Thursday, January 2, 2025

ఆకలి రోగాల భయాల నుంచి ఉప‌శ‌మ‌నం ఎప్పుడు?

నూర్ బాషా రహంతుల్లా

ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 న జరుపుకున్నారు. ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం 88 దేశాల్లో పదికోట్ల మందికి 42 లక్షల టన్నుల ఆహారాన్ని, అందజేసిన ప్రపంచ ఆహార సంస్థకు ఇచ్చారు. ఆకలితో అలమటించే వారికే తెలుస్తుంది ఎదుటి వారి ఆకలి గురించి అది పశువైనా, మనిషైనా సరే. ఆకలితో అలమటించే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. అది సాయుధ ఘర్షణలకు, యుద్ధాలకు కారణమవుతుంది. కొన్నిచోట్ల ఆకలికి తాళలేక చిన్నారులు మట్టి తింటే పిల్లల్ని ఏమార్చటానికి తల్లి గులకరాళ్ళు ఉడకేసిందట. లాక్ డౌన్ వలన ఏమీ దొరకక రోడ్లపై పోతున్న వలస కూలీలు ముళ్లతో కూడిన పామాయిల్ గెలలను తిన్నారు. వారిపై రసాయనాలు చల్లారు. ఆహారం ఎక్కడ పెడుతుంటే అక్కడికి పరుగులుతీశారు. యెమెన్ లాంటి దుర్భిక్ష దేశాలకు సంపన్న అరబ్ దేశాలు చేసే సాయం సరిపోవటంలేదు.

శరణార్థులను అమెరికాలోకి రానివ్వని ట్రంప్

శరణార్ధులను అమెరికాలోకి రానియ్యని ట్రంప్ను సిరియా బాలిక ఆలాబెద్ నీకు ఆకలి అంటే తెలుసా? ఎప్పుడైనా 24 గంటలు అన్నపానీయాలు లేకుండా ఉన్నావా అని అడిగింది. అమెరికా లాంటి సంపన్న దేశాలు ఆయుధ వ్యాపారంలో మునిగితేలుతున్నాయి. వేలాదిమంది ఆకలితో అలమటించి మరణిస్తారు. పోషకాహారం లోపించి వ్యాధులబారిన పడి చనిపోతారు. ఆహార పంపిణీ శాంతి  సాధనకు తోడ్పడుతుంది. ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో 2030 నాటికి ఆకలిని అంతం చేయడం కూడా ఒకటి. ఐరాస ప్రజానీకానికి అన్నదాతగా నిలుస్తోంది. అటు ఆహార పంపిణీ కార్యకలాపాలను, ఇటు శాంతి స్థాపన కృషిని మిళితం చేస్తూ పనిచేస్తోంది. భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు సమాజాన్ని పట్టి పీడిస్తున్నారు.

కూరలు లేకుండా పప్పన్నం

చాలా మంది ప్రజలు కూరలు చేసుకోకుండా కేవలం పప్పు అన్నం తిని బ్రతుకుతున్నారు. పంట కోతలు, నూర్పిళ్ళు వంటి పనులకు మహిళలను వదిలిపెట్టి పురుషులు పని వెతుక్కుంటూ వెళతారు. ఒక్కోసారి వారి కుటుంబాలతో పాటు వెళతారు. అందుబాటులో వున్న పనులతో మహిళలు ఇల్లు గడుపుకుంటూ వస్తారు. ఉపాధి కోల్పోయి ఆదాయాలు ఆగిపోయిన కార్మికులు, వ్యవసాయ కూలీ మహిళలు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళినవారు తమకు దొరికిన వాహనాలను పట్టుకుని నడుచుకుంటూ ఇళ్ళకు చేరుకున్నారు. వందలాది జాలర్లు సముద్రంలో చిక్కుకుపోయారు. కరోనా సోకినవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు. మిగిలిన వ్యాధులతో బాధపడేవారికి ప్రజారోగ్య వ్యవస్థలు పనిచేయనందువలన గర్భిణులు దెబ్బతిన్నారు. ఆన్‌లైన్‌ చదువులతో తమకు చదువులు అక్కర్లేదంటారేమోనని పలువురు యువతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కంటే ఆకలి అంటే భయం

తమకు కరోనా భయం కన్నా ఆకలి చావుల భయం ఎక్కువగా ఉందని పేదవారు అంటున్నారు. వీరిలో చాలామంది స్మార్ట్‌ ఫోన్లు కొనలేరు. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు వుంటే వారిలో కేవలం మగపిల్లలను మాత్రమే చదువుకోనిస్తున్నారు. కుటుంబ భారాన్ని తగ్గించేందుకు ఆడపిల్లలను మధ్యలో చదువు మానిపిస్తున్నారు. ఆడపిల్లలకు ఆన్‌లైన్‌ చదువులు వద్దంటున్నారు. ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌)లో 107 దేశాల ర్యాంకులలో మన దేశం 94వ స్థానంలో ఉన్నది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల జాబితాలో మన దేశం బంగ్లాదేశ్‌ (75), పాకిస్తాన్‌ (88) కన్నా దిగువ స్థాయిలో ఉన్నది. మన దేశ జనాభాలో 14 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పౌష్టికాహార లోపం వలన 3.7 శాతం మంది పిలు మరణిస్తున్నారు.

క‌రోనాతో ఆహార స‌మ‌స్య తీవ్ర‌త‌రం

కరోనా మహమ్మారి వలన ఆహార సమస్య దేశంలో తీవ్రంగా ఉంది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. ఆహార ద్రవ్యోల్బణం ప్రభావంతో ఆహార పదార్ధాల ధరలు పెరిగి ప్రజలకు ఆహారం దూరమవుతోంది. కరోనా లాక్‌డౌన్‌లో  ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలను విడుదల చేయాలి. పేదలు మరింత పేదలుగా మారుతుండగా రెండవ వైపు అంబానీ, అదానీల సంపద ఇంకా ఇంకా పెరుగుతోంది. అవసరమైనంత ఆహారం తీసుకోక మన పిల్లలు వయసుకు తగినంత బరువు,ఎత్తు లేరు.బాలల మరణాల శాతం 3.7 శాతం ఉంది. ప్రజలకు ఆహార కొరత ఉంది. కుటుంబాలు దరిద్రంలో ఉండటం వలన, తక్కువ క్వాలిటీ ఆహారం తీసుకొంటున్నారు. తల్లులకు తగిన విద్య లేదు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు కూడా మనకన్నా ముందు స్థానాలలో ఉన్నాయి. మేకిన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ ల వల్ల కూడా ఆకలి సమస్య తగ్గలేదు. మనమూ సుడాన్‌ ఒకే స్థానంలో వున్నాం. కేవలం చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్‌ దేశాలు మాత్రమే ఉత్తమంగా నిలిచాయి.  

పెరుగుతున్న శ్రీ‌మంతుల జాబితా

ఒకపక్క శ్రీమంతుల జాబితా పెరుగుతోంది. దానికి సమాంతరంగా, సమానంగా ఇటు ఆకలిమంటలు కూడా విస్తరిస్తున్నాయి. 2,189   ప్రపంచ కుబేరుల సంపద పదిన్నర లక్షల కోట్ల డాలర్లు. టెక్, హెల్త్‌కేర్, పారిశ్రామిక రంగాలు వారిని మరింత కుబేరుల్ని చేస్తాయి. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆదాయం తీవ్రంగా పడిపోయి, అప్పులబారిన పడి 12 కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌వంటి అధిక జనాభావున్న పెద్ద రాష్ట్రాలు ఎప్పటికీ వెనకబడే వుంటున్నాయి. ఈ రాష్ట్రాల్లో పౌష్టికాహారలోపం తీవ్రత ఎక్కువుంది. శిశువుల్లో 5% మంది ఉత్తరప్రదేశ్‌ పిల్లలే. పిల్లలకు సురక్షితమైన, పుష్టికరమైన ఆహారం చవగ్గా అందించాలి. మాతా శిశు సంరక్షణ పథకాలను బాగా అమలు చేస్తూ బిడ్డ కడుపులో పడినప్పటినుంచీ మంచి పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం తల్లికి పిల్లలకూ అందేలా చూస్తే తక్కువ బరువుండటం, ఎత్తు తక్కువగా వుండటం, పసి వయసులోనే మృత్యువాత పడటం వంటి సమస్యలు తగ్గుతాయి. దేశంలో రోజూ 20 కోట్లమంది ప్రజలు కడుపుకింత ముద్ద దొరక్క పస్తులుంటున్నారట. పౌష్టికాహారం దేశ జనాభాకు అందుబాటులో లేకపోవడమే అనారోగ్య హేతువు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల కంటే వెనుక భారత్?

బలమైన ఆర్ధికశక్తి అమెరికాతో పోటీ పడుతున్న చైనా యుద్ధానికి సై అంటోంది. భారతదేశం వెనుకబడిన పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లతో పోటీపడుతోంది. ప్రపంచవ్యాప్త క్షుద్బాధితుల్లో పాతికశాతం భారత్‌లోనే పోగుబడి ఉన్నారు. వృద్ధిరేటు 4శాతానికి పడిపోయింది. అంబానీ ఆదాయం గంటకు 90కోట్లు కాగా, గ్రామీణ పేదల ఆదాయం నెలకు 5వేలు. ఆర్ధిక అసమానతలు పెరిగాయి. కార్పొరేట్ల కుబేరుల సంపద పెరిగింది కానీ ఉద్యోగాలూ ఉపాధీ కోల్పోయిన సాధారణ ప్రజల ఆదాయాలు పడిపోయాయి. ఉద్యోగులకు కరువు భత్యం క్రమంగా రావటం లేదు.పెన్షనర్లు అర్జీలు పెట్టుకున్నా విచారణ నివేదికలు ఏళ్లకు ఏళ్లు జాప్యం చేయటం వల్ల ఆర్ధికేతరకేసులు కూడా తెమలక పూర్తి పెన్షన్ రాక రిటైర్ అయిన వారు బాధపడుతున్నారు.

సకాలంలో నివేదికలు పంపని అధికారులపై చర్యలు

సకాలంలో రిపోర్టులు పంపని అధికారుల్ని అదిలించాలి. స్పందనలో వచ్చే ప్రతి అర్జీకి బాధ్యతగా సకాలంలో జవాబులు ఇవ్వండని ముఖ్యమంత్రి చెబుతూనే ఉన్నారు. ఉద్యోగులు తమ ప్రతి జాప్యానికీ కరోనాను ఒక కారణంగా చూపుతున్నారు. ఫోన్ ఇన్ కమింగ్‌కు  కూడా డబ్భులు చెల్లించాలట. కేబుల్ సెట్ టాప్ బాక్స్ రెండు వేల రూపాయలు చెల్లించి కొనుక్కోవాలి. వంద చానళ్ళకు నెలకు నూటయాబై రూపాయల ఫీజు వేయి రూపాయలు దాకా అయ్యింది. పెట్రోల్ కంటే డీజిల్ రేట్ పెరిగింది. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ సంస్థలకు అమ్మారు. ఉద్యోగాలు ఊడాయి. కులం, మతం పేరుతో పరువు హత్యలు హత్యాచారాలు పెరిగాయి. ప్రజారోగ్యంకోసం కొత్తగా ప్రభుత్వ హాస్పటల్స్ పెరగాలి. విదేశాల నుండి నల్లదనం తీసుకురావాలి. కరోనా మహమ్మారి ప్రజల దుస్థితిని మరింత పెంచింది. ప్రాణాంతక వైరస్‌లు, యుద్ధాల భయం మనల్ని ఆవరించింది. చిరంజీవి లాంటి ఆకలి మహమ్మారి కూడా కరోనాకు తోడై లక్షలాది మందిని బలితీసుకున్నది.

ఎప్పటికి కోలుకుంటాం?

ఆకలి రోగాల భయాల నుంచి ఎప్పటికి కోలుకుంటామో? వండిన తాజా ఆహారాన్ని ప్రజలకు అందించడం ప్రజల్లో ఆదరణ చూరగొంటున్న ప్రక్రియ. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు , రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ (దీన్‌దయాళ్‌ భోజనాలయ), తెలంగాణ (అన్నపూర్ణ) ఆంధ్రప్రదేశ్‌ (అన్న క్యాంటీన్లు/రాజన్న క్యాంటీన్లు/ గోరుముద్ద ), కర్ణాటక లో (‘నమ్మ క్యాంటీన్‌’),ఒడిశా, దిల్లీ, యూపీ, హరియాణా, పంజాబ్‌ లలో వేరువేరు పేర్లతో పెదప్రజలకు సబ్సిడీ ధరలకు ఆహారం అందించే కార్యక్రమాలకు పేదలు బ్రహ్మరథం పట్టారు. కరోనా తగ్గేవరకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని ఉచితంగా గానీ చవక ధరలతోగానీ ఆన్నదాన కార్యక్రమాలు చేపట్టటం మంచిది. తక్కువ ధరకే పేదల ఆకలి తీర్చే ఒక్కో క్యాంటీన్‌ కనీసం పది మంది మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తుంది. సబ్సిడీ క్యాంటీన్లే ఆహార హక్కుకు దగ్గరి దారి! దేశంలో పేదరికం తాండవిస్తున్న అన్నీ ప్రాంతాలకూ ఈ క్యాంటీన్లను విస్తరించాలి. క్యాంటీన్ల నిర్వహణలో పరిశుభ్రత మెరుగుపరచి ఆహారం ధర కొద్దిగా పెంచినా చెల్లించడానికి వినియోగదారులు వెనకాడరు. దేశాభివృద్ధికి పౌష్టికాహారమే పునాది.

రచయిత విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles