(సకలం ప్రత్యేక ప్రతినిధి)
దుబ్బాక శాసన సభా నియోజకవర్గానికి నవంబరు 3న జరిగిన పోలింగ్ లో భారీగా 82.61 శాతం పోలింగ్ జరిగింది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో పోలింగ్ జరగటం , కొంతమంది కోవిడ్ వ్యాధిగ్రస్తులు పీపీఈ కిట్లు ధరించి ఓటింగ్ లో పాల్గొనడం విశేషం. పోలింగ్ రోజు ఉదయం నుంచే పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల ప్రచారపర్వం వేడివాడిగా సాగినా, పోలింగ్ మాత్రం ప్రశాంతంగా సాగటంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఎన్నికలలో చివరి ఘట్టం ఓట్ల లెక్కింపు ఈనెల 10వ తేదీన జరగనుంది.
ఎవరి అంచనాలు వారివే
పోలింగ్ పూర్తయిన నాటినుంచీ ప్రధాన పార్టీలన్నీ గెలుపు తమదంటే తమదని గొప్పలు చెప్పుకుంటున్నా విజయం మాత్రం వరించేది ఒక్కరినే అనేది వాస్తవం. అయితే, ఆ ఒక్కరూ ఎవరన్నదానిపై వివిధపార్టీల సానుభూతిపరులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో కొన్నిసంస్థలు, కొంతమంది వ్యక్తులు సర్వేలపేరుతో విభిన్న ప్రచారాలు సాగిస్తున్నారు. మొత్తం 23 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ, టి.ఆర్.ఎస్., బి.జె.పి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది.
టి.ఆర్.ఎస్ పార్టీనుంచి దివంగత శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, బి.జె.పి అభ్యర్థిగా రఘునందనరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాస రెడ్డి రంగంలో ఉన్నారు.
సర్వేల విభిన్న ఫలితాలు
ఒక సర్వే సంస్థ అంచనాలప్రకారం, టి.ఆర్.ఎస్ పార్టీ ఘన విజయం సాధించనున్నట్టు పేర్కొంది. ఈ సంస్థ అంచనాల ప్రకారం , టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థికి మొత్తం పోలైన ఓట్లలో 51-54 శాతం ఓట్లు, బి.జె.పి అభ్యర్థికి 33-36 శాతం ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 8-11 శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొంది. కాగా, మరో సంస్థ అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో బి.జె.పి అభ్యర్థి విజయం సాధించనున్నారని పేర్కొంది. ఈ సంస్థ కథనం ప్రకారం, బి.జె.పికి 47 శాతం, టి.ఆర్.ఎస్ కి 38 శాతం, కాంగ్రెస్ కు 13 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు పోలుకానున్నట్టు పేర్కొంటోంది. ఈ సంస్థ లెక్కలప్రకారం దుబ్బాక, చేగుంట, మిరిదొడ్డి, తోగుట, నర్సింగ్ మండలాలలో బి.జె.పి ఆధిక్యం సాధించనుంది.
టీఆర్ఎస్ నాయకుల విశ్వాసం
కాగా, ఎట్టి పరిస్థితులలో తమ పార్టీ అభ్యర్థి సుజాత విజయం ఖాయమని, ముఖ్యమంత్రి కె.సి ఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు అఖం విజయం చేకూరుస్తాయని టి.ఆర్.ఎస్ నాయకులు ఢంకా మోగించి చెపుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికలను ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనీ, ఆయన అంతా తానై ప్రచారం చేశారనీ, హరీష్ ప్రచారం చేసిన ఏ నియోజకవర్గంలోనూ పార్టీ ఓడిపోయిన దాఖలా ఇంతవరకూ లేదనీ, టీఆర్ఎస్ గెలుపు వందకు వంద శాతం ఖాయమని టీఆర్ఎస్ నాయకులు ఢంకా బజాయించి చెబుతున్నారు.
బీజేపీ నాయకుల వాదన
ఎక్కువ శాతం పోలింగ్ జరగడం వెనుక బీజేపీ నాయకులూ, కార్యకర్తలు చేసిన హడావిడి కారణం ఉండవచ్చు. బీజేపీ హంగామా చూసి టీఆర్ఎస్ నాయకులు మరింత పట్టుదలతో ప్రచారం చేసి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించారు. ఓటర్లు ఒప్పించి, పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి అవసరమైన యంత్రాంగం ఉన్నది టీఆర్ఎస్ కు మాత్రమే. అయితే, ప్రజలు ఆగ్రహంగా ఉన్నప్పుడు పట్టుదలగా ఓటు హక్కు వినియోగించుకుంటారనీ, టీఆర్ ఎస్ ప్రభుత్వం పట్ల జనంలో కోపం ఉన్నదనీ, వరదల వల్ల కలిగిన కష్టాలలో ఆదుకోకపోవడం, కరోనా సోకినవారిని పట్టించుకోకపోవడం వంటి అంశాలపైన ప్రజలలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నదనీ, దానికి తోడు బీజేపీ గట్టిగా ప్రచారం చేయడంతో సాధారణంగా పోలింగ్ కేంద్రాలకు రాని వ్యక్తులు కూడా ఈ సారి తరలి వచ్చారనీ, బీజేపీకి ఓట్లు వేశారనీ కొందరు వాదిస్తున్నారు. చివరికి విజయం ఎవరిని వరించేది నెల 10వ తేదీవరకూ వేచి చూడాల్సిందే.