వోలేటి దివాకర్
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి … బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును, దానికి అనుబంధంగా నిర్మిస్తున్న 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన అధికారులు, సిబ్బంది పోలవరం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలోనే ఎందుకు తమ నివాసాలను నిర్మించుకుంటున్నారు? వారికి ప్రాజెక్టు భద్రతపై ఏవైనా అనుమానాలు ఉన్నాయా? ఒకవేళ పోలవరం ప్రాజెక్టు కొట్టుకునిపోతే పరిస్థితి ఏమిటి?
డ్యామ్ బ్రేక్ అనాలిసిస్
చైనాలో నదులపై నిర్మించిన భారీ ఆనకట్టలు కొట్టుకునిపోయి ఊళ్లకు ఊళ్లు జలసమాధి అయ్యాయి . సాధారణంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించినపుడు ఒకవేళ ప్రాజెక్టులు కొట్టుకొనిపోతే పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చన్న దానిపై ముందుగానే అధికారులు సమగ్రమైన పరిశీలన జరిపి, ఒక నివేదికను సిద్ధం చేస్తారు. అలాగే పోలవరంపై కూడా అదే తరహాలో డ్యామ్ బ్రేక్ అనాలసిస్ ను రూపొందించారు. దీని ప్రకారం ఒక వేళ పోలవరం ప్రాజెక్టు కొట్టుకొనిపోతే ప్రాజెక్టు దిగువన ఉన్న రాజమహేంద్రవరం, నర్సాపురం, అంతర్వేది వరకు ఉన్న గ్రామాలు, పట్టణాలు జలసమాధి అవుతాయని అంచనా వేశారు.
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దిగువ కాఫర్ డ్యాం , డయాఫ్రంవాల్ దెబ్బతినడం, ఎర్త్ ఫిల్ రాక్ఫెల్ డ్యాం ప్రధాన ప్రాజెక్టులో లీకేజీలను గుర్తించనట్లు వార్తలు రావడంతో సహజంగానే పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు తలెత్తడం సహజం. ప్రాజెక్టులో లీకేజీల విషయం అటు ప్రభుత్వ పెద్దలకు, ఇటు ఇరిగేషన్, జలశక్తి సంఘం అధికారులకు కూడా తెలుసన్నది బహిరంగ రహస్యం. అయినా, వారేమీ దీనిపై బహిరంగంగా నోరుమెదపడం లేదు. పోలవరం ప్రాజెక్టు నాణ్యతపై స్పష్టమైన హామీ ఇస్తే తప్ప దీనిపై వస్తున్న ఊహాగానాలను నిరోధించడం కష్టమే. నిర్మాణ లోపాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు మరో దశాబ్దం వరకు పూర్తి అయ్యే అవకాశాలు లేకపోవడం కొంత ఊరటనిచ్చేలా కనిపిస్తోంది.
ఎగువ కాఫర్ డ్యాం పరిస్థితి ఏమిటీ ?
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి నదికి ఎగువ, దిగువల్లో కాఫర్ డ్యాంలు నిర్మించి, ప్రధాన ప్రాజెక్టును నిర్మిస్తారు. అయితే, దిగువ కాఫర్ డ్యాం దెబ్బతిని ఉండటం, మరోవైపు గోదావరికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ వరద నీరు దిగువ ప్రాంతాలను ఒక్కసారిగా చుట్టుముడుతోంది. కాఫర్ డ్యాంల నిర్మాణం జరగనపుడు వరద నీటి ప్రవాహం కొంత ఆలస్యమయ్యేదని ఇరిగేషన్ రంగ నిపుణులు చెబుతున్నారు. 1986 లో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. దీంతో 36 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉంది.
అయితే, ఈసారి గోదావరిలో 30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యాంను 28.5 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యాం కన్నా ఎత్తులో వరద నీటి ప్రవాహం వస్తే పరిస్థితి ఏమిటనే దానిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును తాత్కాలికంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గోదావరికి 1986 నాటి స్థాయి వరదలు వస్తే తప్ప భయపడాల్సిన పనిలేదనీ, ప్రతీ ఏటా వరదలు వచ్చినపుడు దిగువ ప్రాంతాలు, లంక గ్రామాలు ముంపునకు గురవడం సహజమనీ, దీనిపై పెద్దగా ఆందోళన అవసరం లేదనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.