రఘురామకృష్ణంరాజు ఉదంతం వల్ల ఎవరికి మేలు జరిగింది. సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించిన నిర్ణయం వల్ల ఎవరి ప్రతిష్ఠ పెరిగింది? ఎవరిది మసకబారింది? ఇటు ప్రభుత్వానికీ, అటు రఘురామకృష్ణంరాజుకూ పరువు నష్టం జరిగింది కానీ వొరిగింది ఏమీ లేదు. రఘురామకృష్ణంరాజు జాతీయ స్థాయిలో ఒక నేలబారు రాజకీయాలు చేస్తున్న పార్లమెంటు సభ్యుడుగా అర్థం అవుతారు. పార్టీ టిక్కెట్టు ఇచ్చి, ఎన్నికలలో గెలిపించిన నాయకుడినే అస్థిరపరచే ప్రయత్నం చేస్తున్న రాజకీయవాదిగా కనిపిస్తారు. తిన్న ఇంటి వాసాలను లెక్కించేవ్యక్తిగా కనిపిస్తారు. ఆయన చర్యల వెనుకా, మాటల వెనుకా మతలబు ఎవరికీ పట్టదు. మాట్లాడిన తీరునే గమనించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు.
Also read: రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?
తనను విమర్శించేవారిపైన సీఐడీని ప్రయోగించి, బెయిల్ కు అవకాశం లేని రాజద్రోహం నేరం మోపడానికి వెనుకాడని రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్థం అవుతారు. ఇద్దరికీ జరిగింది అనర్థమే. ఇదే పరిస్థితిలో రాజశేఖరరెడ్డి ఉంటే ఏమి చేసేవారు అంటూ ఒక చర్చ వైఎస్ అభిమానులలో నడుస్తోంది. రఘురామకృష్ణంరాజును ఇంతదూరం వెళ్ళనిచ్చేవారు కాదు. పిలిపించుకొని మాట్లాడేవారు. పిలిచి మాట్లాడిన తర్వాత కూడా దూకుడుగా మాట్లాడినా ఆయనకు ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదు. చూసీచూడనట్టు వదిలివేసేవారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏమి చేసి ఉండేవారు?క్షత్రియ కులం నుంచి మెరికలాంటి నాయకుడిని పిలిపించుకొని నరసాపురం ఎంపీపైన దాడి చేయించేవారు. రఘురామకృష్ణంరాజు నోరు తెరిచినప్పుడల్లా ఆయన అన్నదానికి విరుగుడుగా, మరింత ఘాటుగా మాట్లాడమని చెప్పి ఉండేవారు – వైఎస్ మీదికి మాధవరెడ్డినీ, మైసూరారెడ్డినీ, జనార్దనరెడ్డినీ ఎగదోసినట్టు. వారి విమర్శలకు వైఎస్ స్పందించేవారు కాదు. జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబునాయుడు పద్ధితి అనుసరించి రఘురామకృష్ణంరాజుపైకి ఒక క్షత్రియ కులానికి చెందిన రాజకీయ నాయకుడిని వదిలి ఉంటే వారిద్దరూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండేవారు. తగాదా రఘురామకృష్ణంరాజుకూ, ముఖ్యమంత్రికీ మధ్య జరుగుతున్నట్టు ఉండేది కాదు. రఘురామకృష్ణం రాజుకు ఒక వర్గం మీడియా ప్రచారం ఇస్తే మరోవర్గం మీడియా మరో రాజుకు ప్రచారం ఇచ్చేది. ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ వ్యవహారాలలో వినియోగించవలసిన అవసరమే ఉండేది కాదు.
Also read: ప్రశాంత్ కిశోర్ ప్రజాస్వామ్య ప్రమాణాలు ఉద్ధరించారా?
రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి సహనాన్ని పరీక్షించారు. సహనం కోల్పోయి తనను పార్టీ నుంచి బహిష్కరించాలని రాజు కోరిక. అందుకే అంత దూరం వెళ్ళారు. కులాన్నీ, మతాన్నీ వినియోగించారు. అసలు గొడవ విజయసాయిరెడ్డితో దిల్లీలో సరిపడకపోవడం వల్ల మొదలయింది. ఇంత గొడవ జరుగుతున్నా విజయసాయి రెడ్డి మాట్లాడటం లేదు. ఆయన సోషల్ మీడియా దృష్టి చంద్రబాబునాయుడి మీదా, లోకేష్ మీదనే కేంద్రీకరించి ఉంటుంది.
Also read: రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు
ముఖ్యమంత్రి ప్రాబల్యం తగ్గలేదనడానికి వరుసగా ఎన్నికలలో సాధించిన ఘనవిజయాలే నిదర్శనం. ఎన్నికలకూ, ఎన్నికలకూ మధ్యన అధికారంలో ఉన్నవారు పరిపాలన సాగించాలి. దానిపైన తిరిగి ఎన్నికల జరిగినప్పుడు ప్రజల తీర్పు ఉంటుంది. ఎన్నికలు జరిగిన అనంతరం రాజకీయ అంశాలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చి పరిపాలన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
Also read: ఈటలపై వేటు ఇప్పుడే ఎందుకు పడింది?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కావలసింది ఒక సమర్థుడైన ఆరోగ్యమంత్రి, విషయం తెలిసిన న్యాయమంత్రి. ఆరోగ్యమంత్రి ఉన్నారు, కష్టపడుతున్నారు కానీ ఆయన మాట ఎంతమంది ఉన్నతాధికారులు వింటున్నారన్నది సందేహం. కరోనా చెలరేగిపోతుంటే, ప్రజలు పిట్టల్లాగా రాలిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా, సంయమనంతో పని చేయాలి. న్యాయమంత్రి లేనేలేరు. న్యాయవాదుల సలహాలు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తున్నాయో కనిపిస్తూనే ఉంది. ఏ మంత్రికైనా అధికారులు విలువ ఇవ్వాలంటే ప్రభుత్వంలో వారికి విలువ ఉన్నట్టు నమ్మకం కలగాలి. అన్ని విషయాలమీదా ఒకే ఒక సలహాదారు మీడియా సమావేశాలలో మాట్లాడుతూ ఉంటే ఇక మంత్రులకు ఏమి విలువ ఉంటుంది? ఏ మంత్రి ఏ విధంగా మాట్లాడాలో ముఖ్యమంత్రి సలహాదారులు సలహా ఇవ్వవచ్చు. తాము చెప్పినట్టు కాకుండా భిన్నంగా మాట్లాడితే మంత్రులను సలహాదారులు ప్రశ్నించవచ్చు. కానీ ఏ మంత్రికి సంబంధించిన అంశంపైన ఆ మంత్రే మాట్టాడితేనే పద్ధతిగా ఉంటుంది. మంత్రులు ఎంఎల్ ఏలుగా ప్రజలు ఎన్నుకున్నవారు. కేబినెట్ సభ్యులుగా జవాబుదారీ కలిగినవారు. న్యాయమంత్రి లేకపోవడం, న్యాయవ్యవహారాలలో సలహాలు ఇచ్చేవారు అంత సమర్థులుగా కనిపించకపోవడం, ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ, అధికార పార్టీకీ, ప్రజలకీ ఏది ప్రయోజనకరమో, ఏది ప్రతిష్ఠాత్మకమో, ఏది క్షేమదాయకమో ఆలోచించి అదే విషయాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పగలిగేవారు లేకపోవడం, ఆ విధంగా చెప్పే స్వేచ్ఛ సలహాదారులకు లేకపోవడం ఎవరికి నష్టమో చెప్పనక్కరలేదు. ‘సబ్ కా సునో, అప్నాకరో’ అనే నానుడి రాజకీయాలలో ఉంది. అందరు చెప్పేదీ వినండి, మీకు ఏది మంచిదని తోచితే అదే చేయండి అని అర్థం. అన్నీ అందరికీ ముందే తెలియవు. అనుభవం నేర్పుతుంది. అనుభవం నుంచి నేర్చుకుంటే నేర్చుకున్నవారికే మంచిది.
Also read: ప్రజాస్వామ్యవాదులకు ఆశాభంగం కలిగించిన జస్టిస్ బాబ్డే