(శ్రీలత)
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అగ్ర నాయకులు మాజి మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మాజి ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దారెటన్న చర్చ జిల్లాలో బలంగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న మాజి మంత్రి తుమ్మల నాగేశ్వరావు. పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ నిరాకరణ కు గురైన ఖమ్మం మాజి పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఎమ్మేల్సీ ఎన్నికల్లో ఇద్దరి పాత్ర ఎలా ఉండబోతుంది అన్నదానిపై అధికార పార్టీ లో విసృతంగా చర్చ సాగుతుంది. విజయావకాశాలపై టిఆర్ఎస్ శిబిరం ఎటూతేల్చుకోలేక గుంభనగా వ్యవహరిస్తుంది. ఇతర పార్టీల్లో గెలిచి టిఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్న ఎమ్మేల్యేల తీరుతో పార్టీలో పాత కాపులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మాజి మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాజి ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు ఎమ్మేల్సీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తారా అన్న ప్రశ్నకు అధికార పార్టీ లో మౌనమే సమాదానం కనిపిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో 9 తొమ్మిది స్థానాల్లో టీఆర్ ఎస్ ఓటమి చవిచూసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ముఠా విభేదాలే కారణమని సాక్షాత్తు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమికి ఎవరు బాద్యులనే దానిపై ఎక్కడ సమీక్షలు చేశారు, ఎవరిపై చర్యలు తీసుకున్నారంటే సమాధానం లేదు. ఎన్నికలకు ముందు వరకు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ ఇద్దరు నాయకులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కనుసన్నల్లో పార్టీ యంత్రాంగం నడుస్తుంది. జిల్లాలో అధికార మార్పిడి జరిగిన తరువాత వస్తున్న ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత వస్తున్న ఎన్నికలు కావడం ప్రభుత్వ పని తీరు పట్ల యువ ఓటర్లు ఏవిదంగా స్పందిస్తారనే భయం ఓ వైపు అధికార పార్టీని వెంటాడుతోంది. అయితే తుమ్మల, పొంగులేటి రాజకీయ భవిష్యత్ పై పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చే హామిపై ఆధారపడి ఇద్దరి నిర్ణయాలుండే అవకాశం కనిపిస్తుంది.