- ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య సమతౌల్యం పాటిస్తారా?
- కురువృద్ధుడు అడ్వాణీ సర్వోన్నత పదవికి అంగీకరిస్తారా?
- వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి పదవి వరిస్తుందా?
- తమిళిసై ఉపరాష్ట్రపతి పదవికోసం ప్రయత్నిస్తున్నారా?
రాష్ట్రపతి ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. అత్యున్నతమైన ఈ పదవి ఈసారి ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ మొదలైంది. అధికార -విపక్షాలు రెండూ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసులో ఎవరున్నారో… అనే ఆసక్తి కూడా ఊపందుకుంటోంది. ఈ సంవత్సరం ఆగస్టులో దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులుగా కొత్తవారు సింహాసనాన్ని అధిరోహించాల్సి వుంది. ఈ నేపథ్యంలో, ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎవరి అంచనాలు వారు కడుతున్నారు.ప్రస్తుతానికి, రాజకీయంగా అధికార ఎన్డీఏ అత్యంత బలంగా ఉంది. సాంకేతికంగా మాత్రం బలం కొంచెం తక్కువగా ఉంది. ఎలక్టోరల్ కొలేజ్ విధానంలో ఎంపిక జరగడం మన దేశంలో ఆనవాయితీ.
Also read: కరోనా మళ్ళీ కాటేస్తుందా?
యూపీ ఎంఎల్ఏ ఓటు విలువ అత్యధికం
దేశంలోని ప్రతిరాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ అందులో సభ్యులుగా ఉంటారు. వీరందరూ వేసే ఓటు అత్యంత కీలకమైంది. ఆ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన సభ్యలకు ఓటు విలువను నిర్ణయిస్తారు.ఈ విలువ అందరికీ సమానంగా ఉండదు. ఉత్తరప్రదేశ్ సభ్యులకు ఈ విలువ ఎక్కువగా ఉంటుంది. చిన్న రాష్ట్రాలకు చాలా తక్కువగా ఉంటుంది. 2017లో రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా ఎంపిక చేసినప్పుడు, ఎన్డీఏ 65.65 శాతం ఆధిక్యాన్ని దక్కించుకుంది. ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ కు కేవలం 34.35 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. అప్పటితో పోల్చుకుంటే రాష్ట్రాల్లో బిజెపి బలం మరింతగా పెరిగింది. ఎన్డీఏ ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడం వల్ల అక్కడ పట్టు కొంత తగ్గిపోయింది. శివసేన దూరమవ్వడం కూడా కొంత నష్టాన్ని కలిగించే అంశం. అన్నింటినీ లెక్కలు వేసుకుంటే, ఎన్డీఏకు 48.9శాతం బలం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్షాలతో పాటు, ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలన్నీ కలిసి 51.1శాతంగా ఉన్నాయి. తమ అభ్యర్థినే అధికార పీఠంపై కూర్చోపెట్టాలంటే… ఈ వ్యత్యాసాన్ని అధిగమించాల్సిన అవసరం ఎన్డీఏకు ఉంది. విపక్షంగా చెప్పుకునే పార్టీలన్నీ బిజెపి వ్యతిరేక పార్టీలు కావు. కొన్ని పార్టీలు తటస్థంగా ఉన్నాయి.మరికొన్ని బయట నుంచి మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో, అధికారపక్షం మళ్ళీ ఎవరిని నిలబెడితే ఆ అభ్యర్ధులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసులో ఎవరెవరు ఉంటే వారే… పీఠాన్ని ఎక్కుతారని మెజారిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈలోపు,పలు రాష్ట్రాలలోని 52 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అందులో రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎన్డీఏ అధికారంలో లేదు. దీని వల్ల అధికార పక్షానికి రాజ్యసభలో కొంత బలం తగ్గుతుంది. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల వల్ల ఎన్డీఏ బలం కొంత పెరుగనుంది. ఈ బలాబలాలు ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తాయి.
Also read: అ‘ద్వితీయ’ విద్యా విధానం
కాంగ్రెస్ మరింత డీలా
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బలం మరింత పడిపోనుంది. ఇది బిజెపికి కలిసివచ్చే అంశం. ఈసారి ప్రాంతీయ పార్టీల ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్,ఒరిస్సాలోని అధికార పార్టీల మద్దతు బిజెపికే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకొనే నిర్ణయాలలో ఎక్కువవాటికి తమ మద్దతును అందించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి నుంచి ఒకే విధానాన్ని పాటిస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వారితో విభేదించకుండా, తమ రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితమై వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా,అధికార ఎన్డీఏ నిలబెట్టే అభ్యర్థులకే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయవచ్చు. ఇవన్నీ అధికారపక్షానికి కలిసివచ్చే అంశాలు. అధికార -ప్రతిపక్షాలు రెండూ తమ అభ్యర్థులు ఎవరన్నది ఇంతవరకూ ప్రకటించ లేదు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో,ఈ వైఖరిని అవలంబిస్తున్నాయి.అది వ్యూహంలో భాగమేనని అర్ధం చేసుకోవాలి. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో బోలెడు ఊహాగానాలు రాజ్యమేలుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతగులాం నబీ ఆజాద్ ను అధికార పక్షం ఎంపిక చేస్తుందని,శరద్ పవార్ ను ప్రతిపక్షాలు నిలబెడతాయని కొన్ని వదంతులు వ్యాపించాయి. ఎల్ కె అడ్వాణీని రాష్ట్రపతిగా ఎంపిక చేయవచ్చునని ఈమధ్య కొన్ని కథనాలు వచ్చాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతిగా పదోన్నతి లభించే అంశాన్ని కొందరు చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి -ఉపరాష్ట్రపతుల ఎంపికలో, ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతుల్యతను పాటించే అవకాశాలు కూడా ఉన్నాయి. మైనారిటీ,గిరిజన వర్గాలలో ఎవరోఒకరికి ఏదో ఒక పదవి దక్కే వాతావరణాన్ని కొట్టిపారెయ్యలేమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, మెట్రోమ్యాన్ శ్రీథరన్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పఠేల్ , హరియాణా గవర్నర్ దత్తాత్రేయ మొదలైనవారి పేర్లు వినపడుతున్నాయి.
Also read: జీ 7 సదస్సుకు మోదీజీకి ఆహ్వానం ఖాయం
వినిపిస్తున్నాయి చాలా పేర్లు
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఉపరాష్ట్రపతి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.మొదట్లో కొంతకాలం సయోధ్యగా ఉన్నా, ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్- గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు బాగా పెరిగిపోయాయి. బిజెపి/ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రత్యక్షపోరుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపే దాకా విశ్రమించేది లేదని కెసీఆర్ భీషణప్రతిజ్ఞలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు బిజెపికి ఏ మేరకు ఉంటుందన్నది అనుమానమే.ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏకమవ్వడంలో విపక్షాల మధ్య సఖ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.బిజెపి గురువృద్ధుడు, రాజకీయ కురువృద్ధుడైన ఏల్ కె అడ్వాణీని రాష్ట్రపతిగా ఎంచుకుంటే? ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంచిపేరు రావడంతో పాటు అపోహలు తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వయసు రీత్యా అడ్వాణీ 90లు దాటి వున్నారు. కానీ,మంచి ఆరోగ్యంగానే ఉన్నారు. తెలుగువారికి సముచితమైన గౌరవం దక్కితే అది మనందరికీ ఆనందకరమే. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు స్వామినాథన్, మహాత్మాగాంధీ వారసుడు రాజ్ మోహన్ గాంధీ వంటి వారున్నప్పటికీ, రాజకీయమైన లెక్కల ప్రకారం జరిగే ప్రక్రియలో పదవులు ఎవరిని వరిస్తాయో.. ఏలినవారికే ఎరుక. అభ్యర్థుల వయస్సు,ఆరోగ్య అంశాలు కూడా ప్రాతిపదికగా పనిచేస్తాయి. సామాజిక,భౌగోళిక సమతుల్యతలను కూడా పాటించాల్సి ఉంటుంది. అత్యున్నతమైన పదవులలో రాజకీయాలకు అతీతంగా, అత్యుత్తములను కూర్చోపెట్టడం అత్యంత సముచితం.
Also read: ఒంటిమిట్ట రామాలయ ప్రాశస్త్యం