* సన్యాసిగా సంఘ పరిరక్షణ చేయడం
* ఆధ్యాత్మిక చింతనతో సమాజాన్ని మార్చడం
* అన్ని సుఖాలూ త్యజించడం అందరికీ సాధ్యం కాదు
* ఎన్టీఆర్ సన్యాసం కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది
పెళ్ళాం పిల్లల మీద కోపం వస్తే సన్యాసం స్వీకరిస్తాను అనే మాటలు చాలా ఇండ్లలో వినిపిస్తాయి. నేను ఈ రోజు ఒక స్వామి (సన్యాసి) వెంట చాలా సేపు నడిచాను… ఆయన హావభావాలు పరిశీలించాను…అమ్మో సన్యాసం అంటే ఇంత కఠోర దీక్ష అనుకుని కాషాయ వస్త్రాలను చూస్తేనే భయం వేసింది. ఇంతలో ఒక రాజకీయ నాయకుడు నాతో కలసి వచ్చి “స్వామి వారు ఇహపర సుఖాలను వదిలి సంసార బాదరబందీ నుండి విముక్తి కావడానికి మార్గం ఏమిటీ” అన్నాడు! “సన్మార్గం” అన్నాడు స్వామి…. అంతే రాజకీయ దుర్మార్గుడు అక్కడ ఉంటే ఒట్టు!
సన్యాసం ఆషామాషా?
క్షణికావేశంలో సన్యాసం తీసుకుని ఉప్పుకారం తినకుండా ఎవరు ఉండగలరు? సన్యాసం అంటే ఆషామాషా? బహుశా 1985 సంవత్సరం అనుకుంటా…అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తిరుపతి ఫిలింఫేర్ పంక్షన్లో కాషాయ వస్త్రాలతో దర్శనం ఇచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. స్వామి అగ్నివేశ్ ఆ కాలంలో ఎన్టీఆర్ ను కలసి హితబోధ చేయడం వల్ల కాషాయ వస్త్రాలు ధరించారని చెబుతారు. ఎన్టీఆర్ మాత్రం ముక్కు పచ్చలారని బాలికపై అత్యాచారం జరిగిందనే ఖేదంతో తాను స్వచ్ఛమైన పాలన అందించడానికి కాషాయ వస్త్రాలు ధరించానని చెప్పుకొచ్చారు. సన్యాసిగా పాలన ఏలా అంటే తనను తాను “రాజయోగి” అని ప్రకటించుకున్నారు. తదనంతరం 1993 లో లక్ష్మి పార్వతి ని పెళ్లి చేసుకున్నాక కాషాయం వదిలించుకుని గృహస్థు జీవితం లోకి వచ్చారు. అంతటి గొప్ప నాయకుడే మళ్ళీ సంసార సుఖంలోకి వచ్చినప్పుడు… ఊరికే సన్యాసం స్వీకరించడం అంటే పాముతో చెలగాటం అడడమే. ఎక్కడ దోషాలు చేసినా సన్యాస దీక్షకు మూల్యం చెల్లించు కోవాల్సిందే.
Also Read : అహంకారం ఒక అంధకారం… అదే పతనానికి హేతువు
కమలం మాదిరి బురదలో ఉంటూనే స్వచ్ఛంగా ఉండాలి
ఒక జర్నలిస్ట్ గా సంసారం…సన్యాసం గురించి లోతుగా స్వామి గారిని చర్చల్లోకి దించాను…ఆయనకు కోపం తెప్పించాలని చూశాను… నా పిచ్చి గానీ ఆయనకు కోపం వస్తే సన్యాసి ఎందుకవుతాడు? చిరునవ్వుతో నాకు జవాబిచ్చాడు. “స్వామీ, ఈ ప్రపంచం పట్ల వైరాగ్యమా లేక సంసార సుఖం పట్ల వైరాగ్యమా? అన్నాను. స్వామి నన్ను తేరిపార చూశారు. చిరునవ్వుతో జ్ఞానం గురించి విడమరిచి చెప్పారు. అగ్ని ద్వారా సత్యాన్ని మండిచాల్సిన అవసరం ఉంది…అప్పుడు మనలోని చైతన్యంలో నిండిన సంపూర్ణ జ్ఞానం అగ్నిని పట్టుకుంటుంది. నిజమైన కాంతి అన్ని అజ్ఞానాలనూ బూడిదిగా వెలుగుతుంది అన్నారు. నాకు అర్థం కాలేదు స్వామీ ఇంకా కాస్త వివరంగా చెప్పండి అన్నాను…అదే చిరునవ్వుతో సర్వసంగ పరిత్యాగిగా మారాలంటే కమలం పువ్వు లాగా తేలుతూ, బురద మురికి నీటితో పెరిగినప్పటికి ఏ మలినాలను తాకదు ..ఈ ప్రపంచంలో స్పష్టతగా జీవించాలంటే “జీవిత స్పష్టత’ ఉండాలి అన్నారు. సంపూర్ణ జ్ఞానం పొందే ప్రయాణం శాశ్వత మైంది అన్నారు. అసలు సన్యాసుల్లో ఎన్ని రకాల వారు ఉంటారు స్వామి అన్నాను. వారు ఆచరించే పద్ధతులు ఏమిటీ అని అడిగాను. మంచి ప్రశ్న వేశారు అన్నారు. కొద్దిగా నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది.
సన్యాసులలో ఎన్ని రకాలు?
స్వామి చెబుతున్నారు…వైరాగ్య సన్యాసం మొదటిది…వ్యర్థమైన విషయం వినడం చూడడం పై ఆసక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లిగా అనాసక్తి మొదలవుతుంది. రెండోది జ్ఞాన సన్యాసం…సత్ సాంగత్యం ద్వారా లౌకిక వాంఛలు తగ్గిపోయి సత్య అసత్య విచక్షణ తో జ్ఞానం తో నిత్యకర్మలు ఆచరిస్తూ ఏది తనకంటకుండా నివసించే వారు…మూడోది జ్ఞాన వైరాగ్యం సన్యాసం సాధన ద్వారా ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తాను అన్వయించుకొని నిత్యం ఆనంద స్థితిలో జీవించడం. నాల్గవది కర్మ సన్యాసం బ్రహ్మ చర్యం, గృహస్థు, వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు ఆచరిస్తూ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేస్తూ వెళ్లపోవడం. అప్పటికి నా నడక మూడు కిలోమీటర్లు. ఆగిన దగ్గర ఒక గుళ్లో స్వామి వారు ఆధ్యాత్మిక ప్రవచనంలో ఉంటే నేను ఆకలేసి అరటి పండ్లు తిన్నాను.
Also Read : దృతరాష్ట్ర ప్రేమతో కిరాతకులు అవుతున్న పుత్ర రత్నాలు
జీవితాశ్రమాల్లో నాలుగు రకాలు
శ్రద్ధగా ఆయన ప్రవచనం వింటున్నాను. నా ప్రశ్నలకు సంబంధించిన విషయంగా భావించి చెవులు రిక్కించాను…సన్యాసమా? వైరాగ్యమా అని ఒక భక్తుడు అడిగాడు. జీవిత ఆశ్రమాల్లో నాలుగు రకాలు..బ్రహ్మచర్యం, గృహస్థు ఆశ్రమం, వానప్రస్థం, సన్యాసం …బ్రహ్మచర్యంలో విద్యా వ్యాసంగాలు చేయాలి…ఆ తరువాత గృహస్థు ఆశ్రమంలో సంసార జీవితం గడపాలి…వాన ప్రస్థం లో సంసారిక సంసార జీవితాన్ని విరమించి అడవులకు వెళ్లి వనవాస వ్రతాన్ని పాటించాలి..తపస్విగా జీవితం ఉండాలి… ఇక సన్యాసంలో సంపూర్ణ వైరాగ్య భావంతో సంసార జీవితాన్ని పూర్తిగా త్యజించాలి. వానప్రస్థం, సన్యాసం దశల్లో ఎలాంటి వాంఛలు ఉండొద్దనేది ప్రవచనం సారాంశం. నా పక్కన కూర్చున్న వారు తన్మయత్వంతో స్వామి గారికి భజనతో కీర్తనలు పాడుతున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఇక సంసార ఙివితం వద్దని వచ్చారా? లేక స్వామి వారి బోధనలు వినడానికి వచ్చారా? అని అనుమానం వచ్చింది.
మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ కదూ?
పెద్దగా గడ్డం పెంచి తన్మయత్వం తో భజన చేస్తున్న ఒక భక్తుణ్ణి తేరిపారా చూశాను. ఎక్కడో చూసినట్టు అనిపించింది. “సార్ మీరు…ప్రిన్సిపల్ సెక్రటరీ కదూ’’ అన్నాను… నవ్వి ఆయన అవును. ఆ ముఖ్యమంత్రి కాలంలో పని చేశాను… “సార్ మీరు మూడు జిల్లాల కలెక్టర్ గా పనిచేసి గొప్ప పేరు తెచ్చుకున్నారు”…”సెక్రటేరియట్ లో మా జర్నలిస్ట్ లకు బాగా గౌరవం ఇచ్చే వారు” అన్నాను. అది ముప్పై ఏళ్ల క్రింది మాట… ఇప్పుడు నా వయసు ఎనభై రెండు…భార్య పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు…నేను స్వామి వారి సేవలో తరిస్తున్నాను అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది… భారత రాజకీయ పరిపాలనా రంగాన్ని అవపొసనం పట్టిన ఒక ఐఏఎస్ అధికారి భక్త బృందంలో చేరడం .. స్వామి గారి నిష్ఠ చూస్తే భారతీయ సనాతన ధర్మానికి వారే వారధులు అనిపించింది.
Also Read : ఆడపడుచుల పుట్టింటి మమ ‘కారం’ !
పరివ్రాజకుడు ఒకచోట విశ్రమించడు
మళ్ళీ నడక మొదలయింది. స్వామి గారు నా కోసం చూస్తున్నట్టు సైగ చేశారు. మీరు ఏదో అడగాలి అనుకుంటున్నారు అడగండి అన్నారు. ఎనమిది నెలల పాటు భిక్షాటన, యజ్ఞ యాగాదులు చేసే మీరు ఏ ఊళ్ళో కూడా మూడు పూటలు ఉండరు కదా, చాతుర్మాస్య దీక్ష లో ఆ నాలుగు మాసాలు మీరు విశ్రాంతి తీసుకుంటారా? అన్నాను. సన్యాసికి విశ్రాంతి అని ఉండదు. ధర్మ బోధన ఆధ్యాత్మిక ప్రవచన వారి ధ్యేయం. శరత్కాలంలో చాతుర్మాస్య దీక్ష ఉంటుంది. కొందరు ఆషాడ శుద్ధ పూర్ణిమ నుండి కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు చాతుర్మాస్య దీక్ష చేపడితే మరికొందరు మాసం అంటే పక్షంగా అర్థం చెప్పి నాలుగు పక్షాలు అంటే రెండు నెలలు మాత్రమే దీక్ష చేస్తారు…పరివ్రాజకుడు (సన్యాసి) ఏ ఒక్క రోజు ఒక చోట విశ్రమించడు…తన వద్దకు వచ్చిన భక్తులకు ధర్మాన్ని భోదిస్తూ, పరిచయాలు పెంచుకోకుండా మరో ప్రదేశానికి తరలిపోతాడు.
ఏడాదిలో నాలుగు మాసాలు ధర్మప్రచారం
ప్రతి ఏడాది వర్ష ఋతువులో ధర్మ ప్రచారానికి ఆ నాలుగు నెలలు కేటాయిస్తారు…వాతావరణ పరిస్థితులు, అతిగా వర్షాలు, రైతులు పొలం పనుల్లో నిమగ్నం అవుతారు కాబట్టి, దానికి తోడు ఆరోగ్య నిష్ఠ కోసం కూడా తాను ఏర్పాటు చేసుకున్న కుటీరంలో భగ్వత్సంబంధమైన విషయాలను అధ్యయనం చేయడానికి కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారని వివరించారు. ‘‘స్వామీ, సన్యాసులను వివిధ రూపాల్లో చూస్తున్నాను. వారి గురించి వివరించండి’’ అన్నాను…సన్యాసులు ఆరు రకాలుగా ఉంటారు. ఒకటి కుటీచకుడు: శిఖ, యజ్ఞోపవీతం, దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో ఉంటూ ఆల్ఫాహారం తీసుకుంటారు. రెండు: బహుదకుడు : ఈయన రోజు ఎనమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ, నిత్యం సాధన చేస్తుంటారు. ముడోది: హంస : ఇతడు జడధారియై కౌపీనం ధరించి ఉంటాడు. నాలుగు: పరమహంస: వెదురు దండాన్ని కలిగి ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కౌపీనం మాత్రం ధరించి నిరంతర సాధనలో ఉంటారు. ఐదు: తురియాతితుడు: దేహాన్ని ఒక శవంలా చూస్తాడు. ఆరు: అవధూత. ఈ సన్యాసికి ఏ విధమైన నిష్ఠ నియమాలు లేవు… జగత్ మిధ్య… నేను సత్యం అంటారు…ప్రతి సన్యాసి పాప పుణ్యాలకు, సుఖ దుఃఖలకు, గర్వం మాత్సర్యం, దర్పం, ద్వేషం కు అతీతుడుగా ఉండే వారే సన్యాసి!! అని వివరించారు.
Also Read : ప్రేమతత్వం తెలిస్తే ఆకర్షణకు దూరంగా ఉంటారా?
ఏకదండం అద్వైతానికి ప్రతీక
ఇక దండంప్రస్థావన వచ్చింది… ఏకదండి, ద్విదండి, త్రిదండి అంటే ఏమిటీ స్వామీ అని అడిగాను…వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైతం, విశిష్టాద్వైత భావాలకు సంకేతాలు అని చెప్పారు. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచ భూతలకు సమ్మేళనం మనిషి కాబట్టి సన్యాసులు అయిదు అడుగుల కర్రను ధరిస్తారు అని చెప్పాడు. ఒక కర్రను ఏకదండి ధరించే వారి అద్వైత సిద్ధాంతాన్ని నమ్మే వారనీ, ద్విదండి ధరించి బోధనలు చేసే వారు ద్వైత సిద్ధాంతం అనుసరించే వారనీ, వీరు విష్ణు భక్తులు గా ఉంటారనీ స్వామి వివరించారు. మూడవది విశిష్టాదైత్వం. మూడు కర్రలు కలిపి త్రిదండి భుజాన పెట్టుకునే వారు తత్వత్రయం అంటారు. వీరిది భగవద్రామానుచార్యుల పరంపరగా చెప్పారు…ఇంతలో స్వామిగారిని కలవడానికి భక్త సమాజం రావడం తో నేను తిరుగుతున్నది పరమహంస గారి వెంట అని తెలిసి ఆశ్చర్య పోయాను…జ్ఞానోదయం అయినట్టు అనిపించింది.
నీదీ నా దారే
అయితే లౌకిక ప్రపంచంలో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వెనక్కు తిరిగి చూసే సరికి నా మనవలు, మనవరాలు కేరింతలు కొడుతూ కారులో నుండి రమ్మంటున్నారు…ఇటేమో అద్భుత బోధన చేస్తున్న స్వామి గారు కనపడ్డారు…పెళ్ళాం బిడ్డలను వదిలి రాలేని ఈ సన్యాస ప్రక్రియ ఇపుడిప్పుడే వద్దని స్వామి గారి దగ్గరకు వెళ్ళాను ఆయన ముఖంలో శ్రీకృష్ణుడు కనబడ్డారు… గీత బోధనకు సిద్ధమయ్యేలా ఉన్ననా? అని భయపడి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తుండగా ఐ ఏఎస్ అధికారి “నీది నా దారే” అన్నట్టు చిద్విలాసంగా చూశారు. అటు చూడకుండా కారెక్కి జనారణ్యంలో పడ్డాను.
Also Read : పండంటి కాపురానికి పదహారు సూత్రాలు