Saturday, December 21, 2024

ఈ ‘కాన్వాస్’ పై ఏడాది ఆందోళనకు చోటెక్కడ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు తర్వాత దాని ఫలితాలు మీద జాతీయ స్థాయిలో విశ్లేషణలు జరుగుతూ వున్నాయి. బయటి వారికి అవి వొకలా కనిపిస్తే, దగ్గరగా చూసే రెండు తెలుగు రాష్ట్రాల వారికి అవి మరొకలా కనిపిస్తున్నాయి. అయితే, దేని విలువ దానికుంది. అనుకోకుండా వీటిలో డిల్లీ జే. ఎన్. యూ. సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ నుంచి వచ్చిన సమీక్షలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిజానికి దాన్ని కొత్తది అనడం కంటే విస్మృత కోణం అనడం సరైనది. ఎన్నికల ఫలితాలతో నేరుగా అది సంబంధం వున్నది కానప్పటికీ, మాటల మధ్యలో… అన్నట్టుగా, ఎప్పుడో వొకసారి బయటకు రావాల్సిన వొక సత్యం యధాలాపంగా ఇలా వెలుగులోకి వచ్చినట్టయింది.  ఎన్నికల ఫలితాల సమీక్ష పక్కన పెట్టి, అది తెచ్చిన కొత్త కోణం, దాని టీకాటిప్పణి వెతకడానికి కూడా కారణం లేకపోలేదు.

‘అమరావతి పరిరక్షణ ఉద్యమం’ అస్సలు ఎవరిది?

ఆ వ్యాఖ్య ప్రతిఫలనాలు విడిపోయి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పైన ‘ఫోకస్’ కావడం మాత్రమే కాకుండా, ఏడాది కాలంగా అక్కడ జరుగుతున్న ‘అమరావతి పరిరక్షణ ఉద్యమం’ అస్సలు అది ఎవరిది? అనే ప్రాధమిక ప్రశ్నకు దారి తీసింది. అంతేకాక ఇప్పుడు జే.ఎన్.యూ. అదనంగా జత చేసిన పరిశీలనాంశం కారణంగా, తెరమీదికి ఇప్పుడు వచ్చిన మరొక కొత్త ‘అకడమిక్’ సందేహానికి కూడా అది సమాధానం చెప్పవలసి వచ్చింది. అదేమంటే, గుంటూరు జిల్లా మందడంలో 2020 డిసెంబర్ 17 నాటికి ఏడాది పూర్తి చేసుకుంటున్న అమరావతి పరిరక్షణ ఉద్యమం; ఏడేళ్ళ నాటి సమైక్యాంధ్ర ఆందోళనకు కొనసాగింపు (‘పార్ట్ – టూ’) అనుకోవచ్చా?

తెలంగాణ ఉద్యమంలో బహుజనుల పాత్ర

ఇప్పుడు ఇటువంటి సందేహాలు తలెత్తడానికి కారణమైన విషయంలోకి కూడా చూద్దాం. ‘The right political moves in Telangana’ శీర్షికతో 11.12.2020  నాటి ‘ది హిందూ’ దినపత్రిక వ్యాసంలో జే. ఎన్. యూ. అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గొడవర్తి తను చెప్పాలనుకున్న ‘పాయింట్’ కోసం వర్తమానం వదిలి చాలా వెనక్కి వెళ్లి, అక్కణ్ణించి తిరిగి వర్తమానం వద్దకు వచ్చారు. తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పదేళ్ళకే నైజాం ప్రాంతంలో విభజన కదలికలు మొదలై 1969 నాటికే అవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా ఉనికిలోకి రావడం, నాటి చరిత్ర సామాజిక నేపధ్యం గురించి ఆయన చెబుతూ (“ In fact, Daliths and the other backward Classes (OBC) were the backbone of the mobilization for a separate State through the various Joint Action Committees, popularly called JACs in the struggle for a separate State that was envisioned to be inclusive and democratic ”) “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, దళితులు ఇతర వెనుకబడిన కులాలు (ఓ.బి.సి.) తాము కూడా ప్రజాస్వామిక ప్రక్రియలో సమ్మిళిత భాగస్వామ్యులు అవుతామని భావించి, విభజన ఉద్యమానికి ఈ శ్రేణులు వెన్నెముకగా నిబడ్డాయి. అందుకోసం వారు వేర్వేరు ‘జాయింట్ యాక్షన్ కమిటీలు’ గా (‘జే.ఏ.సి.’) ఏర్పడ్డారు.” ఇక్కడ అజయ్ గొడవర్తి చెబుతున్నట్టుగా జనాభాలో అత్యధిక శాతమైన ఈ బహుజన సామాజిక శ్రేణులు తమ ఇళ్ళనుంచి బయటకు వచ్చినప్పుడే, ఏ ఉద్యమం అయినా వొక ప్రదర్శనగా కనిపిస్తుంది. పవర్ పాలిటిక్స్ గురించి మాట్లాడేవారు తరుచు ‘కేడర్’ అనేది వీరిగురించే!

ముందస్తు కసరత్తు లేదు

అయితే ఆసక్తికరమైన అంశం ఏమంటే, అప్పట్లో తెలంగాణ బహుజన సామాజిక శ్రేణుల లక్ష్యం అయిన ‘విభజన’కు వ్యతిరేకంగా విజయవాడ కేంద్రంగా ‘సమైక్యాంధ్ర ఆందోళన’ మొదలైంది. అప్పట్లో తెలంగాణలో ఏర్పడిన ‘జే.ఏ.సి’ ల తరహాలోనే ఆంధ్ర ప్రాంతంలోనూ ఏర్పడ్డాయి. అయితే, రెండు చోట్ల ఇవి ఆధిపత్యవర్గ నాయకత్వంలోనే ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో వొక జే.ఏ.సి. కన్వీనర్ శ్రీ ఎం. శామ్యూల్, మరొక జే.ఏ.సి. కన్వీనర్ అనంతపురం జిల్లా (సింగనమల (ఎస్సీ) నియోజకవర్గం) మంత్రి డా. ఎస్. శైలాజానాధ్ ఈ ఇరువురు దీనికి సారధ్యం వహించారు. అలా…ఆంధ్ర-తెలంగాణ రెండు చోట్ల వున్న బహుజన శ్రేణులు ఇన్నాళ్ళు ఒకే రాష్ట్రంలో కలిసి ఉన్నప్పటికీ, విభజన కారణంగా వీరి ప్రయోజనాలు కొత్తగా వైరుధ్యం అయ్యాయి! చివరికి భారత ప్రభుత్వం విభజనకు  అనుకూలంగా ఉంది అనే దశలో ఆంధ్ర ప్రాంతంలో ఈ సమైక్య ఆందోళన మొదలయింది. అంతేగాని తెలంగాణ తరహా ముందస్తు కసరత్తు గాని అందుకు వొక ప్రాతిపదిక గాని దీనికి లేదు.

చరిత్ర నిరంతర సంభాషణ

ఇదంతా ఎనిమిదేళ్ళ నాటి గతం. ఇకముందు ఇది, వొక విభజన ఉద్యమం విజయంగాను, మరొక సమైక్య ఆందోళన పరాజయంగాను భవిష్యత్తు చరిత్రలో నమోదు అవుతాయి. అయితే, మళ్ళీ ఐదేళ్లలోనే మందడం లో ఏడాది కాలంగా ఆందోళనకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఐదారు ఏళ్ల క్రితం నాటి ఉద్యమ అనుభవం దాని పర్యవసానం ఎందుకు కొరకాకుండా పోయిందా? అంటే, అది గతంతో కలిపి చూసినప్పుడు అవగతం అవుతుంది. ఎందుకంటే, చరిత్ర ఎప్పుడూ శకలాలుగా ఉండదు, అదొక నిరంతర సంభాషణ. ‘అమరావతి పరిరక్షణ ఉద్యమం’ పేరుతో ఇక్కడ జరుగుతున్న ఈ ఆందోళనలో మరొక ‘విభజన’ లేదు, అమరావతి ఆంధ్రప్రదేశ్ లోనే వుంటుంది. మరి సమస్య ఏమిటి? అందుకు సమాధానం కోసం, అక్కడే జరుగుతున్న మరొక ‘విభజన’ శిబిరం వైపు మనం చూడాలి. అది బహుజన ఉద్యమం. అది కూడా తెలంగాణ మాదిరిగా విభజన కోరుతున్న  ‘వికేంద్రీకరణ’ వాదం. వొకటి కాదు, అమరావతి, విశాఖపట్టణం, కర్నూలు మూడు రాజధానులు అంటున్న విభజన ప్రతిపాదనకు సమర్ధన వాదం.

వెల్లువ-ప్రతిఘటన

అయితే, ఇది 2014లో జరిగిన విభజన వల్ల వచ్చింది కాదు, ఇక్కడ 2019 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన ఉద్యమమిది. ఈ నేపధ్యం అంతా విహంగ వీక్షణంగా చూసినప్పుడు ఇక్కడ కనిపించేది రెండు అంశాలు. ఒకానొక కాలానికి వెల్లువెత్తే సహజమైన ప్రజాస్పందన, దాన్ని నిరోధించడానికి జరిగే ప్రతిఘటన. అయితే, ఎన్నికలు తర్వాత వెలువడే ఫలితాలు మాదిరిగానే, వెల్లువ-ప్రతిఘటన ఫలితాలు కూడా ఇప్పుడు జాప్యం లేకుండా వెనువెంటనే తెలుపు నలుపుల్లో తేటతెల్లం అవుతున్నాయి. మరి అది కాలంతో పాటు వెల్లువెత్తే పరిణామం అయినప్పుడు, 2015 నాటి ప్రభుత్వం  అమరావతి ప్రతిపాదన తర్వాత అప్పట్లోనే ఈ వికేంద్రీకరణ డిమాండ్ ఎందుకు రాలేదు అనేది కూడా చూడాలి.

స్పందించిన జనహృదయం

‘తెలంగాణా’ నమూనాలో ఇటువంటి సందేహాలు చాలావాటికి మనకు స్పష్టమైన సమాధానాలు దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ 1969-2014 మధ్య వెల్లువెత్తిన అన్ని రంగుల ఉద్యమాల్లో కూడా ‘విముక్తి’ అంతర్లీన అంశం! వెతికితే, మనకు అందులో సామాజిక ఆర్ధిక సాంస్కృతిక జీవనం… పలు విరామాలు మధ్య వాటికి స్పందించిన జన హృదయం కనిపిస్తుంది! అలా చూసినప్పుడు, తెలంగాణాతో పోలిక కాదుగానీ, విభజన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా 2014-2019 మధ్య జరిగింది కూడా తక్కువ ఏమీ కాదు. గోదావరి జిల్లాల్లో గరగపర్రు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట వివాదం (జూన్ 2017) గుంటూరు నాగార్జున యునివర్సిటీ సమీపాన కాజ టోల్ ప్లాజా వద్ద మాదిగ దండోరా సభ విచ్చిన్నం (జులై 2017) గుంటూరులో ముఖ్యమంత్రి మైనారిటీ సదస్సు వద్ద ప్లకార్డ్స్ చూపించిన ముస్లిం యువకుల అరెస్ట్ (ఆగస్టు 2018) ఈ ఉదంతాల్లో అంతర్లీనంగా వున్న అధికార కేంద్రీకరణ అందరికీ స్పష్టంగానే కనిపించింది. దాన్ని చదవగలిగిన వయోజన విద్యా స్థాయికి కూడా ఈ సామాజిక శ్రేణులు అప్పటికే చేరుకున్నాయి.

దళితబహుజన విముక్తి చైతన్యం

అయితే అనుకోకుండా మరొక మేధో మేఘం ఈ అంశం మీద వర్షించింది. అజయ్ గొడవర్తి వ్యాసం వచ్చిన మర్నాడు అదే పత్రికలో ‘హిందూ’ సీనియర్ ఎడిటర్ నారాయణ్ లక్ష్మణ్ – దక్షిణాదిన గత ఐదు దశాబ్దాలలో దళిత బహుజన (ఓ.బి.సి.) విముక్తి చైతన్యంలో ద్రావిడ ఉద్యమ చైతన్యం గురించి రాస్తూ, 2024 ఎన్నికలు నాటికి బి.జే.పి. జాతీయవాదం దక్షిణాదిని ఎలా ఎదుర్కోబోతున్నది తను కూడా చర్చించడం కేవలం యాదృచ్చికమే! ఇప్పుడు ముూలాలు నుంచి ‘వోవర్ హాల్’ జరుగుతున్న స్థల కాలాల్లో మనం వున్నాము కనుకనే, మూడేళ్ళ క్రితం మాదిగ ఉద్యమకారులపై నిర్బంధం జరిగిన కాజ టోల్ ప్లాజా వద్దనే 2020 లో వడ్డెర కార్పోరేషన్ చైర్మన్ శ్రీమతి రేవతి చేసిన ఆత్మ గౌరవ సవాల్ మనం చూడడం సాధ్యమయింది. ఈ క్యాన్వాస్ మీద ‘అమరావతి పరిరక్షణ ఉద్యమం’ ఎక్కడ నప్పుతుందో చెప్పాలి అంటే, దాని అంతిమ ఫలితం వచ్చేవరకు కనిపెట్టక తప్పదు.     

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles