- సాగర్ బరిలో ప్రధాన పార్టీలు
- గెలుపుకోసం వ్యూహ ప్రతివ్యూహాలు
నాగార్జున సాగర్ ఉపఎన్నిక ద్వారా తెలంగాణలో భవిష్యత్ రాజకీయాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పైచేయి సాధించడానికి కీలకమైనవిగా పరిగణిస్తున్నాయి. మూడు పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలో లేదనే చెప్పాలి. ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కేవలం రెండు డివిజన్లు గెలిచి ఏదో ఉన్నామనిపించింది. తెలంగాణలో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత తన పట్టును పూర్తిగా కోల్పోయింది. అంతే కాకుండా పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఇది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ముగిసేవరకు టీపీసీసీ అధ్యక్షుడి నియామకం ఆపాలని జానారెడ్డి పార్టీ అధిష్ఠానాన్ని అభ్యర్థించారు. గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన జానారెడ్డి తొలిసారి గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. సాగర్ లో ఓటర్లు జానారెడ్డి కుటుంబ సభ్యులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో జానారెడ్డి విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: రాష్ట్ర కాంగ్రెస్ లో మూడు ముక్కలాట
రేసులో దూసుకొస్తున్న బీజేపీ:
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి బీజేపీ శ్రేణుల్లో ఎన్నడూ లేని ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయాలతో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో అమితమైన శక్తిమంతంగా తయారయ్యాయి. త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో బీజేపీకి పెద్దగా పట్టులేకపోయినా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ లో ఆ పార్టీ అభ్యర్థి నివేదిత 4 వస్థానంలో నిలిచారు. కానీ ప్రస్తుతం బీజేపీ సాగర్ బరిలో ఎవరిని దించాలనే దానిపై రెండు ఆలోచనలను చేస్తోంది. సాగర్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న యాదవ వర్గానికి చెందిన అభ్యర్థిని బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దించేందుకు యోచిస్తోంది. గుర్రంపోడులో గిరిజన భూముల అంశాన్ని లేవనెత్తుతూ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది.
రెండోది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ లో చేర్చుకుని సాగర్ ఉపఎన్నిక బరిలో దించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు తెలంగాణ బీజేపీ పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంచి పట్టుఉండటమే కాకుండా సాగర్ నియోజవర్గంలో ఆయనకు మంచి సంబంధాలున్నట్లు సమాచారం. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయితే ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల తిరుమలలో పార్టీ మారుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని నాగార్జున సాగర్లో పోటీ చేయించాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. ఉపఎన్నికలో ఆయన విజయం సాధిస్తే ఏదోఒక చోట ఎమ్మెల్యేగా ఉండాలి కాబట్టి ఆయన మునుగోడుకు రాజీనామా చేస్తారని అపుడు తెలంగాణలోమరో ఉపఎన్నిక వస్తుందని ఆరకంగా తెలంగాణలో ఎన్నికల వేడి తగ్గకుండా చూడాలనేది బీజేపీ వ్యూహంగా విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Also Read: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల ధ్వజం
పట్టు కోల్పోతున్న టీఆర్ఎస్:
సీఎం కేసీఆర్ ఇటీవల హాలియాలో జరిగిన సమావేశం తీరు తెన్నులను పరిశీలిస్తే టీఆర్ఎస్ ప్రభ తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంద్వారా కేసీఆర్ సాగర్ ఉపఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ప్రజల నుంచి ఆశించినంత స్పందన మాత్రం రాలేదని తెలుస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతు సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం కారణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత సాగర్ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోందని పలువురు ఎన్నికల వ్యూహకర్తులు విశ్లేషిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రధానంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థికోసం వేట ప్రారంభించింది. రేసులో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుండి టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓటమి పాలైన కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి ముందున్నారు. ఈయన సినీ నటుడు అల్లు అర్జున్ కు దగ్గర బంధువు అవుతారు. అయితే అభ్యర్థి ఎవరైనా సాగర్ ఉపఎన్నికలో విజయం సాధించడం మాత్రం టీఆర్ఎస్ కు కత్తిమీద సాముగా మారింది.
Also Read: ఎన్నికల్లో కుస్తీ..ఆనక దోస్తీ
ప్రస్తుతం సాగర్ లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బీజేపీ గొప్పతనమో లేక ప్రధాని మోదీ హవా అనో అర్థం చేసుకోవాల్సిన పనిలేదు. సాగర్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జానా కుటుంబం పట్ల ఓటర్లలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి వెరసి బీజేపీకి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.