మాశర్మ
(జర్నలిస్ట్, కాలమిస్ట్)
న్యాయాన్ని కాపాడుకుంటే న్యాయం సమాజాన్ని రక్షిస్తుంది
ఇందిర, నీలం భిన్న మార్గాలు
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ ప్రధానం
అడుగడుగునా అడ్డంకులంటున్న ప్రభుత్వం
“ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః – తస్మాత్ ధర్మో న హంతవ్యో, మానో ధర్మో హతో వధీత్”, అన్నది ఆర్యోక్తి. చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాడిని చంపుతుంది, రక్షింపబడిన ధర్మం ఆ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది, కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి. ఇది ఈ పూర్తి శ్లోకానికి పూర్తి తాత్పర్యం. ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం లోకంలో చాలా ప్రసిద్ధం. ధర్మాన్ని మనం రక్షిస్తే, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అదే సూక్తి న్యాయానికీ వర్తిస్తుంది. న్యాయాన్ని మనం రక్షిస్తే, ఆ న్యాయం మనల్ని రక్షిస్తుంది. లేకపోతే, ఏదో ఒక రోజు అది భక్షించి తీరుతుంది. కాలానికి ఎవ్వరూ అతీతులు కారు. తాత్కాలికంగా పదవులు దక్కినా, సుఖాలు చెంతకు చేరినా, గౌరవ సత్కారాలు వరించినా, ఏదో ఒకరోజు కాలమనే ధర్మక్షేత్రంలో శిక్షలు పడక తప్పవు. అవి జైలు శిక్షలే కానక్కర్లేదు. రకరకాల రూపాల్లో అవి చుట్టుముట్టి తీరుతాయి. ఏదో రూపంలో శిక్ష తప్పనిసరిగా పడుతుంది.అలా పడకుండా వెళ్లినవారు చరిత్రలో చాలా అరుదు.ఎందరో ప్రముఖులు కొంతకాలం వెలిగినా, చివరకు అపకీర్తిని మూటగట్టుకొని మూల్యం చెల్లించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి -ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థకు మధ్య మొదలైన విపరీత పరిణామాలను దేశం చాలా ఏకాగ్రతగా గమనిస్తోంది. భారతదేశంలో 1952లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండీ పరిశీలిస్తే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ అత్యున్నత న్యాయస్థానానికి ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిపైనా, కొందరు న్యాయమూర్తులపైన, ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి పైనా ఆరోపణలు చేస్తూ ఇటువంటి ఉత్తరం రాయలేదు. ఇది అత్యంత సాహసం. సంచలనం. ప్రప్రథమం.
రెండు వ్యవస్థల మధ్య యుద్ధం
దీని పర్యవసానాలు ఎలా ఉండబోతాయో అని దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగువారు అత్యంత ఉత్కంఠగా చూస్తున్నారు. రాజ్యంగంలోని ప్రధానమైన రెండు వ్యవస్థల మధ్య విభేదాలు కొత్తవి కాకపోయినా, నేటి పరిణామం సరికొత్తది. ఇది చాలా బాధాకరం. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు రాష్ట్ర న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు అనే మాట ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రధాన ప్రతిపక్షానికి అనుకూలంగా న్యాయమూర్తులు సైతం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, వారి మధ్య ఎన్నో పరస్పర ప్రయోజనాలు ఎంతోకాలం నుండి ఉన్నాయనే అంశాలతో కూడిన ఈ లేఖాస్త్రం పెను సంచలనంగా మారింది. ప్రభుత్వాలకు, ప్రభుత్వాధినేతలకు వ్యతిరేకంగా తీర్పులు రావడం కొత్త విషయం కాదు. ప్రభుత్వ ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పులు రావడం, ప్రభుత్వం వేస్తున్న, వేయాలనుకుంటున్న ప్రతి అడుగును అడ్డుకోవడం ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో సంభవిస్తున్నట్లుగా ఎక్కడా జరగలేదని విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయం చట్ట బద్ధంగా, న్యాయ సమ్మతంగా, ప్రజాహితంగా లేదా? అన్నది సమగ్రంగా చర్చకు రావలసిందే. ప్రభుత్వాధినేతలుగా పేరెన్నికగన్న ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి మొదలైనవారికి కోర్టు తీర్పుల అంశంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 1975లో అలహాబాద్ హైకోర్టు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాయబరేలీ నుంచి ఎన్నిక కావడంలో నిబంధనలు ఉల్లఘించారని నిర్ణయించి, ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది.
ఆత్యయిక పరిస్థితి
ఆ తరుణంలో, ఇందిరాగాంధీ పదవి నుండి వైదొలగి,సుప్రీం కోర్టుకు వెళ్లకుండా, దేశంలో ఎమర్జెన్సీ విధించారు.1996లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపోయి, పార్టీ ఫండ్ కూడా దక్కించుకోలేని పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ సందర్భంలో రామారావును కాదని చంద్రబాబుకు పట్టం కట్టడం సరియైన నిర్ణయమేనని జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆ కాలంలో, అప్పటి న్యాయమూర్తులను ప్రభావితం చేశారని యన్ టి రామారావు పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఆర్ టి సి బస్సు రూట్లను ప్రైవేటీకరించిన వ్యవహారంలో అప్పటి హైకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిన కారణంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి నిర్ణయాన్ని కోర్టు ఆక్షేపించింది. కాకపోతే, అధిష్ఠానం ఆదేశించిన తర్వాతే ఆయన గద్దె దిగారు. ఇలా, గతంలో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి కోర్టుల నుండి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిణామాలు గతంలో ఎన్నడూ ఎక్కడా సంభవించలేదు.
ప్రజల విశ్వాసం ప్రధానం
రాజకీయ వ్యవస్థలపైన ప్రజలు ఇప్పటికే నమ్మకాన్ని కోల్పోయారు. అవినీతిమైన వ్యవస్థల పట్ల అసహనంగా ఉన్నారు. అత్యంత ముఖ్యమైన న్యాయవ్యవస్థ తన గౌరవాన్ని తాను నిలబెట్టుకోవడంలో విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం ఎదురైందనే చెప్పాలి. న్యాయమూర్తి అనే పదం చాలా విలక్షణమైంది.ధర్మం, న్యాయం మూర్తీభవించిన వ్యక్తులే న్యాయమూర్తులుగా ఉండాలి. తప్పుపాఠం చెబితే విద్యార్థులకు తప్పుజ్ఞానం అందించిన తప్పు ఆ అధ్యాపకుడిదే అవుతుంది. తప్పువార్త రాస్తే, సమాజానికి తప్పుడు సమాచారం అందించిన తప్పు ఆ పత్రికకే చెందుతుంది. అన్యాయమైన తీర్పులు ఇస్తే, ఆ అన్యాయానికి, ఆ తప్పుకు బాధ్యుడు ఆ న్యాయమూర్తే అవుతారు. భగవద్గీత/బైబిల్/ఖురాన్ మీద ఒట్టేసి చెబుతున్నాను, అన్ని నిజాలే చెబుతాను అని బోనులో ఉన్న వ్యక్తితో న్యాయస్థానంలో ప్రమాణం చేయిస్తారు. రాగద్వేషాలకు అతీతంగా, చట్టానికి లోబడి, ధర్మబద్ధంగా న్యాయమైన తీర్పులు ఇస్తామని న్యాయమూర్తులు కూడా ప్రమాణం చేసుకుంటారు. అది నిజామా? కాదా? అన్నది వారి మనస్సాక్షికే తెలుస్తుంది.
న్యాయమూర్తుల ఎంపిక
రాజ్యంగంలో మహోన్నతంగా భావించే న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులను ఎంపికచేసే విధానం మారాలని మేధావులు ఎప్పటి నుండో ఘోషిస్తున్నారు. ఆశ్రితులకే పదవులు దక్కుతున్నాయని, బంధుప్రీతి రాజ్యమేలుతోందని, అర్హత, ప్రతిభలు మృగ్యమవుతున్నాయనే విమర్శలు కలీజియం వ్యవస్థపై ఎప్పటి నుండో వస్తున్నాయి. న్యాయమూర్తుల నియామకానికి ఒక సంస్థను ఏర్పాటుచేసి, దాని ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో చేసిన ప్రయత్నం ఫలించలేదు, ఇంతవరకూ అది కార్యరూపం దాల్చలేదు. ఐ ఏ ఎస్, ఐ పి ఎస్, ఐ ఆర్ ఎస్, ఐ ఎఫ్ ఎస్ లాగానే న్యాయమూర్తుల ఎంపికకు ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించాలని నిపుణులు పలు సందర్భాల్లో సూచించారు. ఇప్పటికీ, సీనియర్ న్యాయమూర్తుల బృందం (కలీజీయం) మాత్రమే న్యాయమూర్తులను నియమించే ఆచారం కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న నియామక విధానంలో సమూలమైన మార్పులు రావాల్సిందే. ప్రతిభ,సంపూర్ణమైన అర్హత, మచ్చలేని చరిత్ర మొదలైన అంశాల ప్రాతిపదికనే న్యాయమూర్తుల నియామకం జరగడం చాలా ముఖ్యం.న్యాయ విచారణ ప్రక్రియ ఆమూలాగ్రం రికార్డ్ అవ్వాలి.కోర్టు విచారణకు సంబంధించిన సమగ్రమైన రాతప్రతులు, మౌఖికంగా చేసే వ్యాఖ్యలు, కోర్టు గదిలో చేసే ప్రకటనలు యధాతథంగా, ఆడియో/వీడియో రూపంలోనూ రికార్డు అవ్వాలి, అవన్నీ అందుబాటులో ఉండాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. న్యాయమూర్తుల ఎంపికలో, విచారణా ప్రక్రియలో, తీర్పుల విధానంలో పారదర్శకత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయమూర్తులపై కూడా నిరంతర తనిఖీ, దర్యాప్తు చేసే వ్యవస్థ కూడా నిర్మాణం జరగాలని మేధావులు సూచిస్తున్నారు. న్యాయమూర్తి తప్పు చేస్తే, పార్లమెంట్ లో అభిశంసన ద్వారా ఆ వ్యక్తిని తొలగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఏమి జరుగుతుందో మరి
భారతదేశంలో ఇటువంటిది ఇంతవరకూ చోటుచేసుకోలేదు. భవిష్యత్తులో జరుగుతుందేమో చూడాలి. వ్యవస్థలను అన్యాయంగా ప్రభావితం చేసే వ్యవస్థలు పోనంతకాలం దేశాలు బాగుపడవని రాజనీతి, పరిపాలనా తత్వవేత్తలు ఎప్పటి నుండో ఆవేదన చెందుతున్నారు. ప్రజావ్యతిరేక, అప్రజాస్వామ్య నిర్ణయాలు తీసుకునే అంశాల విషయంలో ప్రభుత్వాలను న్యాయవ్యవస్థలు నిలదీయాల్సిందే.ఆ నిర్ణయాలను అడ్డుకోవాల్సిందే. ఆ తీరున, న్యాయమూర్తులు న్యాయం పట్ల నిలుచోవలసిందే. ప్రజల చేత ఎంపిక కాబడిన ప్రజా ప్రతినిధులు సర్వ ప్రజాహితంగానే పరిపాలన సాగించాలి. రాజ్యంగంలో కీలకమైన శాసన-కార్యనిర్వాహక-న్యాయవ్యవస్థలు అదుపు దప్పరాదు. రాజ్యంగ హక్కులకు భిన్నంగా ప్రవర్తించరాదు. వ్యవస్థలను నడిపేది కూడా వ్యక్తులే. వ్యక్తుల సమూహమే. ఇవన్నీ ధర్మబద్ధంగా, ప్రజాహితంగా ఉండకపోతే ప్రజల్లో ఏదో ఒకరోజు తిరుగుబాటు వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం -న్యాయవ్యవస్థ మధ్య జరుగుతున్న ఈ పోరు ఎటు దారితీస్తుందో, ఈ పరిణామాల్లో సుప్రీం కోర్టు ఎటువంటి విచారణ చేపడుతుందో, ఆరోపణలను ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ తీరున ప్రతిస్పందిస్తుందో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండబోతుందో వేచిచూడాల్సిందే.