- చర్చలేవనెత్తిన బిషిన్ సింగ్ బేడీ
- రహానేనే మెరుగైన కెప్టెన్ అంటున్న మాజీలు
ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి కెప్టెన్సీ అవసరమా? కొహ్లీ సమర్థవంతమైన నాయకుడిగా పనికిరాడా?…కొహ్లీ కంటే రహానేనే మెరుగైన కెప్టెనా?.. ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్ ను అజింక్యా రహానే నాయకత్వంలో భారతజట్టు 2-1తో నెగ్గిన వెంటనే…పై ప్రశ్నలు మరోసారి బయటకు వచ్చాయి.
విరాట్ కొహ్లీ నాయకత్వంలో ఆడిన తొలిటెస్టులో భారతజట్టు 36 పరుగులకే కుప్పకూలి 8 వికెట్ల ఘోరపరాజయం చవిచూస్తే…ఆ తర్వాత నుంచి జట్టుకు నాయకత్వం వహించిన రహానే మాత్రం చివరి మూడుటెస్టుల్లో రెండు విజయాలు, ఓ డ్రా అందించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.
Also Read : సొంతూర్లో నటరాజన్ కు జనరథం
సీనియర్లు అందుబాటులో లేని సమయంలో అనుభవంలేని యువఆటగాళ్లలో రహానే స్పూర్తి నింపి జట్టును గెలుపుబాటలో పయనించేలా చేసిన తీరు చూసి అభిమానలు, క్రికెట్ పండితులు ఫిదా అయిపోయారు.
కెప్టెన్ గా రహానే ప్రతిభను చూసి భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, బిషిన్ సింగ్ బేడీ అబ్బురపడిపోతున్నారు. భారత క్రికెట్ కు విరాట్ కోహ్లిలోని ఓ సాదాసీదా కెప్టెన్ కావాలా లేక గ్రేట్ బ్యాట్స్‌మన్ కావాలో తేల్చుకోవాలని ఎంపిక సంఘానికి సూచించాడు.
టెస్టు జట్టుకు రహానే, వన్డే జట్టుకు కొహ్లీ, టీ20 జట్టుకు రోహిత్ నాయకులుగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే ఎంపిక సంఘానికి అంత ధైర్యం, తెగువా ఉన్నాయా అని బేడీ ప్రశ్నించాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో సైతం రహానేను కెప్టెన్ గా కొనసాగిస్తే బాగుండేదని అన్నాడు.
Also Read : తండ్రి సమాధి వద్ద సిరాజ్ భావోద్వేగం
వారేవ్వా!…అజింక్యా….
ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్ లో రహానే కెప్టెన్సీ ప్రతిభను చూసి.. అతనికి తాను పెద్ద అభిమానిగా మారిపోయాని బేడీ చెప్పాడు. గాయాలబారిన పడిన కీలక ఆటగాళ్లు, అనుభవం ఏమాత్రం లేని యువఆటగాళ్లు తన ముందున్నా…ప్రతికూల పరిస్థితుల్లో జట్టును ముందుండి నడిపించిన తీరు అపూర్వమని బేడీ విశ్లేషించాడు. బౌలింగ్ వనరులను రహానే ఉపయోగించిన తీరు మరింత ప్రత్యేకమని చెప్పాడు. రహానేను చూస్తుంటే తనకు టైగర్ పటౌడీ కెప్టెన్సీయే జ్ఞాపకం వచ్చిందని బేడీ గుర్తు చేసుకొన్నాడు. పటౌడీ భారత కెప్టెన్ గా ఉన్న సమయంలోనూ తగిన వనరులు లేకున్నా.. తన నాయకత్వ ప్రతిభతో జట్టును విజేతగా నిలిపాడని తెలిపాడు.
ఇప్పుడు రహానే కూడా అదే పని చేస్తున్నాడని, పటౌడీని తలపిస్తున్నాడని చెప్పాడు. బౌలింగ్ వనరులను చాకచక్యంగా వాడుకోవడంలోనే ఓ కెప్టెన్ సామర్థ్యం ఏంటో తెలుస్తుందని, ఆ విషయంలో రహానే పూర్తిగా సఫలమయ్యాడని అన్నాడు. కెప్టెన్సీ అంటే 90 శాతం అదృష్టం, కేవలం పది శాతం మాత్రమే నైపుణ్యం.. కానీ ఆ పది శాతం కూడా లేకపోతే కెప్టెన్ గా సాహసం చేయరాదని రిచీ బెనాడ్ ఆనాడే చెప్పిన విషయాన్ని బేడీ గుర్తు చేశాడు. రహానే విషయంలో మాత్రం 50 శాతం లక్, 50 శాతం నైపుణ్యం ఉన్నాయని కొనియాడాడు. కోహ్లి బ్యాటింగ్ కెరీర్ సుదీర్ఘ కాలం కొనసాగాలంటే టెస్ట్ కెప్టెన్సీని సత్వరమే రహానేకు అప్పగించాలని సూచించాడు.
Also Read : స్వస్థలాలకు చేరిన క్రికెట్ హీరోలు
అజింక్యాకు సిరాజ్ హ్యాట్సాఫ్….
అజింక్యా రహానే నాయకత్వం లక్షణాలను యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కొనియాడాడు. కెప్టెన్లుగా కొహ్లీతో పాటు రహానే అన్నాతనకు ఎంతో ఇష్టమని, కొహ్లీ దూకుడుగా కనిపిస్తే…రహానే మాత్రం దానికి భిన్నంగా కూల్ కూల్ గా తన పనికానిస్తుంటాడని సిరాజ్ చెప్పాడు. మెల్బోర్న్ నుంచి బ్రిస్బేన్ టెస్టుల వరకూ తాను..అజింక్యా నాయకత్వంలో ఆడానని..ఒత్తిడికి గురికాకుండా చూడటం, చక్కటి సలహాలు, సూచనలతో స్ఫూర్తిని నింపడంలో అజింక్యాకు అజింక్యానే సాటని సిరాజ్ తన అభిమానాన్ని చాటుకొన్నాడు.
దేశంలోని సగటు అభిమానులు సైతం…విరాట్ కొహ్లీ కంటే అజింక్యా రహానేనే మెరుగైన కెప్టెన్ అని భావించడం కొసమెరుపుగా మిగిలిపోతుంది.