Wednesday, January 22, 2025

నేను అంటే ఎవరు?: ఒక వైజ్ఞానిక వివరణ

ఏళ్ళకేళ్ళుగా జీవాత్మ-పరమాత్మ అంటూనో, అహంబ్రహ్మాస్మి అంటూనో ఆధ్యాత్మిక, ధార్మిక తాత్త్విక ప్రముఖులు ఇచ్చేవివరాలు వింటూ కాలం గడిపేశాం. మానవుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి అవి కొన్ని శతాబ్దాలపాటు ఉఫయోగపడ్డాయి. నిజమే! కాని, అవి నిజ నిర్థారణకు నిలబడేవి కావు. కేవలం నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా మానవ సమాజాన్ని ప్రభావితం చేశాయి. నేలకొరుగుతున్న తీగను నిలబెట్టడానికి పందిరి వేయాల్సి ఉంటుంది. విశ్వాసాలు పందిరిలాంటివి. ఇప్పుడు మనకు ఉన్నవిజ్ఞానం, శాస్త్రపరిజ్ఞానం తీగదశలో లేదు. మహావృక్షంగా మారిపోయింది. దాన్ని నిలబెట్టడానికి ఏ పందిరి గుంజా అక్కరలేదు. దాన్ని అలా స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఏపుగా ఎదగనివ్వాలి. వర్థిల్లనివ్వాలి. విశ్వాసాల నీడలో, అభద్రతా భావంతో ఇంకా ఇంకా బితుకుబితుకు మంటూ బతకగూడదు. వాస్తవాల్ని అర్థం చేసుకుని, ఆత్మవిశ్వాసంతో మనగలగాలి.

‘‘నువ్వు నీచుడివి, నికృష్ణడివి, జన్మరాహిత్యం కోసం ఫలానా దేవుణ్ణి నమ్ము, ఫలానా మతంలో చేరు-’’ అని చెబుతాడు ఏ మత పెద్దయినా. అదంతా వానే. వానివాని మనుగడకోసం పడుతున్న తాపత్రయం- అని మనం అర్థం చేసుకోవాలి!

‘‘మీరునమ్మండి. ఫలితం కనిపిస్తుంది’’- అని అంటారు వాళ్ళు.

‘‘ఫలితం కనిపిస్తే నమ్ముతాం’’ అని అందాం మనం.

చీమగా, దోమగా, కుక్కగా, గాడిదగా పుట్టి, పుట్టి పుణ్యం చేసుకున్నందువల్ల, మనిషి మనిషిగా పుట్టాడని చెపుతారు వాళ్ళు. అంటే సృష్టంలో మనిషి ఉన్నపళాన ఊడి పడలేదనీ, కాలక్రమంగా పరిణామదశల్లో-జంతు రూపాల దశలు దాటి, దాటీ చివరికి మనిషి-మనిషి రూపు  సంతరించుకున్నాడని చెప్పే ప్రయత్నమే అది కాబోలని…మనం అనుకోవచ్చు! అయితే ఈ అభిప్రాయం జనంలో అసమగ్రంగా, అమాయకంగా, అజ్ఞానంగా ఇంకిపోవడం వల్ల, రూపాంతరం చెందడం వల్ల అది చాదస్తంగానూ, మతమౌఢ్యంగానూ మిగిలిపోయింది.

Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

మనవజన్మ ఉత్కృష్టమైంది. నిజమే! జీవ పరిణామ క్రమంలో ‘జీవి’ మారుతూ మారుతూ ఒక ఉచ్ఛస్థితికి చేరుకుంది – అదే మానవుడు! అందువల్ల మానవుడే జీవరాసులన్నింటిలోకి తెలివైనవాడు. అలాగే ప్రకృతిలో అత్యంత విలువైన ప్రాణి మానవుడే! ఎందుకంటే మనిషి తన చుట్టూ ఉన్నప్రకృతిని అర్థం చేసుకున్నాడు. ప్రకృతిలోని వృక్షజంతుసముదాయాన్ని అర్థం చేసుకున్నాడు. కొన్నిటిని పెంచుకున్నాడు. కొన్నిటిని మచ్చిక చేసుకున్నాడు. తన జీవితం సుఖమయం కావడానికి కావల్సిన అన్ని వస్తువుల్ని వాటి నుంచి సంగ్రహించాడు. అలాగే తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఈ భూమండలం మీద మరో జీవి ఇలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.

‘నేనంటే ఎవరు?’ అనే ప్రశ్న మనిషి మెదడులో అనాదిగా ఉంటూనే ఉంది. ప్రగతి పథంలో ముందుకు వస్తున్న కొద్దీ ఆ ప్రశ్నకు నిర్వచనం మారుతూ ఉంది. ఒకప్పటి అనాగరికుల ఆటవికుల నిర్వచనానికీ, నాగరికులు నిర్వచనానికీ తేడా ఉంది. కళ్ళూ, ముక్కూ మూసుకుని ఆత్మల లోకంలో విహరించే రుషుచ్చిన నిర్వచనానికీ, ఆధునికుడిచ్చే నిర్వచనానికీ తేడా ఉంది. ఈ 21వ శతాబ్దపు అత్యాధునికుడికి అవేవీ సంతృప్తినివ్వవు. అసమంజసంగా, అసమగ్రంగా కూడా అనిపిస్తాయి. అయితే ఇక్కడ కొంత మంది అత్యాధునికులు అతిపురాతన నిర్వచనాల్ని నెత్తిన పెట్టుకుని మోస్తుంటారు.  ఈ కాలానికి అనుగుణంగా ఈ కాలపు పరిజ్ఞానంతో ఇప్పటి వైజ్ఞానికులిచ్చే నిర్వచనాన్ని వాళ్ళు పట్టించుకోరు. అన్ని ఆధునిక వసతులు ఉపయోగించుకుంటూ, ఎప్పుడో వేల ఏళ్ళనాటి మనిషి ఏర్పరుచుకున్న అభిప్రాయాల్ని, నిర్వచనాల్ని- సంస్కృతి, సంప్రదాయాల పేరుతో నిలబెట్టాలని చూస్తుంటారు. అత్యధిక సంఖ్యలో ఉన్నఅలాంటి ‘వెనకచూపు’ మనుషులకు ‘ముందుచూపు’ నేర్పించే ప్రయత్నమే ఈ ‘నేనంటే ఎవరు?’ అనే పుస్తకం! వాస్తవాల్ని జీర్ణించుకోలేని వారు ఈ పుస్తకం చదవకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ‘నేనంటే ఎవరు?’ అనే పుస్తకం ఈ విశాల విశ్వంలో మనిషి అనేవాడు ఎవరో అర్థం చేయించే ప్రయత్నం చేస్తుంది. ఏమో…భవిష్యత్తులో ఈ సమాచారం పాతదైపోవచ్చు – అందుకు కూడా మనం సిద్దపడే ఉండాల్సి ఉంటుంది!

Also read: చదవడం కాదు, సి.వి. రచనలు జీర్ణించుకోవాలి!

మనలో దాగి ఉన్న ‘నేను’ అనే భావం – అంటే ‘అహం’ – ఏమిటీ? అది ఎలా ఉంటుంది? అది మనలో దాగి ఉన్న మరొకరా? లేక మనమేనా? ఈ విషయం మనిషిని చాలా కాలంగా కలవర పెడుతోంది. మనిషి నిరంతరం దానికోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు మనిషి తనను తాను ఎంతవరకు అన్వేషించుకున్నాడు? సమాధానాలు ఎంత వరకు సంపాదించుకోగలిగాడు? ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాల్సిన అంశం. జీవశాస్త్రపరంగా ఈ ‘నేను’ అనే దానికి సమాధానం వెతుక్కోవాలి.  కొత్త నిర్వచనానికి రూపకల్పన చేయాలి. అలాగే ఇన్ని దేశాలలో, ఇన్ని జాతులలో, ఇన్ని వర్ణాలతో ఉన్న మానవ సమాజం లోంచి ఈ ‘నేను’  ఎలా ఉద్భవించాడు? అలాగే నేను తినేదాన్ని బట్టి నా జీవన ప్రక్రియలుంటాయి. ఆ జీవన ప్రక్రియల్ని బట్టి నా ప్రవర్తన, మనస్తత్వం, రూపొందుతుంది. వాటికి అనుగుణంగానే, ఈ సమాజంలో ఈ ‘నేను’ కు ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన కోణాల నుండి ‘నేను’ ను విశ్లేషించే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. సరదాగా కుటుంబంలో జరిగే సంభాషణల ద్వారా విషయం సిరియస్ గా చర్చించడం ఉంది. ‘ఆత్మ పరమాత్మలో కలవాలి’- అని ఆధ్యాత్మిక గురువులు చెప్పే శుష్క ప్రవచనాల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి, మనిషికి, అతని ఆత్మవిశ్వాసానికి, అంతర్ చైతన్యానికి ఇక ప్రాధాన్యమివ్వక తప్పదని  ఈ రచన స్పష్టం చేస్తుంది.

ఏకకణ జీవి నుండి మానవుడి దాకా ఉన్న సుదీర్ఘ జీవ పరిణామ క్రమంలో ఎన్నో సంక్లిష్టతల్ని సంతరించుకుంటూ, నిరంతరం సంఘర్షిస్తూ, తన అస్థిత్వాన్నికాపాడుకుంటూ, మనిషి – అంటే ఈ నేను  అనేవాడు ఉద్భవించాడు. వీడు అటు ఊహించుకున్న దేవుడు కానక్కర లేదు. ఇటు కల్పించుకున్న దయ్యమూ కానక్కరలేదు. మనిషి మనిషిగా హుందాగా ఈ సృష్టిలో తను అత్యంత విలువైన ప్రాణినని, విలువల్ని నిలబెట్టగలిగే ప్రాణినని.. తనను తాను నెలబెట్టుకోగల సర్వసామర్థ్యాలు గలవాడినని..అచంచలమైన ఆత్మవిశ్వాసంతో మనుగడ సాగించాల్సి ఉంది. ఇంకా చంకల కింద విశ్వాసాల కర్రలు దోపుకొని, అవిటివాడివలె బతకాల్సిన పనిలేదు. సుఖాన్ని సుఖంగానూ, దుఃఖాన్ని దుఃఖంగానూ, మరణాన్ని మరణంగానూ స్వీకరించగలిగే- చేవగల సర్వస్వతంత్రుడు కావాలి. తన జీవితాన్ని తాను నియంత్రించుకోగల మేధావి, దార్శనికుడు, క్రాంతికారుడు మనిషి! తనను తాను తెలుసుకోవడమంటే ఆధ్యాత్మికపరంగా పలాయనం చిత్తగించడం కాదు జీవశాస్త్రపరంగా, సామాజికపరంగా, ఆర్థికపరంగా, ఆహారపరంగా, విహారపరంగా, పర్యావరణపరంగా వాస్తవాల్ని వాస్తవాలుగా తెలుసుకోవడం మాత్రమే! ఆ ప్రయత్నంలో కొందరు అడుగులు ముందుకు వేశారు. ఇక మనందరం వారిని అనుసరించాల్సి ఉంది.

Also read: బుద్ధుడు, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు కాదు!

సెప్టెంబర్ 2018లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజవాడవారు ప్రచురించిన ‘‘నేను’’ అంటూ ఎవరు?- ఒక వైజ్ఞానిక వివరణ’- అనే పుస్తకానికి సంబంధించిన పరిచయం ఇది.

30 డిసెంబర్ 2021 గురువారం ఉదయం ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీవారి బాలసాహిత్య పురస్కారం ప్రకటింపబడిందని టి.వి. వార్తల్లో తెలుసుకున్న నా మిత్రులు, తోటి రాచయితలు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు, సామాన్యులు ఎంత సంతోషించారో వారి మాటల్లో పొంగిపొర్లిన ఉల్లాసం తెలియజెప్పింది. వారందరికీ సోషల్ మీడియా ద్వారా నా దన్యవాదాలు తెలియజేశాను. పత్రికా ముఖంగా నన్నభినందించిన ఆంధ్రప్రదేశ్, హర్యానా గవర్నర్ లకు, రెండుతెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు, తెలంగాణ ఐ.టి. శాఖ మంత్రికి పత్రికాముఖంగానే నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాహిత్య అకాడెమీ కమిటీ సభ్యులు కొన్ని పరిమితులకు లోబడి అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని దాన్ని హుందాగా స్వీకరించాలని..కొందరు పెద్దలు, సన్నిహిత సాహితీ ప్రముఖులు సూచన చేశారు. అయినా, వ్యవస్థల్ని, ప్రభుత్వాల్ని నిష్కర్షగా దుయ్యబడుతూ అన్ని ప్రక్రియల్లో నేను చేస్తూ వస్తున్నకృషి ఎంతోఉంది గనుకనే, ఇక ఏదో రకంగా అకాడెమీ నన్ను గుర్తించక తప్పలేదనీ… కొందరు విశ్లేషణ చేశారు. అయినా ప్రవాహానికి ఎదురీదుతూ, సంఘర్షిస్తూ సాధించిన విజయమని, దీన్ని తక్కువగా తీసుకోగూడదని, ఏదైతేనేం జాతీయ స్థాయి గుర్తింపు కదా అని కొందరు ప్రోత్సహించారు. ‘‘బాలసాహిత్యంలో ఇమడని పుస్తకాన్ని ఆ కేటగరీలో ఎందుకు చేర్చరో నాకు తెలియదని’’ నేను చెప్పిన విషయం – ప్రముఖ దినపత్రికలు ప్రముఖంగానే ప్రచురించాయి.

ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన టెలిజన్ ఛానళ్ళ ముందు నేనొక ముఖ్యమైన విషయం ప్రస్తావించాను. సాహిత్య అకాడెమీ – సాహితీ ప్రక్రియలకు అవార్డులిస్తోంది. అనువాదాలకిస్తోంది. యువపురస్కారమిస్తుంది. కానీ, స్వాతంత్ర్యం లభించిన ఇన్నేళ్ళ తర్వాత కూడా వైజ్ఞానిక విషయాల మీద వచ్చే పుస్తకాలకు(వైజ్ఞానికి సారస్వతానికి)ప్రత్యేకంగా ఓ అవార్డు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదో…ఆలోచించుకోవాలని చెప్పాను. అకాడెలన్నీ ప్రారంభించింది భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. దేశంలో దాదాపు అన్ని వైజ్ఞానిక పరిశోధనాశాలల్ని ప్రారంభించింది ఆయనే. ఈ దేశ ప్రజలు అంధవిశ్వాసాల్లోంచి బయటపడి వైజ్ఞానికంగా ముందడుగు వేయాలని కలలుగన్నవాడాయన! ప్రధానిగా ఉన్నకాలంలో ఆ దిశలో నిర్విరామంగా కృషి చేసినవారు. మరి ఆయన స్ఫూర్తిని సాహిత్య అకాడెమీ నిలుపుకోవాలి కదా? ఇప్పటి వరకు ఆలోచన రాకపోతే, ఇక ఇప్పుడైనా రావాలి. సృజనాత్మక రచనలు గొప్పవే. కానీ సమాజానికి నేరుగా ఉపయోగపడే వైజ్ఞానిక స్పృహను పెంచేరచనలు ఇంకా గొప్పవి!  ఈఅవార్డు వల్ల నాకు అదనంగా వచ్చే కీర్తిప్రతిష్ఠలు లేకపోయినా, ఒక సరళ వైజ్ఞానిక రచనను గుర్తించినందుకు అకాడెమీని అభినందిస్తున్నానని, చానల్ వాళ్ళకు చెప్పాను. అవార్డుల ద్వారా వచ్చే గుర్తింపు కంటే ఏ రచయితకైనా ప్రజల నుండి వచ్చే గుర్తింపే చాలా గొప్పది. ప్రజామోదం ముందు ఎంతపెద్ద సంస్థ ఇచ్చే అవార్డయినా చన్నబోయేదని నా భావన!

Also read: దిల్ కి బాత్

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles