* పెద్దపల్లి జంటహత్యల వెనుక పెద్దలు?
* మాయమైన మానవత్వం
*గట్టు దంపతుల హత్యలో పట్టుదలలదే ప్రధాన పాత్ర
పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో జరిగిన గట్టు వామనరావు దంపతుల హత్య మానవీయ కోణం లో తీరని మచ్చ. హంతకులు కత్తులతో కరాళ నృత్యం చేస్తుంటే. ఎంతటి సాహసి అయినా కత్తులకు ఎదురు వెళ్లలేరు. సమాజం నిర్జీవం కావడానికి కారణం ప్రాణ భయం. కత్తిపోట్లు తిన్న వ్యక్తి న్యాయవాదా? లేక నిందితుడా అని తెలుసుకునే లోపలే రెండు ప్రాణాలు రక్తం మడుగులో ఉన్నాయి. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న న్యాయవాది నీళ్ళు కావాలని అడిగినా నిస్సహాయత చూపిన జన ప్రవాహం కాసిన్ని నీళ్లు ఇస్తే మానవత్వం కనిపించేది. కానీ సాహసించి వీడియోలు తీయడానికి ఆసక్తి చూపిన “కెమెరా మెన్లు” వామన రావు గారి భార్య ఫోటోలను కూడా అచేతనమైన స్థితిలో వాట్సప్ లో పోస్ట్ చేయడం క్షమించరాని నేరం. తమ కారులో వాళ్లను ఆసుపత్రికి తరలించాలన్న ఇంగితాన్ని మరవడం క్షమించరాని నేరం. రక్తం మడుగులో కొట్టు మిట్టాడుతున్న వ్యక్తిని లేవదీసి కారులో వేసినా మానవత్వం మంటకలసిపోలేదు అనిపించేది. కానీ అలా జరగలేదు…దూరంగా ఉన్న వారు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు అనే మాటలు ఏమో గానీ ఆ వీడియో తీసి మానవత్వాన్ని మరిచినా, అలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాలనే మానవత్వం ఉండాలన్న సందేశాన్ని మాత్రం ఆ వీడియో ద్వారా వైరల్ చేశాడు.
పుకార్ల షికార్లు
ఇక తదుపరి ఎన్ని పుకార్లు షికార్లు చేసినా చచ్చిపోయిన వారి మీద ఎన్ని అభాండాలు వేసినా ఆ హత్యలు చేసిన వారు, పోలీసుల ముందు దోషులుగా నిలిచిన కొద్దికాలం తరువాత ప్రజలు జనజీవన యాత్రలో ఇలాంటి హత్యలు ఒక భాగం అనుకునే విధంగా జ్ఞాపకాల దొంతరలో నిక్షిప్తం చేస్తారు తప్పా సమాజ దృక్పథంలో నా వంతు పాత్ర ఇలా ఉండాలని తమ మైండ్ సెట్ ను మార్చుకోరు. దారితప్పిన దారి తప్పుతున్న యువతను మారుద్దామనే ఆలోచన ఎవరికీ రాదు. ఆకలి కోసం నేరం చేసే వారిని చేరదీసే రాజకీయ నాయకులు వాళ్ళను రౌడీ లుగా మారుస్తున్నారు. డబ్బులు దొరికే అనువైన మార్గాలు వారికి బోధించి, అనైతిక కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళను హాంతకులుగా మారుస్తున్నారు. జైలు లో తన దోవనే ఉన్న వారిని చూసి మరింత క్రిమినల్ గా మారి ఓటు బ్యాంకు రాజకీయం చేసి. ఇంకేం తరువాత వాళ్లే సరికొత్త రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తేస్తున్నారు.
Also Read : న్యాయవాదుల హత్యకేసులో టీఆర్ఎస్ నాయకులపై అనుమానం
పూర్వాపరాలు
అసలు పూర్వా పరాలు తీస్తే హాయిగా హైద్రాబాద్ లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకోకుండా ఊళ్ళో రాజకీయాల్లో తల దూర్చి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న వామనరావు “అభ్యుదయం” కోసం బలైనారు. ఆయన తో అభం శుభం ఎరగని భార్య కూడా హత్యకు గురైంది. ఊళ్ళోకి వద్దురా రావద్ధురా అన్న తండ్రి మాట పక్కన బెట్టి కన్నవాళ్లకు కడుపు శోకం మిగిల్చి వెళ్లిన వామన రావు ఆశయాలు నెరవేరలేదు… సరికదా…నేరస్థుల ఆగడాలు మరింత పెరిగేలా ఈ హత్య ద్వారా ఆ ప్రాంతం అంతా భయ బ్రాంతికి గురైంది! అసలు వామనరావు రాజకీయ అస్థిత్వమా? లేక తన ఉనికిని చాటుకుందామనే తపనా ? లేక ఆయన లో అంతేర్లీనంగా ఉన్న రాజకీయ ప్రయోజనామా? అని ఆరాదీసే వారికి ఇక ఆయన మాట్లాడలేని మసిగా మారిపోయాడు!
నేరభూయిష్టం అవుతున్న గోదావరి తీరం
ముందుకు మాదకద్రవ్యాల కు…ఇసుక మాఫియాకు నెలవై ఉన్న గోదావరి తీరప్రాంతం మంథని నుండి కాళేశ్వరం వరకు మాఫియా రాజ్యం విస్తరించింది… అని పాలక పక్షం గమనించడం లేదు. అనైతిక కార్యకలాపాలూ, ఎడతెగని ఆగడలూ, ఇసుక కోసం రోజూ వేలాది లారీలు పెద్దపల్లి నుండి గోదావరి నదీ తీరం వరకు బారులు తీరి అడుగాడుగునూ ప్రమాదాలు పొంచి ఉన్నా, కిరాయి హంతకుల అడ్డాగా మారుతున్నా కూడా పోలీసులు నిద్రావస్థలో ఉన్నారు… దానికి తోడు కొత్త బొగ్గు గనులు పెద్దపల్లి ప్రాంతంలో రాబోతున్నాయి…జన సాంద్రతకు తగ్గట్టు పోలీసు వ్యవస్థ పెరగలేదు. పోలీసు స్టేషన్లలో కేసులు పెరుగుతున్నా కూడా ప్రభుత్వం కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయలేదు.
మార్పుల వల్ల ఘర్షణలు
సమాజంలో వస్తున్న మార్పుల వల్ల ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఘర్షణకు దారి తీస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వీక్షకులు పెరగడం వల్ల తరచు ఆ మార్గంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాధుడు లేడు. పెట్రోలింగ్ వాహనాల జాడే ఉండదు. అందుకే పట్టపగలు రెండు ప్రాణాలు కత్తులు కోరలకు బలయ్యారు! సంఘటన జరిగిన తర్వాత కొన్నాళ్ళు హల్ చల్ చేసే పోలీసు వ్యవస్థ పై ప్రజలు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లు గూగుల్ ను అరచేతిలో పెట్టడం వల్ల ప్రతి మూమెంట్ పరులకు చేరిపోయి నేరప్రవృత్తికి కారణం అవుతోంది…యు ట్యూబ్ ఛానల్ ల్లో నేరం నుంచి తప్పించుకుని వెళ్లే మార్గాలు బోధించే వీడియోలు రావడం వల్ల యువత పెడమార్గం పడుతుంది.
Also Read : పెద్దపల్లి జంటహత్యలపై హైకోర్టులో పిటిషన్
తమ వృత్తే తమ శత్రువు
అడ్వకేట్ గా నైపుణ్యం చూపే శక్తి వామన రావుకి ఎంతగా ఉన్నా ఆయన వేసిన కేసులను చిత్తు చేసే వారూకూడా అడ్వకేట్ లే కాబట్టి చిత్రం ఇలా మారింది! న్యాయవాద వృత్తిలో ఉండే ప్రధాన సూత్రాలు పాటించే వారు ఉన్నారా? ఉంటే బ్రతికి బట్ట గట్ట గలుగుతున్నారా? సమాజంలో తమ వృత్తి తమకే శత్రువు అవుతుందని ఊహించలేక పోతున్నారు. మంచి న్యాయవాది కలిగి ఉండాల్సిన లక్షణాలు ఎంత మందిలో ఉన్నాయి? ఉత్తమ మైన అడ్వకేట్ ఎలా ఉండాలో ఆ సూత్రాలు పాటిస్తే సమాజంలో మార్పు వస్తుందా?
మీ ఆదర్శ వృత్తికి అవసరమైన నైపుణ్యాలు కాలక్రమేణా సన్నగిల్లుతున్నాయి.. విజయవంతమైన న్యాయవాదిగా ఉండాలని కోరుకునే వారు కొన్ని సూత్రాలు పాటించాలి. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన న్యాయవాదులు మౌఖికంగా మాట్లాడాలి, మంచి వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. మంచి శ్రోతలు అయి కూడా ఉండాలి! న్యాయమూర్తుల ముందు న్యాయస్థానంలో నమ్మకంగా వాదించడానికి, మాట్లాడే నైపుణ్యాలు అడ్వకేట్ కు అవసరం.
న్యాయవాదులు కక్షిదారుల మధ్య రాజీ చేయాలి
న్యాయవాదులు స్పష్టంగా, ఒప్పించే శక్తి కలిగి ఉండాలి. సంక్షిప్తంగా వ్రాయగలగాలి, ఎందుకంటే వారు వివిధ రకాల చట్టపరమైన ఆలోచనలు పత్రాలను తయారు చేయాలి. క్లయింట్లు వారికి చెప్పే వాటిని విశ్లేషించడానికి లేదా సంక్లిష్టమైన సాక్ష్యాలను అనుసరించడానికి, న్యాయవాదికి మంచి శ్రవణ నైపుణ్యాలు ఉండాలి. పరిమిత సమాచారం నుండి సహేతుకమైన, తార్కిక తీర్మానాలు చేయగలిగే సామర్థ్యం వారికి ఉండాలి. ఇలా అన్ని నైపుణ్యాలు ఉన్న వారు..ఎదుటి వ్యక్తి వేసే కేసులను జడ్జీ ముందుకు వెళ్లకుండా పరస్పరం కూర్చుని క్లయింట్లను రాజీ కుదిరిస్తే కోర్టుల్లో ఇన్ని పెండింగ్ కేసులు ఉండవు…వామనరావు ఇటువంటి హితోక్తులను పెడచెవిన పెట్టడం వల్ల ఆయన పట్టింపులకు పోయి..ప్రాణం మీదకు తెచ్చుకున్నారనే మాటలు ఎన్ని వినవస్తున్నాయి. పెద్దలు ఆడే రాజకీయ మాయా జూదంలో వామన రావు ఒక బలిపశువు.
Also Read : సూమోటోగా లాయర్ల హత్య కేసు, నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం