Thursday, November 21, 2024

జలవాయు కాలుష్యాలకు కళ్ళెమేది?

నూర్‌బాషా ర‌హంతుల్లా

కరోనా వల్ల ఇంతవరకూ ప్రపంచంలో 12.33 లక్షలమంది, ఇండియాలో 1.24 లక్షలమంది చనిపోయారు. కరోనా రోగుల ప్రాణాలకు ప్రమాదం కాబట్టి దీపావళి టపాకాయలు కాల్చొద్దని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రజలకు విజ్నప్తి చేశారు. దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచా విక్రయాలను నిషేధించాలని  సుప్రీం కోర్టు సూచించింది. నివాస ప్రాంతాల్లో బాణసంచా కాల్చటంపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించింది. చుట్టుపక్కల పొలాలలో గడ్డిని తగలబెట్టకూడదని కేంద్రం పదే పదే రైతులను కోరింది. వాయుకాలుష్యం పెచ్చుమీరి దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం పాఠశాలల్ని మూసేసింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ , రాజస్థాన్‌, హర్యానా, డిల్లీ బాణసంచా వినియోగం, విక్రయాలపై నిషేధాంక్షలు ప్రకటించాయి. దేశంలో వాహన, పారిశ్రామిక కాలుష్యం మూలాన ఏటా మూడున్నర లక్షల శిశువుల్లో ఉబ్బసం కేసులు పెద్దల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు బయటపడుతున్నాయి. ధూళికణాలు గాలిలో పేరుకుపోయి నగరాల్ని ‘గ్యాస్‌ ఛాంబర్లు’గా మారుస్తున్నాయి. తగలబెడుతున్న కోట్లాది టన్నుల పంట వ్యర్థాలనుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌, బొగ్గుపులుసు వాయువు, ధూళి, బూడిద, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వెలువడి గాలిని, నేలను, నీటిని విషతుల్యం చేస్తున్నాయి. త్రాగునీటిలో ఫ్లోరైడ్‌ పెరిగి ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోంది.

ట‌పాసుల ఉత్ప‌త్తిత‌నే నిషేధిస్తే మేలు

దీపావళిరోజుల్లో వాయుకాలుష్యం పెరిగిపోతుంది. బాణసంచా కాల్చిన తరువాత వాతావరణంలో కొన్ని రోజులపాటు ప్రమాదకర రసాయనాలు పేరుకుపోయి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వాటి విక్రయాలపై ఆంక్షలు కంటే వాటి ఉత్పత్తినే నిషేధించటం మంచిదంటున్నారు. శివకాశీలో టపాకాయల కర్మాగారాలలో ప్రతి ఏటా అగ్ని ప్రమాదాలు జరిగి పనివాళ్లు ఒళ్ళుకాలి చనిపోతుంటారు. దీపావళి రోజున బాణసంచా కాల్చడంవల్ల ఆ ఒక్క రోజే అతి సూక్ష్మ ధూళి కణాలు మూడున్నర రెట్లు పెరిగి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు మూడింతలు పెరుగుతున్నాయి. టపాకాయల తయారీ కర్మాగారాలలో ప్రతియేటా అగ్ని ప్రమాదాలే. ఎంతో మంది చనిపోతున్నారు. లైసెన్సులు ఎలా ఇస్తున్నారో? టపాసులకు తోడు రహదారి ధూళి వాహనాల ధూళి , డీజిల్‌ జనరేటర్లు, బొగ్గు కర్మాగారాలు పిల్లల వూపిరితిత్తుల్ని దుర్బలం చేస్తున్నాయి. వాయు కాలుష్యం అన్ని దేశాల్లో ఏటా 65 లక్షల నిండు ప్రాణాల్ని కబళిస్తోంది.తీవ్ర వాయుకాలుష్యం పాలబడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ డిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌లా మారిపోయిందనీ డిల్లీలో సరి, బేసి సంఖ్యల ప్రాతిపదికన రోజు విడిచి రోజు వాహనాల రాకపోకల్ని నియంత్రించారు. కనుచూపు మేర ఏముందో కానరానంతటి కాలుష్యంతో కొన్ని పట్టణాలలో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఎన్నో విద్యాసంస్థలు మూసివేశారు. ధూళికణాల పెరుగుదల వల్ల గాలి కలుషితమై, పీల్చే గాలి కాలకూటమై లక్షలాది పసికందులు చనిపోతున్నారు.

5 ఏళ్ళు త‌రుగుతున్న ఆయువు

నల్లటి దట్టమైన పొగ, దుమ్మూ ధూళి కణాలు, ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు కాల్చడం వల్ల పౌరుల ఆయుర్దాయం 5 ఏళ్ళు తగ్గుతోంది. వాయుకాలుష్యం పెరిగి ఇండియాకు ఏటా రూ.4 లక్షల కోట్ల దాకా నష్టం వాటిల్లుతోంది. గాలిలో ఆర్సెనిక్‌, సీసం, నికెల్‌ శాతాలు పెరిగి శ్వాసకోశ వ్యాధులు ముమ్మరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 4.8 కోట్లకు చేరాయి. మళ్ళీ ఐరోపాలోని దేశాలన్నీ లాక్‌డౌన్లుతో హడావుడి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రతనూ తట్టుకొన్న కరోనా వైరస్‌ శీతకాలంలో మరింతగా విజృంభిస్తోందనీ, వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నచోట్ల నర మేధం సృష్టిస్తుందనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల్లో 17 శాతం మంది వాయు కాలుష్య బాధితులే. మనకేం కాదన్న ధిలాసా ప్రాణాంతకం. మన దేశాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ కాలుష్య దేశమన్నాడు. వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది మరణిస్తే అందులో 2 లక్షల మంది భారత్‌కు చెందినవారేనట. ఢిల్లీ పరిసరాల్లో వున్న రాష్ట్రాలు పంట వ్యర్థాలను తగులబెడుతున్నందువల్ల పౌరుల ప్రాణాలకు ముప్పు కలుగుతున్నదనీ, అలా పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టకుండా నివారించాలనీ సుప్రీంకోర్టు కోరింది.

గర్భిణులకు కూడా హానికరం

కాలుష్యపు గాలిని గర్భిణులు పీలిస్తే గర్భంలో పిండం నెలలు నిండకుండానే శిశువులు తక్కువ బరువుతో బలహీనమైన ఊపిరితిత్తులతో పుడతారు. చెడుగాలి పీల్చిన వారికి శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియా, గుండెపోటు, కేన్సర్, మధు మేహం, రక్తంలో గడ్డలు ఏర్పడటం లాంటి వ్యాధులొస్తాయని వైద్యులు చెబుతున్నారు. మన దేశ జనాభాలో 84 శాతంమంది వాయు కాలుష్యం అధికంగా వుండే ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. కార్మికుల శ్రమించే శక్తి తగ్గి ఉత్పాదకత ఆమేరకు తగ్గు తోంది. మన జీడీపీలో 8.5 శాతాన్ని వాయు కాలుష్యం మింగేస్తోంది. దిల్లీ ఏటా శీతకాలంలో ప్రజలకు ఊపిరి పీల్చుకోవడమే కష్టతరమవుతోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వేల మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. గడ్డిని దహనం చేయకుండా జీవ ఇంధనం వంటి ఉత్పత్తుల తయారీకి రైతులనుండి కొనుగోలు చేయాలి. కరోనా ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తోంది.

కాలుష్య భూతంతో ఆరోగ్యంపై దుష్ర‌భావాలు

ఈ పరిస్థితుల్లో కాలుష్య భూతం కూడా పంజా విసిరితే ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పెరుగుతాయి. జీవనదులకు వ్యర్థాల ఉరిగా మారాయి. మన దేశంలో ఫ్లోరోసిస్ బాధితులు కోటీ 17 లక్షల మంది. ఫ్లోరైడ్‌ అధికస్థాయికి చేరి- శరీరానికి పోషకాలు అందక రక్తహీనత ఎదుర్కొంటున్నారు. ఎముకలు గుల్లబారి నడవలేకపోతున్నారు. తాగునీటిని నదుల నుంచి సురక్షిత నీరుగా మార్చి సరఫరా చేయటం, మంచి ఆహారం ఫ్లోరోసిస్‌కు విరుగుడు. అల్యూమినియం పాత్రల్లో ఆహారం వండటం వల్ల అందులోని అల్యూమినియం ఫ్లోరైడ్‌ వల్ల నరాల జబ్బులు వస్తున్నాయి. ఫ్లోరైడ్ ఉన్నచోట్ల వర్షపు నీటిని వాడుకోవాలి. పటిక,సున్నంతో నీటిని శుద్ధి చేయాలి. మధ్యాహ్న భోజనం కింద రక్తహీనతను దూరం చేసే ఆహారం ఇవ్వాలి. విటమిన్‌ మాత్రలు పంపిణీ చేయాలి.

కృష్ణాగోదావరి జలాల ప్రక్షాళన

కృష్ణా గోదావరి మొదలైన నదుల్ని ప్రక్షాళన చేయమని ప్రజలు చాలా ఏళ్లనుండి కోరుతున్నారు. దేశంలో 70 శాతం నదుల జలాలు మనుషుల వినియోగానికి పనికి రానిరీతిలో కలుషితం అవుతున్నాయి. కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ ఒకప్పుడు హైదరాబాద్‌ దాహార్తిని తీర్చేది. ఇప్పుడు మురికినీటి నాలా.దేశంలోనే అత్యంత కలుషితమైన నాలుగో నది మూసీ. అన్నినదులను ప్రక్షాళించాలి. గోదావరి, కృష్ణా నదులు మంజీర, పెన్నా, తుంగభద్ర, నాగావళి లాంటి ఉపనదులు కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. నదులు కూడా మనుషుల్లాంటివేనని వాటికీ కాలుష్యరహితంగా బ్రతికే హక్కు ఉందని న్యాయస్థానం చెప్పింది. కొన్ని నదుల్లో నీరు స్నానం చేసేందుకూ పనికిరాని స్థితికి చేరింది. చేపలు ఆ నీటిలో బతకలేని స్థితి. కృష్ణా నదిలో హానికరమైన కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉంది. పట్టణాలు, నగరాల్లోని మురుగు నీటిని పరిశ్రమల నుంచి వెలువడే ప్రాణాంతకమైన రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదుల్లోకి వదిలేస్తున్నారు. నదులు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను శుభ్రం చేయటంలేదు. కరకట్టలు ఆక్రమణకు గురై కలుషితం కాకుండా ఇరువైపులా మొక్కలు పెంచాలి. 60 కోట్ల జనాభా నీటి ఎద్దడితో సతమతమవకుండా మన నదులు సజీవంగా ప్రవహించాలి.

నూర్‌బాషా ర‌హంతుల్లా
నూర్‌బాషా ర‌హంతుల్లా

(వ్యాస ర‌చ‌యిత ఏపీ రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, మొబైల్;‌ 6301493266)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles