Sunday, December 22, 2024

అగ్రిగోల్డ్ పునరుద్ధరణ ఎప్పుడు?

  • కోట్లమంది జీవితాలతో ముడివడిన మహాసంస్థ
  • అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువైనా కొలిక్కి రాని సమస్య
  • న్యాయస్థానాలు మాత్రమే పరిష్కరించవలసిన చిక్కుముడి
  • వాగ్దానం అమలులో కనిపిస్తున్న పాలకుల చిత్తశుద్ధి
  • హైదరాబాద్ హైకోర్టుపైనే అందరి ఆశలు

(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి)

దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద గ్రూప్ గా మహా నిర్మాణమై, తదనంతర పరిణామాల్లో పేక మేడల్లా కూలిపోయిన పెద్ద సంస్థ అగ్రిగోల్డ్. కూలి పోయిందా? కూల్చివేశారా? అన్న చర్చను ప్రస్తుతానికి పక్కన పెడితే, కోట్లాది మంది జీవితాలతో ముడివేసుకున్న ఈ సమస్యకు సంపూర్ణ పరిష్కారం ఎప్పుడు?  అన్నది కోట్ల మెదళ్లను తొలుస్తోన్న పెద్ద ప్రశ్న. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  విజయవాడలో ప్రారంభమైన అగ్రిగోల్డ్ కంపెనీ 2015 వరకూ 20ఏళ్ళ కాలంలో  వివిధ విభాగాల్లో వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, మహారాష్ట్ర, అండమాన్ మొదలైన రాష్ట్రాలలో వివిధ వ్యాపారాలు నిర్వహించింది.

సమస్య మూలాలు

కస్టమర్లకు ఇచ్చిన చెక్కులు వరుసగా బౌన్స్ కావడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సి ఐ డి విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మిగిలిన రాష్ట్రాలలోనూ అనేక కేసులు నమోదయ్యాయి. విచారణ జరిపిన పోలీస్ విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు అందజేశాయి. అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు సంఘాలుగా ఏర్పడి సమస్య సత్వర పరిష్కారానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 2015లో హైదరాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. పలు దశల్లో పలు ఆదేశాలను ఇచ్చింది. అగ్రిగోల్డ్ గ్రూప్ కు చెందిన ఆస్తులను సి ఐ డి విభాగాలు గుర్తించి, ఆ వివరాలను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటి వరకూ గుర్తించిన ఆస్తులన్నీ ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో అటాచ్ మెంట్ లో ఉన్నాయి. కస్టమర్లు, ఏజెంట్ల సంఘాలు చేసిన పలు ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టడం ప్రారంభించాయి.

కార్యరూపం దాల్చని నాయుడు హామీ

అందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తొలి విడుతగా 200కోట్ల రూపాయలు కస్టమర్లకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు జి.ఓ కూడా విడుదల చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వై సి పి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తను చేసిన సుదీర్ఘ పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల నుండి పలు విన్నపాలు అందుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని మాట  ఇచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వం నుండి 1150కోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వైసిపి మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. హామీలో భాగంగా తొలి విడుతగా 263 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లోని 3లక్షల 74కోట్లమంది  కస్టమర్లకు అందజేశారు. ఈ డిసెంబర్ లో మరో 200కోట్లు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లోనే 19 లక్షల మంది

ఈ దిశగా ఏపి ప్రభుత్వం హైకోర్టు అనుమతిని కోరుతూ లేఖ రాసింది. అన్ని రాష్ట్రాలలో కలిసి మొత్తంగా 32లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో 19లక్షల మంది ఉన్నారు. వీరిలో 20వేల రూపాయల లోపు వారు 12లక్షల మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే 3లక్షల, 74వేల మంది బకాయిలు తీరిపోయాయి. డిసెంబర్ లో ప్రభుత్వం ఇవ్వబోయే 200కోట్ల రూపాయల వల్ల సుమారు మరో 2 లక్షల, 85వేల కస్టమర్ల బకాయిలు తీరిపోతాయి. ఆ విధంగా, ఆంధ్రప్రదేశ్ లోని 19లక్షల కస్టమర్లలో సుమారు 6లక్షల, 50వేల మంది బకాయిలు తీరిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 1150కోట్ల రూపాయల పంపిణీ జరిగితే, సుమారు 12లక్షలమంది బకాయిలు తీరిపోతాయి. వీరంతా 20వేల రూపాయల లోపు కస్టమర్లు. మిగిలిన బకాయిదార్లు 7లక్షల మంది పెండింగ్ ఉంటారు. వీరంతా 20వేల రూపాయిలకు పైబడిన వారు.

బాకాయీలు పొందవలసినవారి సంఖ్య 32 లక్షలు

అన్ని రాష్ట్రాలలో కలిసి అగ్రిగోల్డ్ సంస్థ బకాయిలు చెల్లించాల్సిన వారి సంఖ్య 32లక్షలకు పైగా ఉంది. దీని విలువ ఇప్పటి వరకూ వివిధ ప్రభుత్వ విభాగాలు వేసిన అంచనా మేరకు సుమారు 6,350 కోట్లరూపాయలు. చెక్కుల బౌన్స్ కు సంబంధించినది మరో 700 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది కస్టమర్ల వరకూ మాత్రమే సంబంధించిన సంఖ్య. ఇంకా కమీషన్లు రావాల్సిన ఏజెంట్లు, సప్లయర్స్, బ్యాంకుల రుణాలు, ప్రభుత్వ సంస్థలకు కట్టవలసిన పన్నులు, ఉద్యోగులు, తదితరులకు ఉన్న బకాయీలన్నీ కలిపితే మరో 800కోట్ల రూపాయల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. మొత్తంగా సుమారు 7,800కోట్ల రూపాయలు ఉండవచ్చని సమాచారం. వీరిలో కస్టమర్లు 32లక్షల మంది, ఏజెంట్లు 8లక్షల మంది, సప్లయర్స్ 3లక్షల మంది, ఉద్యోగులు, తదితరులు 10వేలమందికి పైగా ఉంటారని అంచనా. మొత్తంమీద, అన్ని రాష్ట్రాల్లో కలిసి, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  కొన్ని కోట్లమంది అగ్రిగోల్డ్ సంస్థ మూత పడడం వల్ల బాధితులుగా మిగిలారు. వీరందరి సమస్యలు త్వరగా తీరాలి. బాధల నుండి విముక్తులవ్వాలి. అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న ఆస్తులు -అప్పులు విలువను పరిశీలిస్తే, తగినంతగానే కాక, ఇంకా అధికంగా కూడా ఉంటుందని  ప్రభుత్వాలు, ప్రయివేట్, కార్పొరేట్ మార్కెట్ వర్గాలు  అంచనా వేస్తున్నాయి.

హాయిలాండ్, 16 వేల ఎకరాల భూములు

విజయవాడలోని హాయిలాండ్ సంస్థ కాకుండా, సుమారు 16వేల ఎకరాలకు పైగా భూములు అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ హైదరాబాద్ హైకోర్టు పరిధిలో అటాచ్ మెంట్ లో ఉన్నాయి. ఇది బాధితులకు పెద్ద ఊరట ఇచ్చే అంశం. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో వివిధ పరిశ్రమలు, వృక్ష సంపద కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత విలువైన ఎర్ర చందనం, టేకు చెట్లు, పండ్లతోటలు కూడా సంస్థకున్న వృక్ష సంపదలో ఉన్నాయి. ముఖ్యంగా ఎర్ర చందనం చెట్ల ద్వారా  అనంతమైన సంపద సృష్టించవచ్చు. అగ్రిగోల్డ్ గ్రూప్ కున్న భూములను  ప్లాట్లు, టౌన్ షిప్పులుగా  రూపొందించడం వల్ల,  ఆఫీస్, కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్మాణాలు చేపట్టడం వల్ల వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించవచ్చు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల సత్వర పరిష్కారం దిశగా  న్యాయస్థానాలు, ఆయా ప్రభుత్వాలు తమ చర్యలు ఇప్పటికే చేపట్టాయి. తాజాగా అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంఘం ఈ ప్రక్రియ మరింత వేగవంతమయ్యే దిశగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ, సుప్రీం కోర్టుకు పిటీషన్ వేసింది.

హైకోర్టులో పరిష్కరించుకోమని సుప్రీం సలహా

ఇప్పటికే ఈ కేసు హైదరాబాద్ హైకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో, మళ్ళీ హైకోర్టునే సంప్రదించమని సుప్రీం ధర్మాసనం పిటీషనర్ కు సూచించింది. ఈ కేసు సత్వరమే పరిష్కారం అవ్వాలనే అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కూడా వెలిబుచ్చింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా హైదరాబాద్ హైకోర్టులో, జులై 18వ తేదీ, 2019నాడు అఫిడవిట్ ఫైల్ చేసింది. జాయింట్ వెంచర్ల ద్వారా 4 సంవత్సరాల్లో 11,500కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టిస్తామని అఫిడవిట్ లో పేర్కొంది. కస్టమర్లకు ఇవ్వవలసిన 7,000కోట్ల రూపాయలకు 10శాతం వడ్డీగా, 700కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తామని అందులో తెలిపింది. ఇవ్వన్నీ కూడితే, మొత్తం 8,500కోట్ల రూపాయలుగా తేలుతుంది. అగ్రిగోల్డ్ సృష్టిస్తామని చెప్పిన విలువ 11,500కోట్ల రూపాయలు. అంటే? అందరి బకాయిలు పోగా, ఇంకా 3000కోట్ల రూపాయలు అదనంగా మిగులుతాయి.

Also Read: అగ్రీగోల్డ్ కేసుపైన త్రిసభ్య సుప్రీం బెంచ్ విచారణ

హాయిలాండ్ కూ వెలకట్టాలి

ఇది కాకుండా, హాయిల్యాండ్ ను కూడా వెలకట్టాలి. గతంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా హాయిల్యాండ్ ను సుమారు 600కోట్ల రూపాయలుగా విలువ కట్టింది. తాజాగా విలువ కట్టాల్సివుంది. హైకోర్టు అటాచ్ మెంట్ లో వున్న 16,500ఎకరాల విలువ ఎస్.ఆర్ వాల్యూ ప్రకారమే 8వేల కోట్ల రూపాయల వరకూ ఉన్నట్లు సమాచారం. బయట మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ 20వేల కోట్ల రూపాయల పైనే ఉండవచ్చు. అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టులో వేసిన అఫడవిట్ లో పలు విన్నపాలు చేసింది. (1) రిటైర్ న్యాయమూర్తుల  ఆధ్వర్యంలో ఒక  కమిటీని ఏర్పాటు చెయ్యడం (2) ప్లాట్లు, నిర్మాణాలు అమ్మడానికి అనుకూలంగా జాయింట్ వెంచర్ల కోసం ముందుకు వచ్చే సంస్థలకు తదనుగుణంగా అనుమతులు ఇవ్వడం (3) ఈ వెంచర్ల ద్వారా వచ్చే సొమ్ములో డెవలపర్ నిష్పత్తి పోగా, మిగిలిన సొమ్మును  కోర్టులో ఎప్పటికప్పుడు జమ చెయ్యడం (4) వస్తున్న సొమ్మును కోర్టు-ప్రభుత్వాలు కలిసి, వివిధ దశల్లో బకాయీదార్లకు చెల్లించడం (5) నాలుగు సంవత్సరాల పరిధిలోపే ప్రతి ఒక్కరి బకాయీ తీర్చి, మొత్తంగా ఋణాల   విముక్తమవ్వడం (6) ఈ కార్యక్రమాలన్నీ హైకోర్టు పర్యవేక్షణలోనే జరగడం మొదలైన అంశాలు ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

నవంబర్ 4న హైకోర్టులో విచారణ

వచ్చే నవంబర్ 4వ తేదీకి హైదరాబాద్ హైకోర్టులో ఈ అంశం విచారణకు రానుంది. ఈ అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఇవన్నీ సవ్యంగా జరిగితే, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు సంపూర్ణంగా పరిష్కారమవుతాయని భావించవచ్చు. 2015 నుండి కేసులు, కోర్టుల నేపథ్యంలో ఇప్పటికే 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ సమస్య అత్యంత వేగంగా పరిష్కారమైతే, పలు రాష్ట్రాలలోని కొన్ని కోట్లమందికి న్యాయం జరుగుతుంది. జరిగి తీరాలి. ఈ నేపథ్యంలో, న్యాయస్థానం సంపూర్ణ పర్యవేక్షణలో కస్టమర్లు,ఏజెంట్ల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత విభాగాలు, అగ్రిగోల్డ్ యాజమాన్యం ఒక వేదికపైకి వస్తే పరిష్కారం వేగవంతమవుతుందని ఆర్ధికరంగ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కోట్లాది జీవితాలలో వెలుగు నిండాలి

కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నిండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య అగ్రిగోల్డ్ అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ.డి) కూడా దర్యాప్తు ప్రారంభించిందని సమాచారం. సంస్థ ఆస్తులు ఇప్పటికే హైకోర్టులో అటాచ్ మెంట్ లో ఉన్నాయి. ఏ సంస్థలు దర్యాప్తు చేసినా, అంతిమ  తీర్పులు  ఇచ్చేది న్యాయస్థానాలే. న్యాయస్థానాలు చట్టాలకు లోబడి, న్యాయమైన తీర్పులే ఇస్తాయి. త్వరలో అందరికీ న్యాయం జరగాలని ఆశిద్దాం. న్యాయం జరుగుతుందని విశ్వసిద్దాం.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles