ఒక్కసారి పైకి, మబ్బుతెరలవెనుక నక్కిన
నల్లని శిఖరం వైపుకు చూసాను…
చూస్తూ ఉండిపోయాను…
అక్కడ ఏదో అలికిడి…ఒక వ్యక్తి
మెరిసే తెల్లటి పొడుగాటి అంగీ లో
నన్ను, నన్నే చూస్తున్నాడు.
అంత దూరం నుండి అతను చల్లగా
చిరునవ్వు నవ్వడం కనిపించింది…
అవును…నన్ను చూసే…
ఇప్పుడు చేతులు ఊపుతున్నాడు,
తల ఎగరవేస్తూ రమ్మన్నట్లు సైగ చేస్తున్నాడు…
ఎవరతను?
నేను చేతులు ఊపా.
ఎక్కడ లేని ధైర్యం వచ్చింది…
కాళ్ళలో బలం పుంజుకొంది,
చేతులకు పట్టు దొరికింది.
అతన్నే చూస్తూ, కొండ ఎక్కడం ప్రారంభించా.
అతను నవ్వుతూనే ఉన్నాడు…
అలసట మరచా, భయాన్ని క్రిందనే వదిలివేసా.
ఎంతసేపయ్యిందో…
చివరకు శిఖరం చేరా…అటూ ఇటూ చూసా
అతను లేడు… ఎక్కడికి పోయాడు, ఎలా పోయాడు?
ఆశ్చర్యాన్ని అణచుకొని
చల్లని గాలి ముఖాన్ని తాకుతుంటే
అలాగే తల ఎత్తి నిలుచుండి పోయా!
ఇదే విడుదల, స్వాతంత్య్రం, నిర్వాణం.
సూర్యుడు మెల్లగా, ఎర్రగా
తన కిరణాలను ఉపసంహరిస్తూ
పశ్చిమ దిగంతం లోనికి దిగుతున్నాడు.
అటూ ఇటూ తిరుగుతూ,
నేనెక్కి వచ్చిన మార్గాన్ని పరిశీలిస్తూ క్రిందకు చూసా.
పర్వత పాదం వద్ద ఇంకొకతను…
ఒకప్పుడు నాలాగే పైకి రావడానికి దారి వెతుకుతున్నాడు.
అతన్ని చూసి నవ్వా, చేతులు ఊపా,
“రా, వచ్చేయ్!” అంటూ అరిచా.
అతని కళ్ళలో కొత్త ధైర్యం…శరీరంలో కొత్త బలం…
నేను నవ్వుతూనే ఉన్నా…
ఇంతలో నాలో ఏవో మార్పులు…
కొత్త మిల మిల మెరిసే తెల్లటి అంగీ,
భుజాల వద్ద కొత్తగా మొలిచిన వెండి రెక్కలు…
ఒక్కసారిగా గాలిలోకి లేచా…
తేలికగా, హాయిగా, దూదిపింజలా…
నా ముందు నాలాగే ఇంకొందరు ఆకాశంలో…
వెండి రెక్కలతో…
Also read: ప్రయాణం
Also read: నడమంత్రపు సిరి
Also read: మళ్లీ మనిషిగా పుడదాం
Also read: నేటి భారతం
Also read: వ్యధ