Tuesday, December 24, 2024

చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ఏమిటి?

( బండారు రాం ప్రసాద్ రావు)

రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం శాశ్వత శతృత్వం ఉండదంటారు. ఇప్పుడు మితృత్వం చేద్దామన్నా చంద్రబాబు నాయుడు గారికి కాలం కలిసి రావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు అవమానభారం తో కుంగి పోతున్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో మునుపెన్నడూ లేనంతగా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్ని ప్రసంశలు అందుకున్నారో అన్ని విమర్శలు ఎదురుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించి, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకునే వరకూ, తదనంతరం రాష్ట్ర విభజనలో రెండు కళ్ళ సిద్దాంతం ప్రతిపాదించడం వల్ల ఇరు రాష్ట్రాల్లో చంద్రబాబు ప్రతిష్ట మసగ బారింది. ఆంధ్రప్రదేశ్ లో 2014లో విజయం బీజేపీ, పవన్ కల్యాణ్ లతో పొత్తు కారణమే కానీ సొంతబలం వల్ల వచ్చింది కాదు.

అస్తిత్వపోరాటం:

డెబ్భై ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఇవ్వాళ్ళ రాజకీయ అస్తిత్వ పోరాటం చేస్తున్నారు. సొంత చిత్తూరు జిల్లాలో తిరిగి గ్రేటర్ రాయలసీమ, ఉద్యమం, విభజన తరువాత అమరావతి రాజధాని పై నీలినీడలు ప్రతిపక్ష నాయకుడిగా ఏకాకి కావడం, నమ్ముకున్న అనుచరులు పార్టీని వీడడం, ఇటు హైదరాబాద్ అటు విజయవాడ మధ్య తిరుగుతూ రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రతిష్ట దిగజారి పోయి, అవమాన భారం తో మైనగంభీరంగా ఉన్న చంద్రబాబు కు కేంద్రం లో కూడా చుక్కెదురే. బిజెపి చంద్రబాబు ఉనికిని గుర్తించకపోవడం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీప దూరంలో లేక పోవడంతో రాజకీయ గ్రహణం తో అల్లాడుతున్న చంద్రబాబు కింకర్తవ్యం అనుకుంటూ కొట్టు మిట్టడుతున్నారు.

తెలంగాణలో ఆంధ్ర పార్టీగా ముద్ర:

ఒక వైపు తెలంగాణలో ఆంధ్ర పార్టీగా ముద్రపడ్డ తెలుగు దేశం ఉనికే ప్రశ్నార్థకం అయితే, ఆంధ్రలో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మధ్య కులాల పోరు, ప్రాంతీయ తత్వాలు జోరందుకున్నాయి. ఈ దశలో తన స్వరం ఎటు వైపు వినిపించినా ఉన్న పరపతి పోతుందనే నేపథ్యంలో ఒక అమరావతి రాజధాని విషయంలో మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతూ, అమరావతిని కాపాడమని మొరపెట్టుకునే దీన స్థితి చంద్రబాబుకు ఎదురైంది. తన అడుగులకు మడుగులోత్తి అనుచరులుగా మెలిగిన వారు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పక్షాన చేరి నిండు శాసనసభలో అవమానపరుస్తూ మాట్లాడుతుంటే చంద్రబాబు కు కన్నీళ్లు వస్తున్న మాట వాస్తవం.

కుర్రకారు దాడులతో సతమతం:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబును తిట్టినప్పుడు కూడా గుంభనంగా ఉన్నారు. కానీ యువకులైన జగన్ వర్గం నాయకులు చంద్రబాబు ను తిడుతున్న తిట్ల వల్ల రాజకీయ సన్యాసం తీసుకునేలా అవమానాలు భరిస్తున్నారు. 28 ఏళ్ల వ‌య‌సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పిన్న వ‌య‌స్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా చంద్రబాబునాయుడు పేరు తెచ్చుకున్నారు. 1999 లో ఆయ‌న నేతృత్వంలోని టీడీపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో 294 సీట్ల‌కు గానే 185 స్థానాలు, 42 లోక్‌స‌భ సీట్ల‌కు గానూ 29 సీట్లు సాధించి, ఎన్‌డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. 2003 లో జ‌రిగిన మందుపాత‌ర దాడి నుంచి ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ దాడిలో ఆయ‌న మెడ ఎముకలు, త‌ల‌కు గాయాల‌య్యాయి

ఇది చదవండి: పార్టీ బలోపేతానికి చంద్రబాబు కసరత్తు

కష్టపడి పైకి వచ్చిన చంద్రబాబునాయుడు:

త‌న బాల్యంలో పాఠ‌శాల‌కు వెళ్లేందుకు, తొమ్మిదో త‌ర‌గ‌తి వర‌కు ఆయ‌న ప్ర‌తిరోజూ 11 కిలో మీట‌ర్లు న‌డిచి వెళ్లేవారు. 1992 లో ఆయ‌న హెరిటేజ్ సంస్థ‌ను స్థాపించారు. ఆ సంస్థ ప్ర‌స్తుతం ద‌క్షిణ భార‌త దేశంలో అతి పెద్ద ప్రైవేట్ డెయిరీల‌లో ఒక‌టిగా ఉంది. బాలకృష్ణ పెద్దకూతురు బ్రాహ్మణిని తన కుమారుడు లోకేష్ కు చేసుకోవడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబంతో విడదీయరాని అనుబంధం ఏర్పరుచుకున్న చంద్రబాబు భవిష్యత్ రాజకీయ జీవితం పై మదన పడుతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలు తనకు రాజకీయంగా గ్రహణ విముక్తికి దోహదం చేస్తాయా అని ఎదురి చూస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఆయన రాజకీయ ఓటు బ్యాంక్ కు గండిపడింది. అటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అనుచర వర్గం అంతా జగన్ మోహన్ రెడ్డి శిబిరంలోకి వెళ్ళడం, రాయలసీమ జిల్లాల్లో రెడ్డి వర్గం దూరమవడం వల్ల ఇప్పుడు చంద్రబాబుకు సమీప ఎన్నికల్లో విజయం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. కమ్మ వర్గాలు కూడా తమ రాజకీయ ఆర్థిక సామాజిక అస్తిత్వం కోసం జగన్ వర్గంలోకి వలస వెళ్ళడం వల్ల ఇప్పుడు చంద్రబాబు ఒంటరి పోరాటం చేస్తున్నారు.

అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న రాజగురువు:

కొడుకు లోకేష్ కు రాజకీయ పరిజ్ఞానం అంతంతే కావడం, భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి హెరిటేజ్ వ్యవహారాల్లో తకమునుకలు కావడం, ఒకప్పటి రాజకీయ గురువు, పత్రికాధిపతీ రామోజీ రావు కూడా అంటీముట్టనట్టు వ్యవహరించడం వల్ల చంద్రబాబు రాజకీయ గ్రహణం ఎప్పుడూ వీడుతుందొ అర్థం కాని పరిస్థితులున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబుకు అగ్నిపరీక్ష. బలం కూడగట్టుకొని గౌరవప్రదమైనన్ని స్థానాలు గెలుచుకుంటారో లేక 2019 ఎన్నికల నాటి పరిస్థితే ఎదురవుతుందోనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తితో గమనిస్తున్నారు. ప్రతిపక్షంలో, తగ్గిన బలంతో ఉన్నప్పటికీ పార్టీ పునర్నిర్మాణాకికి చంద్రబాబునాయుడు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. మానవప్రయత్నానికి అదృష్టం కూడా కలసి వస్తేనే విజయం సమకూరుతుంది

ఇది చదవండి: అమరావతిపై రెఫరెండానికి రెడీనా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles