ప్రముఖ రచయిత రాచకొండ వీర వెంకట విశ్వనాథశాస్త్రి శతజయంతి జరుపుకుంటున్నాం. 30 జులై 1922లో జన్మించిన రాచకొండ తన పదిహేనవ ఏట 1937లో ఎంఎన్ రాయ్ ని విశాఖలో కలుసుకున్నారు. రంగస్థల ప్రముఖుడు, లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు ఎంఎన్ రాయ్ ని వైజాక్ కు ఆహ్వానించారు. నాటి ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతి కట్టమంచి రామలింగారెడ్డికి పరిచయం చేశారు. అబ్బూరి వరదరాజేశ్వరరావు రామకృష్ణారావు కుమారుడు. కథారచయిత్రి స్వర్గీయ ఛాయాదేవి భర్త. వరదరాజేశ్వరరావూ, విశ్వనాథశాస్త్రీ మంచి మిత్రులు. వారిద్దరూ కలిసి రాయ్ ని కలుసుకున్నారు. అప్పుడు వరద, విశ్వనాథశాస్త్రి వైజాగ్ లోని ఏవీఎన్ కాలేజీ విద్యార్థులు.
నేను రాయిస్ట్ ని కనుక విశ్వనాథశాస్త్రి రాయ్ ని కలుసుకున్న తర్వాత ఏమన్నారో, ఏమి ఆలోచించారో, ఆయనపైన రాయ్ ప్రభావం ఉందో లేదో తెలుసుకోవాలనే కోరిక నాలో బలంగా ఉండేది. విశ్వనాథశాస్త్రి సోదరులు డాక్టర్ నరసింహశర్మ విశాఖ వాస్తవ్యులు. ఈ విషయమే నేను ఆయనను అడిగాను. ఆయన శ్రమకోర్చి విశ్వనాథశాస్త్రి డెయిరీలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని వివరాలు నాకు పంపించారు. డెయిరీలు తెలుగులో రాసుకున్నారు. నాకోసం వాటిని నరసింహశర్మ ఇంగ్లీషులోకి అనువదించి పంపించారు.
19 ఆగస్టు 1937న విశ్వనాథశాస్త్రి డెయిరీలో రాసింది: ‘ఎంఎన్ రాయ్ ని కలుసుకోవడానికి మేము వెళ్ళాం. యూత్ లీగ్ ఎగ్జిక్యుటీవ్ కమిటీ సభ్యులుగా మమ్మల్ని ఆయనకు పరిచయం చేశారు. ఆయన చాలా ఎత్తయిన మనిషి. జర్మన్ మాట్లాడినట్టు ఇంగ్లీషులో మాట్లాడారు. ఆయన ఇంగ్లీషు ఉచ్ఛారణపైన జర్మన్ భాష ప్రభావం బాగా కనిపించింది.
22 ఆగస్టు 1937: ఈ రోజు బీచ్ లో రాయ్ ఉపన్యాసం ఉంది. ఇండియాకు ప్రస్తుత పరిస్థితులలో సోషలిజం తగినటువంటి విధానం కాజాదని ఆయన చెప్పారు.
27 ఆగస్టు 1937, శుక్రవారం: చరిత్రపైన జరిగిన సమావేశానికి ఎంఎన్ రాయ్ అధ్యక్షత వహించారు. మా కాలేజీకి పిలవాలని అనుకుంటున్నామని మా ప్రిన్సిపాల్ కి చెప్పాం. ‘బాంబులు ఎట్లా తయారు చేయాలో ఆయన దగ్గర నేర్చుకోవాలని అనుకుంటున్నారా?’ అంటూ ప్రిన్సిపల్ మమ్మల్ని ఎద్దేవా చేశారు. మా ప్రిన్సిపాల్ చేసిన ఈ వ్యాఖ్యను ఎవరో ఎంఎన్ రాయ్ దగ్గరికి చేరవేశారు. తన ఉపన్యాసంలో ప్రిన్సిపాల్ ను రాయ్ చెడామడా విమర్శించారు.
18, 1937 (నెల రాయలేదు), శనివారం: ఎంఎన్ రాయ్ తో మేము దిగిన ఫొటోను ఈ రోజు నాకు ఇచ్చారు. ఫొటో బాగా వచ్చింది.
19 జులై 1938 ఎంఎన్ రాయ్ సీఎస్ పీ కి రాసిన లేఖలు చదవడం ప్రారంభించాను. చాలా హేతుబద్ధంగా, అర్థవంతంగా ఉన్నాయి లేఖలు.
23 జులై 1938: ‘ఇండిపెండెంట్ ఇండియా’ మేగజైన్ కు చందా కట్టాలని నేను అనుకుంటున్నాను.
24 జులై 1938, శుక్రవారం: ఈ రోజు ‘ఇండిపెండెంట్ ఇండియా’ మేగజైన్ కొన్నాను. ‘రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్’ (హక్కులూ, బాధ్యతలూ) పైనా ‘మాస్ కాంటాక్ట్’ (ఎక్కువమంది ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం) పైనా ఎంఎన్ రాయ్ రాసిన వ్యాసాలు అందులో ఉన్నాయి.
03 1938, శుక్రవారం (నెల నోట్ చేసుకోవడం మరచిపోయాను): ఎంఎన్ రాయ్ కీ, రవీంద్రనాథ్ టాగూర్ కీ సమాధానం చెబుతూ, గాంధీని సమర్థిస్తూ స్ప్రాట్ అనే వ్యక్తి ఒక వ్యాసం రాశాడు. అందరూ చదవదగిన వ్యాసం.
29 ఆగస్టు 1938, సోమవారం: ఎంఎన్ రాయ్ గురించి రాజేశ్వరరావు, ఎన్ వి రామారావు మధ్య చర్చ జరిగింది. ఎన్ వి రావుకు ఎంఎన్ రాయ్ అంటే బొత్తిగా ఇష్టం లేదు. ఎంఎన్ రాయ్ ను రాజేశ్వరరావు పొగుడుతూనే ఉన్నారు. ఎన్ వి రామారావు కాంగ్రెస్ సోషలిస్టు కానీ గాంధేయవాది కానీ కాదు. నేను మాత్రం గాంధేయవాదినే.
15 మే 1941: ఈ తేదీని మరోసార సరి చూసుకోవాలి: ఎంఎన్ రాయ్ గాంధీయిజం పైనా, నేషనలిజం (జాతీయవాదం)పైనా, సోషలిజం (సామ్యవాదం)పైనా పుస్తకం రాశారు. ఈ పుస్తకం నేను చదివాను. ఆయన విమర్శనాత్మకంగా రాశారు. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కొన్ని సందేహాలు తీరాయి.
(రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి డెయిరీలో ఎంఎన్ రాయ్ గురించి ఎంట్రీలలో ఇదే చివరిది.)
రాచకొండ విశ్వనాథశాస్త్రి బీఏ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివి, న్యాయశాస్త్రం మద్రాసులో అభ్యసించి న్యాయవాదిగా విశాఖపట్టణంలో స్థిరపడిపోయారు. మొదట్లో కాంగ్రెస్ వాదిగా ఉండేవారు. 1960 దశకంలో శ్రీకాకుళం వసంత మేఘగర్జన (నక్సలైట్ ఉద్యమం) తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావం ఆయనపైన పడింది. లాయర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతకంటే, తనకంటూ ప్రత్యేకమైన శైలి గల రాచయితగా దేదీప్యమానంగా వెలిగిపోయారు.
జనజీవితాన్ని నిశితంగా మనించిన రావి శాస్త్రి
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రజల జీవితాలను నిశితంగా గమనించారు. మానవత్వం కనిపించని సమాజంలో పేద ప్రజలు పడుతున్న కష్టాలు ఆయనను కదిలించాయి. గురజాడ, శ్రీపాద తర్వాత మాండలికంలో రచనలు ప్రారంభించారు. 1952లో రాసిన అల్పజీవి తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రయోగం. జేమ్స్ జాయిస్ రచనల తరహాలో తెలుగులో వచ్చిన మొట్టమొదటి నవల అదే. తొలి నవలతోనే జయప్రదమైన నవలారచయితగా రాచకొండ పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజు-మహిషి, రత్తాలూ-రాంబాబు రాశారు. ఇల్లు అనే నవల కూడా రాశారు. అదే చివరిది. మధ్యతరగతి తెలుగు కుటుంబాల సమస్యలే ఇతివృత్తంగా తీసుకొని అందరికీ అర్థం అయ్యే విధంగా మాండలికాలు చొప్పించి రాసిన రాచకొండకు మంచి నవలా రచయితగా తెలుగు సాహితీలోకం పెద్దపీట వేసింది. ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న మద్య విక్రయ విధానాన్ని అపహాస్యం చేస్తూ ఆయన ‘ఆరుసారా కథలు’ అనే కథల పరంపర రాశారు. కథాసాగరం, రాచకొండకథలు, బానిసకథలు అనే సంపుటాలు వెలువడినాయి. గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్మలు పోనాయండి, బంగారం, కలకంఠి, రుక్కులు ఆయన రచనలలో ముఖ్యమైనవి. నిజం, తిరస్కృతి, విషాదం నాటకాలు కూడా రచించి రక్తికట్టించారు. నిజం నాటకంలో చాలా సార్లు కళాకారుడి పాత్ర పోషించారు. 10 నవంబరు 1993న ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు.