Saturday, December 28, 2024

ఇంతకీ బొమ్మ పడేదెప్పుడు?

  • కేంద్రం నిబంధనలు సడలించినా సంకోచిస్తున్న థియేటర్ల యజమానులు
  • 60 శాతం సీట్లు నిండితే కానీ గిట్టుబాటు కాదు
  • టీవీలో చూసినా థియేటర్లో సినిమా చూస్తేనే తృప్తి

మాశర్మ

కరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ ప్రక్రియను ప్రభుత్వాలు క్రమంగా సరళీకృతం చేస్తూ, అన్ లాక్ చేస్తున్నాయి. ప్రస్తుతం అన్ లాక్ -5 వ దశకు చేరుకుంది. ఇంకా కొంతమంది ఇళ్లకే పరిమితమై వున్నా, ఎక్కువమంది యథాతధంగా బయటకు వస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. కరోనాకు ముందు జనసమ్మర్దన ఎలా ఉందో,  అటువంటి సాధారణ పరిస్థితి రోడ్ల మీద కనిపిస్తోంది. కార్యకలాపాల వేగం పెరిగింది. ప్రయాణాలు కూడా పెరుగుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ మొదలైనవి కూడా చాలా వరకూ సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేశాయి.హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, షోరూమ్స్ లో ఇంకా ఆశించిన స్థాయిలో రద్దీ పెరగలేదు.

వినోదంకోసం అర్రులు చాచుతున్న జనం

ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న అంశం వినోద కార్యక్రమాలు. అందులో సినిమాది అగ్రస్థానం. మిగిలినవి సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు, శుభకార్యక్రమాలు మొదలైనవి. కుర్రకారులో కొంతమందికి  కావాల్సింది పబ్బులు, థియేటర్లు. అన్ లాక్ -5 అందుబాటులోకి వస్తున్నప్పటికీ ఈ కార్యక్రమాలు ఇప్పుడప్పుడే ఊపందుకునే పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు.అన్ని వయసుల వారికి ఆకర్షణగా ఉండేవి సినిమా థియేటర్లు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, హైదరాబాద్ మహానగరాన్ని పక్కన పెడితే, మిగిలిన నగరాలకు, పట్టణాలకు, మండలస్థాయి గ్రామాల ప్రజలకు ఉన్న ఏకైక వినోద సాధనం సినిమా. ఈ నెల 15వ తేదీ నుండి సినిమాహాళ్లను తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సగం సీట్లు నిండితే గిట్టుబాటు కాదు

కరోనా నిబంధనల నేపథ్యంలో సగం సీట్లతోనే సినిమాలు ప్రదర్శించాలి. శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగించాలి. తెలుగురాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను పరిశీలిస్తే, చిన్నా,  పెద్దా, మల్టిప్లెక్స్ లు ఆన్నీ కలిపి 1,050 థియేటర్లు ఉన్నట్లు సమాచారం. థియేటర్లు తెరవాలంటే 24 రకాల నిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా అదుపులోకి వస్తున్నప్పటికీ,  జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం కొన్ని నియమ,నిబంధనలను రూపొందించింది. మాస్క్ లు ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తూ వినోదం పొందడానికి ప్రజలు ఏ మేరకు సిద్ధంగా ఉన్నారన్నది ఒక ప్రశ్న.

చూపించేందుకు సినిమాలు లేవు

థియేటర్లు తెరచినా ప్రస్తుతానికి కొత్త సినిమాలు ఏమీ లేవు. మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమైనా, ఇంతవరకూ తేదీలు ప్రకటించలేదు. ఈ లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు పేరుకుపొయ్యాయి. ఆదాయం లేకపోయినా,  సిబ్బందికి కనీసం జీతం ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో చిన్న ధియేటర్ల యజమానులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని థియేటర్లు విద్యుత్ బిల్లులు చెల్లించలేక పోవడంవల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు కనెక్షన్లు తీసేశాయి. ఈ బకాయిలు చెల్లిస్తే కానీ, విద్యుత్ పునరుద్ధరణ జరుగదు. ఆర్ధిక స్థోమత ఉన్న కొన్ని థియేటర్లు, కొన్ని మల్టీప్లెక్స్లు సిద్ధంగా ఉన్నా, చిన్న ధియేటర్ యజమానులు విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సగం సీట్లకు మాత్రమే అనుమతి ఉన్న నేపథ్యంలో టిక్కెట్ల ధర డబుల్ చేస్తే, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని  ధియేటర్ యజమానులు భయపడుతున్నారు. ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచడానికి ప్రభుత్వం కూడా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదని భావించాలి. శానిటైజేషన్ కు పెట్టాల్సిన ఖర్చు సగటున ఒక్కొక్క ప్రేక్షకుడికి 5 రూపాయల దాకా ఉంటుందని సమాచారం.దీనికి కూడా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి బహుశా! ఈ విషయంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుందని  విశ్వసించవచ్చు.

విద్యుత్ బిల్లుల బకాయీలూ రద్దు చేయండి

విద్యుత్ బిల్లుల బకాయిల రద్దుకు ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం థియేటర్లు తెరవాలంటే కొంత డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఆ ధియేటర్ స్థాయిని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా 7-10లక్షల వరకూ పెట్టుబడి పెట్టితీరాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సగం సీట్లతో థియేటర్లను నడిపినా, కొన్ని నిర్వహణాపరమైన ఖర్చులు తగ్గవు. ప్రస్తుత పరిస్థితుల్లో,  సింగిల్ స్క్రీన్ ధియేటర్ల యజమానులు ఏ మేరకు ఖర్చులు భరించగలరన్నది ఒక ముఖ్యమైన అంశం. 65 శాతం సీట్లు నిండితే తప్ప థియేటర్లు నడపలేరన్నది మార్కెట్ సమాచారం. సగం సీట్లలో కూడా ఎంతవరకూ నిండుతాయన్నది  అనుమానమే. థియేటర్లు తెరచినా, ఏ సినిమాలు వెయ్యాలో కూడా అర్ధంకాని పరిస్థితుల్లో ధియేటర్ల యజమానులు  ఉన్నారని కొందరు  సినిమా నిపుణులు  వ్యాఖ్యానిస్తున్నారు. 

ఓ.టి.టి. వేదికలు అలవాటైన ప్రేక్షకులు

కొందరు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే ఓ.టి.టి వేదికల్లో సినిమాలు చూడడానికి అలవాటు పడుతున్నారు. ఈ సంస్కృతి పెరగడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ధియేటర్ కు వెళ్లి పెద్ద స్క్రీన్ లో కంటినిండా సినిమా చూడడంలో ఉండే థ్రిల్ ఓ.టి.టి ల్లో ఉండదన్నది అందరి అభిప్రాయం. టీవీల్లో సినిమాలు చూస్తున్నప్పటికీ, ధియేటర్ లో సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో,  ఈ 15వ తేది నుండి ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లు ఏ మేరకు ప్రారంభమవుతాయన్నది అనుమానమే. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం, వెసులుబాట్లు ఉంటాయో వెండితెరపై చూడాల్సిందే. ఇంతకీ బొమ్మ పడుతుందా? లేదా? రెండురోజుల్లోనే తేలిపోతుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles