గాంధీయే మార్గం-4
దేశంలో గత ఐదారేండ్లుగా మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకోవడం పెరిగింది. గాంధీయిజం గురించి డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా రెండు రకాలని వివరిస్తూ.. సర్కారీ గాంధీయిజం, మొనాస్టిక్ గాంధీయిజంగా పేర్కొంటారు. మొదటిది ఆయన రాజకీయ వారసుల వ్యవహారం కాగా, రెండవది ప్రభుత్వ ఖర్చుతో లాంఛనంగా నిర్వహించబడే కార్యక్రమాల తంతు. ఈ రెండూ మన సమాజపు పోకడలు కొద్దిగా పరిశీలించేవారికి కూడా బాగా తెలుసు కాబట్టి, వాటిగురించి ఇక్కడ చెప్పుకోవడం లేదు. ఈ రెండు ధోరణులకు భిన్నమైన పోకడలు ఈ ఐదారేండ్లలో ఎక్కువగా కనబడటం విశేషం. ఇది మన దేశవ్యవహారం కాగా, వీటన్నింటికీ అతీతంగా పర్యావరణం సంబంధించిన గాంధీజీ ఆలోచలూ, ప్రతిపాదనలూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. దీనిగురించి ఇంకోసారి మాట్లాడుకుందాం.
11 సెప్టెంబర్ 1906న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ పట్టణంలోని ఎంపైర్ థియేటర్‌లో వలస భారతీయ సంతతి సమస్యల సాధనలో భాగంగా గాంధీజీ తన సత్యాగ్రహ భావనను ప్రతిపాదించారు. ఈ సత్యాగ్రహ భావనకు 2006 నాటికి వందేండ్లయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. నిజానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చే విషయమై కనీసం ప్రచార ఆయుధంగా కూడా వీరికి స్ఫురించలేదు.
Also read: గాంధీజీ సార్వత్రికత ఏమిటి?
చంపారన్ స్ఫూర్తితో స్వచ్ఛభారత్
చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం స్ఫూర్తిగా 2014 అక్టోబరు 2న నరేంద్రమోదీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ దేశవ్యాప్తంగా ప్రారంభించింది. మహాత్ముని కళ్ళజోడు చిహ్నంగా పరిశుభ్రతా ఉద్యమం మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరం ముగిసేదాకా అది సాగింది. 04 ఫిబ్రవరి1916న వారణాసి హిందూ విశ్వవిద్యాలయంలో గాంధీజీ తన తొలి రాజకీయ ప్రసంగం చేశారు. అందులో చాలా విషయాలతో పాటు మనం రాజకీయ స్వాతంత్య్రం కంటే ముందు సాధించవలసిన వాటిలో పరిశుభ్రత, ప్రజారోగ్యం అని ఆయన నిర్ద్వందంగా ప్రకటించారు. 07ఆగస్టు 2015 నుంచి జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవడం మొదలైంది. 07 ఆగస్టు 1905న బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 2015 నుంచి జాతీయ చేనేత దినోత్సవం మోదీ మద్రాసు నుంచి ప్రారంభించారు. వీటికితోడు 1942 క్విట్ ఇండియా ఉద్యమం 75 ఏండ్ల ఉత్సవం కూడా జరిగిపోయింది.
ఒక రకంగా కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా వినియోగించుకోని గాంధీజీ సందర్భాలను మోదీ ప్రభుత్వం వాడుకున్నది. ఇదొక ధోరణి కాగా, ఐదారేండ్లుగా వామపక్షవర్గాలు కూడా గాంధీజీ పట్ల గతంలో కన్న కొంత సానుకూల ధోరణితో చూడటం ప్రారంభించాయి. దీంతో లోహియా పేర్కొన్న ధోరణిలోని వర్గాలు కాకుండా మరో రెండు పక్షాలకు గాంధీజీ చర్చనీయాంశమయ్యారు. దీనికి పరాకాష్టగా గాంధీ 150వ జయంతి సంవత్సరం ముగుస్తున్న వేళ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా కోణాల్లో చర్చలు జరిగాయి. ఇటు వామపక్షాలకూ, అటు బీజేపీ వర్గాలకు గాంధీజీ ఎందుకు ఆసక్తిగా మారాడనేది పెద్దగా చర్చించవలసిన పనిలేదు. సిఎం, కరోనా నేపథ్యంలో గాంధీజీ ఆలోచనా విస్తృతి చర్చకు వచ్చింది. అయితే, నేడు ఏ రకంగా గాంధీజీ ఈ దేశానికి అవసరమో తప్పక చర్చించాలి!
గాంధీజీని మతవాదిగా పరిగణించడం కద్దు. నిజానికి ఆయన దేవాలయాలకు వెళ్లినట్టు కానీ, మతాచారాలను పాటించమని చెప్పినట్టు కానీ ఆధారాలు లేవు. అయితే మతపరమైన ధర్మశాస్ర్తాలకు మూలమైన సత్యం, అహింస, శ్రమ, కర్తవ్యం వంటివాటిని మతాలకతీతంగా పాటించమని బోధించారు. మరోరకంగా చెప్పాలంటే మతాచారాలనూ, దేవాలయాల అసాంఘిక ధోరణులను గాంధీజీ ఖండించారు. వాటిని గమనిస్తే ఇంత రాడికల్‌గా గాంధీజీ ఆలోచన చేశాడా అనే సందేహం కూడా కొందరికి రావచ్చు.
Also read: రాగద్వేష రహితమైన, వివేకం గల విజ్ఞాన దృష్టి
కొన్ని దేవాలయలు రాక్షసనిలయాలు
”కొన్ని దేవాలయాలు దేవుడి నిలయాలు కాదు, రాక్షసనిలయాలు. నాకు కలిగిన అనుభవాన్ని బట్టి ఇలా చెప్పవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. ధర్మకర్త మంచివాడైతే దేవాలయాలు మంచివే” అని యంగ్ ఇండియా పత్రిక 1927 మే 9వ తేదీ సంచికలో రాసింది. ఈ తీవ్రమైన దృష్టి చివరిదాకా సాగిందనడానికి 1942 మార్చి 5వ తేదీ ‘యంగ్ ఇండియా’ పత్రికలో రాసిన విషయాలు సాక్ష్యం.
” క్రైస్తవ దేవాలయాలు, మసీదులు, దేవాలయాలు ఇవన్నీ మోసం, కపటం, వంచనకు నిలయాలయ్యాయి. దరిద్రులను వీటి చెంతకు రానీయరు. ఇవి భగవానుని ఆరాధనా స్థలాలు కావు, పరమాత్మకు ఎగతాళి పట్టించే స్థలాలు” చాలా సాత్వికమైన భాష మాట్లాడే గాంధీజీ కొన్ని సందర్భాల్లోనే ఇలా పరుషమైన మాటలు వాడుతారు. ఆయన చాలా జాగరూకతతోనే ఆ మాటలు మాట్లాడారని పరిగణించాలి.
అలాగే బోల్షివిజం, కమ్యూనిజం గురించి కూడా అంతే స్పష్టంగా పేర్కొంటారు. ‘యంగ్ ఇండియా’ పత్రిక 1924 ఏప్రిల్ 11 సంచికలో ఇలా రాశారు..
“బోల్షివిజం అంటే ఏమిటో నాకు ఇంకా సరిగా తెలియదు. కొంతకాలం పోయేసరికిగాని బోల్షివిజం రష్యాకు మంచిదో కాదో నేను చెప్పలేను. నాస్తికత్వం అది హింస మీద ఆధారపడి ఉన్నది కనుక నాకది సహించదు. జయం పొందడానికి హింసాత్మక మధ్యేమార్గాల్లో నాకు విశ్వాసం లేదు. నా బోల్షివిక్ స్నేహితుల పట్ల సానుభూతి ప్రకటిస్తాను. సదుద్దేశాలను నేను పూజిస్తాను. కానీ సదుద్దేశాలు సఫలమవటానికి కూడా హింసాత్మక పద్ధతులను అవలంబించడం నాకు గిట్టదు. కాబట్టి హింసావాదానికి నాకూ పొత్తు కుదరదు.”
కార్మికుల క్షేమమే నా క్షేమం అనుకున్నాను
1931 ఏప్రిల్ 26 సంచిక ‘యంగ్ ఇండియా’ పత్రిక లో ఇంకా ఇలా వివరిస్తారు..
“.. మీలో చాలామంది యువకులు పుట్టక పూర్వ మే నేను కార్మికుల క్షేమం కోసం పనిచేశాను. వారి క్షేమం నా క్షేమమే అనుకున్నాను. దక్షిణాఫ్రికాలో ఎక్కువ కాలాన్ని కార్మికుల కోసం గడిపాను. వారి తో కలిసి జీవించేవాడిని. వారి కష్టాల్లో భాగస్తుడినయ్యాను. కార్మికుని తరఫున మాట్లాడుతానని ఎందుకు అంటున్నానో మీరు గ్రహించాలి. ఇంకేది కాకపోయినా మీ నుంచి మర్యాదను ఆశిస్తున్నాను. మనసు విప్పి విషయాలన్నీ నాతో చర్చించమని ఆహ్వానిస్తున్నాను. మీరు కమ్యూనిస్టులమని చెబుతారు. కానీ మీరు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితయాత్ర సాగిస్తున్నట్టు కనిపించదు. నిజానికి నేను కమ్యూనిస్టు సిద్ధాంతాలను అనుసరించి జీవించాలని సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాను. కమ్యూనిజం మర్యాదను మినహాయిస్తుందనుకోను.”
అందువల్ల గాంధీజీని మతవాదిగానో; మార్పునకూ, విప్లవానికి వ్యతిరేకిగానో ముద్రవేయడం అర్థరహితం. ఆయన సిద్ధాంతకారుడు, వ్యూహకర్త, ప్రవక్త. ఆయన అనేకాంశాల గురించి అలుపు లేకుండా వివరించారు, వ్యాఖ్యానించారు. వర్తమాన ప్రపంచానికీ, మన దేశానికీ అవసరమైన అంశాలనూ ఆయన వింగడించింది ఏమిటో అధ్యయనం చేయాలి.రాజకీయాలు: డబ్బు, కానుకలు ఇచ్చి ఎన్నిక కావడం. ఎన్నిక కాగానే అధికారపక్షానికి వలసపోవడం బాగా పెరిగిన నేటికాలంలో చేసిన వాగ్దానాలు కానీ, ప్రజలు కానీ గుర్తుండే అవకాశం లేదు. కాబట్టి రాజకీయాల్లో నిజంగా, పూర్తిస్థాయిలో విలువలుండాలి. రాజకీయరంగం ప్రక్షాళనకు గాంధీజీ ఆలోచనలు ఉపయోగపడుతాయి.
Also read: అవును… నేడు గాంధీయే మార్గం!
విద్య:
ఒకవైపు విపరీత వ్యయం, మరోవైపు చలనం లేని నిర్జీవమైన పద్ధతులు, మసకబారిన హృదయవికాసంతో ప్రస్తుత మన విద్యారంగం ఆందోళనకరంగా మారింది. పిల్లల ఆలోచనాతీరు మాత్రమే కాదు, వారి ఆరోగ్యం కూడా భయం కొలుపుతోంది. లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాల ఆదాయంతో సాగే విద్యావ్యవస్థ గురించి 1937లోనే గాంధీ ఆందోళనపడ్డారు. మద్యనిషేధం, విద్య ఈ రెండింటి గురించి 1937 సంవత్సరం అంతా మదించారు. గాంధీజీ ఆలోచనలు విద్యా ప్రక్షాళనకు దోహదపడుతాయి.
వైద్యం:
దేశవాళీ విధానాలను పరిశోధించి సాగాలని పదేపదే పేర్కొనే గాంధీజీ వైద్యం గురించి కూడా విశేషమైన దృష్టిసారించారు. మన పంటలు, ఆహారపుటలవాట్లు, అవసరాల రీత్యా మన దేశవాళీ విధానాలు ఆయుర్వేదం, యునానీ వంటి వాటితోపాటుగా హోమియోపతిని కూడా స్వీకరించి సరైన స్థాయిలో అధ్యయనాలు, పరిశోధనలు చేసుకొని ఉండి ఉంటే అంతర్జాతీయ వాణిజ్య సాలెగూడులో మన భారతీయ ఆరోగ్యరంగం చిక్కుకొని ఉండేది కాదు. తీక్షణంగా దృష్టిపెట్టాల్సిన విషయం ఇది.
స్థానికీకరణ, గ్రామాభివృద్ధి:
పట్టణాల, నగరాల కాలుష్యం, అనారోగ్యం, అందని రవాణా వంటి వాటి దృష్ట్యానే కాదు ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా మనం పునరాలోచించాలి. దానికి తగ్గట్టు మన ఆర్థికవిధానాలు, ధోరణులు సవరించు కోవాల్సిన అవసరం చాలా ఉన్నది.
గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చాక చేసిన తొలి రాజకీయ ప్రసంగం కానీ, చంపారన్ నీలి మందు రైతుల కోసం సత్యాగ్రహ ఉద్యమం కానీ, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం చేసిన నిరాహారదీక్ష కానీ, బార్డోలీ భూమి శిస్తు వ్యవహారం కానీ, ఖాదీ ఉద్యమం కానీ, స్వదేశీ ఉద్యమం కానీ… ఇలా గాంధీజీ ఆచరణ, ఆలోచనలు పరిశీలిస్తే అవి మన రైతులు, కార్మికులు, మన దేశ ఆత్మగౌరవం కోసం దృష్టిపెట్టారని బోధపడుతుంది. ఆయన భాష, భాషణం ఉద్రిక్తపరిచేవిగా కాకుండా, నింపాదిగా, పూర్తి అధ్యయనంతో కూడి ఉంటాయి. అలాగే ఆయన తాను చెప్పింది సమగ్రమని భావించలేదు. అవసరమైన చోట సవరించుకోవడానికి సదా సిద్ధమని పలుసార్లు పేర్కొన్నారు. మన దేశానికీ, సమాజానికీ ఏ విషయాలు అవసరమో వాటి గురించి గాంధీజీ ఏమన్నారో హేతుబద్ధంగా చర్చించుకోవడం ఈ క్షణం అవసరం.
Also read: తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్!
— డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
మొబైల్ 9440732392