- తమిళ రాజకీయాల్లో విస్తృత చర్చ
- ఆమె వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ
అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. జయలలిత నెచ్చెలి, తమిళులు చిన్నమ్మ గా పిలుచుకునే శశికళ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే శశికళ విడుదల పైనే తమిళులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. జయలలిత మరణం తరువాత సీఎం కాబోయి తృటిలో అవకాశాన్ని చేజార్చుకున్న చిన్నమ్మ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జైలు పాలయ్యారు.
2016లో జయలలిత మరణం తర్వాత అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని జైల్లో నాలుగేళ్లపాటు గడపాల్సివచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తికావడంతో పాటు 10 కోట్ల జరిమానాను చెల్లింది శశికళ విడుదల కానున్నారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, శశికళ విడుదల కావడం జరగనున్న నేపథ్యంలో తమిళ రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో దిగ్గజ రాజకీయ నేతలైన జయలలిత, కరుణానిథి లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ శూన్యత ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినీనటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రానంటూ ఖరాఖండిగా చెప్పేయడంతో శశికళ రాక రాష్ట్ర రాజకీయాల్లో కాకను రేపుతోంది. విడుదలయ్యాక ఆమె ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారోనని రాజకీయ వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఇది చదవండి: ద్రావిడ పార్టీలకే మళ్ళీ అధికారమా?
చిన్నమ్మ ఎంట్రీతో మారనున్న సమీకరణాలు:
జయలలిత తరువాత అన్నాడీఎంకేలో శక్తిమంతమైన మహిళగా శశికళ ఆవిర్భవించారు. శశికళ రాజకీయాల్లోకి వస్తే కీలక పాత్ర పోషించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా ఆమె అనుసరించే వ్యూహాలతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంచనావేస్తున్నారు.
ప్రస్తుతం శశికళ ముందు రెండు మార్గాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొదటిది ఆమె మేనల్లుడు దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం పార్టీకి సారథ్యం వహించడం, రెండోది అన్నాడీఎంకేలో చేరడం. సీఎం పళనిస్వామి మాత్రం శశికళను అన్నాడీఎంకేలోకి అనుమతించబోమని ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో శశికళ ఎలాంటి వ్యూహాలను అమలు పరుస్తారోనన్న ఆసక్తి తమిళనాట నెలకొంది.
ఇది చదవండి: రజనీ నిర్ణయంతో ఆనందంలో తమిళ పార్టీలు
జయలలిత స్మారక మందిరం:
మరోవైపు మెరీనా బీచ్ లో నిర్మిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మందిరాన్ని ఈ నెల 27న రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాకతాళీయమో యాదృచ్చఛికమో గాని అదేరోజు శశకళ కూడా జైలు నుండి విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.