కర్ణాటక పరిణామాలు చూసి తీవ్రంగా బాధపడకుండా ఉంటడం కష్టం. ఆ రాష్ట్రంలో అనేక స్కూళ్ళూ, కాలేజీలూ అసహ్యకరమైన దృశ్యాలు చూశాయి. ఒక ప్రభుత్వపుటుత్తర్వుతో వాటిని కొన్ని రోజులకోసం మూసివేశారు. వాటిలో కొన్ని విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. హైకోర్టు ఉత్తర్వు ప్రకారం తమ మతానికి చిహ్నమైన దుస్తులు ధరించకుండా రావాలన్న షరతును పాటించినవారిని మాత్రమే విద్యాసంస్థలలోకి అనుమతించారు. పూర్తిస్తాయి ధర్మాసనం ఖరారు ఉత్తర్వు ఇచ్చేవరకూ అది హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వు. హిజాబ్ వివాదాన్నీ, కర్ణాటకలో సంభవిస్తున్న పరిణామాలనూ, జరుగుతున్న సంఘటనల వెనుక కనిపించని కారణాలనూ ఈ రోజు పరిశీలించాలని అనుకుంటున్నాను.
Also read: దక్కన్ పీఠభూమి నుంచి దేశ ప్రజలకు రెండు పరస్పర విరుద్ధమైన సందేశాలు, సంకేతాలు
హిజాబ్ లేదా బుర్ఖా ధరించడం అభిలషణీయమా, కాదా అనే మౌలికమైన, విస్తృతమైన అంశాన్ని ఈ రోజు చర్చించబోవడం లేదు. ఇస్లామిక ఆచారంలో బుర్ఖా, హిజాబ్ ధరించడం అత్యవసరమైన భాగమా, కాదా? ముస్లిం మహిళలు ధరించే దుస్తులలో అవి తప్పనిసరి భాగాలా, కావా? మహిళలను ఇంటికే పరిమితం చేయాలన్న దురుద్దేశంతో పితృస్వామ్య వ్యవస్థ రూపొందించిన ప్రతీపాత్మక సంకేతాలా, కాదా? సమష్టి జీవనంలో పూర్తి భాగస్వాములు కాకుండా మహిళలను దూరం పెడుతుందా లేక సామాజిక జీవితంలో తక్కువస్థాయి పాత్ర పోషించే పరిస్థితులలోకి మహిళలను నెట్టివేస్తుందా? ఇటువంటి విస్తృతమైన అంశాలకూ, ఇప్పుడు జరుగుతున్న వివాదానికీ ఏ మాత్రం సంబంధం లేదు కనుక ఈ అంశాలను వదిలేద్దాం. మరి కొంత కాలం వరకూ ఇటువంటి సున్నితమైన అంశాలపైన మర్యాదపూర్వకమైన, అర్థవంతమైన చర్చ అసాధ్యమయ్యేంతగా వాతావరణాన్ని ప్రస్తుత వివాదం భ్రష్టుపట్టించింది.
Also read: స్వాతంత్ర్య సమరయోధులను కాజేయడం నయాభారత్ కు అనివార్యం
ఈ గోరంత వివాదం ఎలా పెరిగి కొండంత అయిందో సత్వరం సమీక్షిద్దాం.
ఉడుపిలో చిన్న ఘటనగా ప్రారంభమైన వివాదం త్వరలో శివమొగ్గ, మాండ్య, బగల్ కోట్, చిక్కమగళూరు వంటి ప్రాంతాలకు వ్యాపించింది. ఊరేగింపులు జరిగాయి. రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిని ఒకరు బెదిరించారనే వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు స్కూళ్ళనూ, కాలేజీలనూ మూసివేశారు. హింసాకాండ జరగకుండా నివారించేందుకు పలు పట్టణాలలో 144వ సెక్షన్ ను విధించారు. కొన్ని పట్టణాలలో పోలీసులు కవాతు జరిపారు. సోమవారంనాడు విద్యాసంస్థలను తిరిగి తెరిచినప్పుడు ఉద్రిక్తత, అసౌకర్యం స్పష్టంగా కనిపించాయి.
ఉడుపితో మొదలు
జనవరి ఒకటో తేదీన కొంతమంది ముస్లిం యువతులు హిజాబ్ పెట్టుకొని ఉడుపిలోని గవర్నమెంట్ ప్రీయూనివర్శిటీ కాలేజికి వస్తే అది ఆ విద్యాసంస్థ యూనిఫాం నిబంధనలను ఉల్లంఘిస్తున్నదనే కారణంగా వారిని అనుమతించలేదు. అదే వైఖరిని పక్కనే ఉన్న కుండాపూర్ ప్రభుత్వ ప్రీయూనివర్శిటీ కాలేజీ అనుసరించింది. హిజాబ్ ను నిషేధిస్తూ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించిన ఆదేశాలను చాలామంది ముస్లిం విద్యార్థనులు శిరసావహించారు. కానీ అరుగురు విద్యార్థినులు మాత్రం ప్రతిఘటించారు. ఆ బాలికలపైన చర్య తీసుకోవాలని కోరుతూ స్థానిక బీజేపీ ఎంఎల్ఏ కాలేజి యాజమాన్యానికి లేఖ రాశారు. వివాదం సద్దుమణగకుండా కొనసాగడంతో ఆరుగురు విద్యార్థులూ హైకోర్టుకు వెళ్ళి తమను హిజాబ్ ధరించి కాలేజీకి వెళ్ళేందుకు అనుమతించవలసిందిగా అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అంతవరకూ విషయం ఒక్క అంశానికే పరిమితమైంది. హిజబ్ ధరించి రావడం విద్యాసంస్థలో యూనిఫాం దస్తుల నిబంధనకు వ్యతిరేకమని కాళాశాల యాజమాన్యం నిర్ణయించడం సరైనదా, కాదా అన్నంతవరకే అప్పటివరకూ చర్చనీయాంశం.
Also read: భారత భవితవ్యాన్ని నిగ్గు తేల్చే యూపీ ఎన్నికలు
విషయం అక్కడే కొద్ది రోజులకు మించి ఆగలేదు. హిజాబ్ ధరించిన ముస్లిం బాలికల వైఖరికి నిరసనగా ప్రదర్శనలు జరిపేందుకు హిందూ విద్యార్థులను సమీకరించారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపట్ల నిరసనగా హిందూ బాలురూ, బాలికలూ కాషాయరంగు చిక్కాలు (మూతిగుడ్డలు) ధరించి ప్రదర్శన చేశారు. విద్యార్థులు ప్రదర్శనలలో పాల్గొటూ ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడం విడియోలలో కనిపించింది. కాషాయ చిక్కాలు పంపిణీ చేస్తూ బజరంగదళ్ కార్యకర్తలు వాహనాలలో తిరగడాన్ని చూపించే విడియోలు సోషల్ మీడియాలో విరివిగా చక్కర్లు కొట్టాయి. ముస్లిం బాలికలకు సంఘీభావం ప్రకటిస్తూ చిక్కమగళూరు వంటి పట్టణాలలో నీలిరంగు చిక్కాలు ధరించిన దళిత విద్యార్థులు ‘జైభీమ్’ అంటూ నినాదాలు చేయడం కనిపించింది. మాండ్యాలో హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చిన ఒక ముస్లిం బాలికను హిందూ బాలుర, యువకుల గుంపు వేధించింది. దానికి సమాధానంగా ఆ బాలిక అడ్డం తిరిగి ‘అల్లా హూ అక్బర్’ అంటూ గట్టిగా నినాదం చేసింది. ఆ దృశ్యం చూపించే విడియో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలపైన అత్యంత విస్తృతంగా ప్రచారమైంది (వైరల్ అయింది). శివమొగ్గలోని ప్రభుత్వ కళాశాలలో కాషాయ చిక్కాలు ధరించిన బాలురు కొందరు జెండా కర్రకు కట్టి కాషాయజెండాను ఎగుర వేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందన
కర్ణాటక హిజాబ్ వివాదానికి దేశవ్యాప్తంగానూ, విదేశాల నుంచీ స్పందన వచ్చింది. హైదరాబాద్, దిల్లీ, కోల్ కతా, అలహాబాద్, శ్రీనగర్, తదితర ప్రదేశాలలో కర్ణాటక విద్యాసంస్థలలో హిజాబ్ ను నిషేదించడం పట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్కూళ్ళలో విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్నినిషేధించడాన్ని ‘భయంకరమైన పరిణామం’గా నోబెల్ బహుమతి గ్రహీత మలాల అభివర్ణించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో హిజాబ్ ను నిషేధించడం మతస్వేచ్ఛను ఉల్లంఘించినట్టు అవుతుందనీ, మహిళపైనా, బాలికలపైనా ముద్రవేసి, వారిని ప్రధాన స్రవంతి నుంచి తప్పించినట్టు అవుతుందని ప్రపంచంలోని మతపరమైన స్వేచ్ఛలను పర్యవేక్షిస్తున్న అమెరికా అధికారిక సంస్థ ఒకటి వ్యాఖ్యానించింది.
Also read: రైతులు, ఆర్థికప్రవీణులూ, ప్రజాస్వామ్యం
హిజాబ్ వివాదంలో వివక్ష వెనుక విషయం ఏమిటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. హిజాబ్ ధరించిన బాలికలు తరగతి గదులలోనికి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు వివాదాస్పదమైంది. యూనిఫాం దుస్తులు ధరించాలన్న నిబంధనలు ఉన్న సైన్యం, పారామిలటరీ దళాలు, పోలీసు వ్యవస్థలలో మగవారు తలపాగా పెట్టుకోవడాన్ని నిషేధించలేదు. ఈ సర్వీసులన్నిటిలోనూ సిక్కులు తలపాగా ధరిస్తారు. ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో హెల్మట్ ధరించాలన్న నిబంధన నుంచి కూడా సిక్కు బాలురకు మినహాయింపు ఉన్నది. యూనిఫాం ధరించాలన్న నిబంధనలు గల ఏ స్కూలులోనూ, కాలేజీలోనూ సిక్కు విద్యార్థులు తలపాగా ధరించడంపైన నిషేధం లేదు. ఇదంతా తలపాగా ధరించాలన్న ఆచారం వారి మతంలో ఉండటాన్ని గౌరవించడం వల్లనే. యూనిఫాం దుస్తులు ధరించడం నుంచి ఒక మతానికి చెందిన విద్యార్థులకు తలపాగా ధరించే మినహాయింపు ఇస్తూ మరో మతానికి చెందిన విద్యార్థినులకు మినహాయింపు ఇవ్వకుండా హిజాబ్ ధరించడాన్ని నిషేధించడం సమంజసమా? లింగ, మత సమానత్వానికి సంబంధించిన అంశాలు ఈ విషయంలో చర్చనీయాంశాలు అవుతాయి. పాఠశాలల్లో హిజాబ్ ను నిషేధించడం సమంజసమేనని నిరూపించేందుకు ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పవలసి ఉంటుంది. లేకపోతే మతప్రాముఖ్యం కలిగిన పురుషుల తలపాగానూ, మహిళల హిజాబ్ నూ సమదృష్టితో చూడటం లేదనే అనుమానాలు మిగిలిపోతాయి. అంతే కాకుండా, ఒకే కరమైన బహిరంగ ప్రదేశాలలో సిక్కుల మతాచారాలను గౌరవిస్తున్నారనీ, ముస్లింల మతాచారాలను గౌరవించడం లేదనే అంశం సమాధానం లేకుండా మిగిలిపోతుంది. ముస్లిం మైనారటీలలో, ముఖ్యంగా ముస్లిం మహిళల మనస్సులను ఈ అంశాలు బాధిస్తూ ఉంటాయి.
Also read: నవభారతం: మతి పోకుండా ఉండటం ఎట్లా?
వివాద పరంపరకు సరికొత్త జోడింపు
మన సమాజంలో మైనారిటీ ముస్లింలను పరాయీకరణ వైపు నెట్టుతూ వారి మనస్సులో భయాందోళనలను నింపుతున్న పరిణామాల, ఘటనల పరంపరకు హిజాబ్ వివాదం తాజా జోడింపు మాత్రమే. ఈ ఘటనలు రెండు రకాలు. ఒకటి, ముస్లిం మైనారటీలపైన దాడులు చేయడం. రెండు, హిందూ సంఖ్యాధిక్య భావాన్ని చాటుకోవడం. ఆవుమాంసం తినడంపైన నిఘా పెట్టడం, పట్టుకొని కొట్టి చంపేయడం, మైనారిటీలకు చెందిన చిన్న దుకాణాలను చిందరవందర చేయడం, వారి చిన్న వ్యాపారాలపైన దాడులు చేయడం, గాజులు అమ్ముకునేవాళ్ళకీ, అటువంటి చిన్న వ్యాపారాలు చేసేవారికీ దేహశుద్ధి చేయడం, ధర్మసంసద్ వంటి సభలలో ముస్లింలను నిర్మూలించాలంటూ పిలుపు నివ్వడం, ముస్లిం మహిళలను వేలానికి పెట్టే సలీడీల్స్, బుల్లీబాయ్ యాప్స్ తయారు చేసి సమాజంపైకి వదలడం, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఎనభైశాతానికీ, ఇరవై శాతానికీ మధ్యన పోటీ అంటూ అభివర్ణించడం, రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు అబ్బాజాన్ వంటి వ్యాఖ్యలు చేయడం, లవ్ జిహాద్, థుక్ జిహాద్ అంటూ నిందించడం, ముస్లిం జనాభాను ఉద్దేశించి జనాభా నియంత్రణ శాసనాలను తీసుకురావడం (ఆ సామాజికవర్గం ఉత్పాదక రేటు బాగా పడిపోయినా సరే), మతహక్కును పరిరక్షించే చట్టమని పేరు పెట్టి మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు తేవడం…ఇటువంటి దాడుల జాబితా చాలా పొడుగే ఉంది. క్రైస్తవ సమాజంపైన జరిగిన దాడుల గురించి నేను చెప్పనేలేదు.
హిందూ సంఖ్యాధిక్య ఉద్ఘాటనల గురించి చూద్దాం. హిందూ మత చిహ్నాలను (విభూతీ, పంగనామాలూ వగైరా) ప్రధానీ, ఆయన పార్టీకి చెందిన ఇతర రాజ్యాంగపదవులలో ఉన్నవారూ తమ శరీరాలపైన బహిరంగంగా పెట్టుకుంటారు. దేవాలయ నిర్మాణాలకు శంకుస్థాపన, దేవాలయ సముదాయాల జీర్ణోద్ధరణ, మతసంబంధమైన వేడుకల ప్రారంభోత్సవం, హిందూ స్వాముల భారీ విగ్రహాల ఆవిష్కరణ వంటి సందర్భాలలో విపరీతమైన ప్రచారం చేసుకోవడం ఈ కోవకే చెందుతుంది. వీటికి తోడు, ఎర్రకోటపైన కాషాయ పతాకం ఎగరబోతోందంటూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేయడం కూడా ఈ ధోరణిలో భాగమే.
Also read: మోదీ నవభారతం, నెరవేరని ప్రజాభిమతం
సర్వసాధారణమైన మైనారిటీలపై దాడులు
ఈ రోజున మైనారిటీలపైన దాడులూ, హిందూ సంఖ్యాధిక్య ప్రదర్శన సర్వసాధారణ విషయాలుగా, ప్రధాన స్రవంతికి చెందిన అంశాలుగా పరిగణిస్తున్నారు. ఈ దాడులను కానీ, ప్రదర్శనలను కానీ ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. పైగా, అటువంటి చర్యలను అడ్డుకోవడాన్నీ, ప్రతిఘటించడాన్నీ ప్రశ్నిస్తున్నారు. అన్నిటికంటే ఆందోళన కలిగించే అంశం ఏమంటే పదమూడు, పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న బాలలను దాడులలోకీ, ప్రదర్శనలలోకీ, ప్రతిఘనలలోకి దింపడం. రెండు మతాలలోనూ తీవ్రవాదులు పండగ చేసుకుంటున్నారు. బాలలనను వారు కాల్బలగంగా (ఫుట్ సోల్జర్స్) వినియోగించుకుంటున్నారు. కొందరు హిందూత్వవాదులు మైక్రోబ్లాగింగ్ సైట్స్ లో పెట్టిన పోస్టులను నేను చూశాను. హిజాబ్ వివాదం వల్ల హిందూ సామాజికవర్గానికి లాభం చేకూరిందని వారు అంటున్నారు. ఈ వివాదం కారణంగా కర్ణాటకలో హిందువులు సంఘటితమైనారట. ఈ పరిణామాల పట్ల ముస్లింలలోని తీవ్రవాదులు కూడా సంతోషంతో గుటకలు వేస్తున్నారనే విషయంలోనూ నాకు సందేహం లేదు. ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన ముస్లిం యువతి ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుందంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు అగ్గిలో ఆజ్యం చందమే.
ఈ వివాదం రగులుతూనే ఉంటుంది
కోర్టుల నిర్ణయాలకోసం మనం వేచి చూద్దాం. మొదట హైకోర్టులు. ఆ తర్వాత బహుశా సుప్రీంకోర్టు. అడ్డగోలు రాజీ విధానాన్ని కోర్టులు ఒక పరిష్కారమార్గంగా తీర్పు చెబితే అది శోచనీయమైన, విచారకరమైన పరిణామం అవుతుంది. మతాన్ని సూచించే దుస్తులను ఎవ్వరూ ధరించకూడదు అనడం అటువంటిదే. హిజాబ్ ను ముస్లిం విద్యార్థినులు ధరించరు, కాషాయ చిక్కాలను హిందూ విద్యార్థులు ధరించరు అనడం సమంజసం కాజాలదు. విద్యార్థులు కాషాయ చిక్కాలు ధరించడం హిందూమతాచారం కాదు. కానీ ముస్లిం విద్యార్థినులకు హిజాబ్ ధరించడం ఇస్లాంమతాచారం. హిజాబ్ లూ, కాషాయ చిక్కాలూ ఉండబోవని అనడం సమన్యాయంగా కనిపిస్తుందేమో కానీ అది సమదృష్టి కాజాలదు. ఏది ఏమైనా, హిజాబ్ కీ, కాషాయ చిక్కానికీ మధ్య అసహ్యకరమైన పోటీకి కోర్టుల తీర్పులు స్వస్తి చెప్పజాలవు.
Also read: పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?
(మిడ్ వీక్ మ్యాటర్స్ –MwM-46 ఎపిసోడ్ కి స్వేచ్ఛానువాదం)