భగవద్గీత – 22
‘‘రానీ రానీ వస్తే రానీ కష్టాల్, నష్టాల్ వస్తేరానీ, పోనీ పోనీ పోతే పోనీ సతుల్, సుతుల్, హితుల్ పోతేపోనీ ‘‘ అని శ్రీశ్రీ ఒక కవితలో చెపుతారు!
అంటే ఆవాహన లేదు. విసర్జన లేదు. జరిగేదేదో జరగనీ. దేనిమీదా మమకారంలేదు, ఏదో కావాలనే హుంకారములేదు. ఏది తనదారిలో వస్తే అదే స్వీకరించి దొరికినదానితో తృప్తిపడే వాడే అసలైన సన్యాసి!
Also read: వర్తమానం ప్రధానం
కాషాయం కట్టిన వాడే సన్యాసి కాదు. అసలు కాషాయం కట్టాలనుకోవటం ఒక కోరిక. అందులోనూ చీనిచీనాంబరాలు, ఖరీదయిన కాషాయరంగులో కల పట్టువస్త్రాలు చుట్టుకోవటం కోరిక యొక్క వికృతరూపం!
ఉదయ, సాయంత్రాలలో సంధ్యాసమయాలలో ఆకాశం కాషాయం రంగులో ఉంటుంది. అంటే మార్పుకు చిహ్నం.
గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాలను విడిచి, నేను మార్పును ఆహ్వానిస్తున్నాను అనటానికి ఒక సంకేతమది. కాషాయం కడితే కట్టవచ్చు, కట్టకపోనూ వచ్చు. కాషాయం కట్టిన వాడు కాకపోతే మరి సన్యాసి ఎవరు ?
Also read: గురువు ప్రసన్నుడై అనుగ్రహించేది జ్ఞానం
‘‘రాగ ద్వేషాలను విడిచివేసినవాడు’’. సన్యాసి, ఇది నిర్వచనం. దీనిని పరమాత్మ నిర్వచించారు.
॥‘‘జ్ఞేయః స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే ‘‘॥
ఓ అర్జునా, యః ఎవడైతే, న ద్వేష్టి…ద్వేషింపడో, న కాంక్షతి…ఆశింపడో, అట్టి వాడు నిత్యసన్యాసిగా తెలిసికొనదగినవాడు.
మరి సన్యాసి కర్మ చేయాలా? అని మనం అడుగుతాం. దానికీ సమాధానం చెప్పారాయన.
చేసే పనిపట్ల గానీ అది ఇచ్చిన ఫలితం పట్లగానీ ఏ విధమయిన ప్రేమగానీ ద్వేషం గానీ లేకుండా ఉంటాడట నిజమయిన సన్యాసి. అలాంటి మహానుభావులు ఇప్పుడు ఉన్నారా? లేరా? లేకేం ఉన్నారు!
శ్రీ రామకృష్ణులు శారదామాత వీరు సంసారులే కానీ సంసారంలో లేరు,
రమణులు ఏ కాషాయం కట్టారు? గోచిగుడ్డ తప్ప!
కంచి శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కాషాయానికి, సన్యాసాశ్రమానికి ఒక నిర్వచనం.
మహానుభావులను మనమే అన్వేషించాలి. వారు ఫలానా యూనిఫారంలో ఉంటారని మాత్రము చెప్పలేము, వారు సంసారం కూడా చేస్తూ ఉండవచ్చు మనసు సన్యసించవచ్చు.
మన టి.వి చర్చలలో ఖరీదయిన కాషాయం కట్టిన వారు ఎలాంటి సన్యాసులో మీరే నిర్ణయించుకోవచ్చు!
Also read: సర్వం బ్రహ్మమే