వినీలాకాశాము వ్రక్కలై
వీధిలో తచ్చాడుతోంది.
శూన్యం లో మట్టిమరకలు.
వికృత మకరాలు మరిచికా జలధిలో
విహారం చేస్తున్నాయి.
రంభను రాతిపై తోసి అనుభవించిన రావణుడు
వికటాట్టహాసం చేస్తున్నాడు.
కురుసభలో కురులు విరబోసికొని
మగ జాతి వినాశనానికి
శపధం చేస్తున్న ద్రౌపది.
ఆపిల్ కోసం పరుగెడుతున్న ఆడమ్
వెర్రి నవ్వులు ఎడెన్ తోటలో ప్రతిధ్వనిస్తున్నాయి.
భయం తోఁ పరుగెడుతున్న నిర్భయ,
దిశ మరిచి దుర్దశ వైపుగా అడుగిడుతున్న
డాక్టర్ దిశ…
చంపు, నరుకు అంటూ
భయంతో ముందుకూ వెనుకకు పరుగెడుతున్న
ప్రజలు … అవి ఆర్తనాదాలో, ఆత్ర రావాలో
ప్రకోపమో, ప్రతీకారేచ్చొ
వారికే తెలియని విచిత్ర స్థితి.
కళ్ల ముందు కనుపించీ కనిపించని
ఆసురీ రూపాల కరాళ నృత్యం.
స్పష్టాస్పష్టం గా నిజ స్వప్నావస్థల
మిశ్రమ ప్రతిబింబాలు.
కళ్ళు తెరవడానికి జంకు ,
కళ్లుమూస్తే ఏమవుతుందో నని భయం.
ప్రళయ కాల సన్నద్ధత తోఁ
ప్రకృతి రెక్కీ చేస్తున్నట్లు
ఒక్క సారిగా ముసురుకొస్తూన్న
వైపరీత్యాల, దుశ్శకునాల పరంపర…
ఏమవుతోంది ఈ ప్రపంచానికి?
కాలం వద్ద సమాధానం ఉందా?
మరి మన వద్ద…?
Also read: నీకు దగ్గరగా
Also read: జ్ఞాపకాలు
Also read: నిశ్శబ్ద గీతిక
Also read: కర్మ ఫలం