మణిపూర్ లో ఏం జరుగుతోంది? అరాచకం రగులుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నోరు ఎందుకు విప్పడం లేదు? ప్రశాంతంగా ఉండమంటూ అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేయడం మినహా ప్రధాని ప్రస్తుత పరిస్థితిలో చేయగలిగింది ఏమీ లేదు. మూడు జాతుల మధ్య వైమనస్యం పెరిగిపోయింది. మైటీలూ, కుకీలూ, నాగాల మధ్య సామరస్యం పాదుగొల్పడానికి ప్రయత్నం జరగాలి.
మణిపూర్ చరిత్ర
మణిపూర్ ఈశాన్య భారతంలో చిన్న రాష్ట్రం. దాని రాజధాని ఇంఫాల్. ఈ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్ ఉంది. దక్షిణాన మిజోరం, ఉత్తరంలో అస్సాం ఉండగా మయాన్మార్ తో కూడా సరిహద్దు ఉంది. దీనికి తూర్పున సగయాంగ్ ప్రాంతం, దక్షిణాన చిన్ రాష్ట్రం ఉన్నాయి. ప్రధాన భాష మైటీ. దానినే మణిపూరీ అంటారు. ఆగ్నేయాసితో మధ్య ఆసియానూ, భారత ఉపఖండాన్ని కలిపే రాష్ట్రం. ఈ రాష్ట్రం దాదాపు 2500 సంవత్సరాలుగా అస్సాం జనజీవన స్రవంతిలో భాగంగా ఉన్నది. బ్రిటిష్ పాలనలో మణిపూర్ ప్రిన్సిలీస్టేట్ గా ఉండేది. 1917 నుంచి 1937 మధ్యలో ప్రజలు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించారు. బర్మాలో కంటే ఇండియాలోనే కలవాలని మణిపూర్ ప్రజలు కోరుకున్నారు. 11 ఆగస్టు 1947, అంటే స్వాతంత్ర్య ప్రకటనకు నాలుగు రోజుల ముందే మహారాజా బుద్ధచంద్ర భారత ప్రభుత్వంతో సంధికుదుర్చుకున్నాడు. 21 సెప్టెంబర్ 1949న విలీనం ఒప్పందంపైన మహారాజు సంతకం చేశాడు. ఈ విలీనాన్ని వ్యతిరేకించిన వర్గాలు సాయుధమై తిరుగుబాటు ప్రకటించి అయిదు దశాబ్దాలపాటు భారత సేనలకు లొంగకుండా యుద్ధం సాగిస్తూ ఉన్నారు. వెయ్యిమంది మరణించిన తర్వాత 2018కి తిరుగుబాటుదారులు దారికి వచ్చాయి.
మణిపూర్ జనాభాలో 53 శాతంమంది మైటీలు, 24శాతంమంది నాగాలు, 16 శాతంమంది కుకీలు. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందూ, క్రైస్తవ మతాలు మణిపూర్ లో ప్రధానమైన మతాలు. 1961 నుంచి 2011 వరకూ హిందువుల నిష్పత్తి 62 శాతం నుంచి 41 శాతం వరకూ తగ్గింది. క్రైస్తవుల జనాభా 19శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. మణిపూరీ నృత్యం ప్రసిద్ధమైనది. క్రీడలలో సైతం మణిపూరీ యువతీయువకులు ముందంజలో ఉన్నారు. 1956లో మణిపూర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించారు. 1972లో రాష్ట్రహోదా కల్పించారు.
తిరుగుబాటు వారసత్వం
యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్)ను 1964లో స్థాపించి కొందరు తిరుగుబాటుదారులు భారత్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ పోరాటం సల్పుతున్నారు. అనంతర కాలంలో వివిధ లక్ష్యాలతో చాలా తిరుగుబాటు వర్గాలు ఉనికిలోకి వచ్చాయి. 1977లో కంగ్లీపాక్ పీపుల్స్ లిబరేషన్ పార్టీని ప్రారంభించారు. మరుసటి సంవత్సరమే 1978లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రతినిధులకు యుద్ధంలో చైనా శిక్షణ నిచ్చింది. 1980 నుంచి 2004 వరకూ మణిపూర్ ని కల్లోలిత ప్రాంతంగా పిలిచారు. ఏఎఫ్ఎస్ పీఎస్ ను 1980 నుంచీ అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచీ మణిపూర్ లో మానవ హక్కులు మంటగలిశాయని ఆందోళన ప్రారంభమైంది. స్థానిక మహిళలపైన దాడులు జరిగిన తర్వాత 2004లో కల్లోలిత ప్రాంతం అనే పేరును తొలగించారు. తంగ్ జామ్ మనోరమా దేవి అనే మణిపూర్ మహిళను అస్సాం రైఫిల్స్ కు చెందిన జవాన్లు మానభంగం చేయడం అశాంతికి దారితీసింది. మీరా పైబీస్ మహిళా సంఘం నాయకత్వంలో మహిళలు నిరసనగా నగ్నంగా ప్రదర్శన జరిపారు.
మే 2003లో మైటీలకూ, కుకీలకూ మధ్య జాతివైరం పెరిగి కలహాలకు దారితీయడంతో సుమారు 120 మంది దాకా మరణించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి సైన్యాన్ని రంగంలో దింపారు. వారిని నియంత్రించేందుకు సలహాదారులను నియమించారు. మెజారిటీ వర్గమైన మైటీలను బలపరుస్తున్న ముఖ్యమంత్రి వీరేన్ సింగ్ ను బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సోమవారంనాడు సైతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఆదివారంనాడు దేశీయాంగమంత్రి అమిత్ షాను కలుసుకొని సంప్రతింపులు జరిపారు. కుకీలతో సమాలోచనలు జరుపుతానని బిరేన్ సింగ్ అన్నారు. బీరేన్ సింగ్ చేత రాజీనామా చేయించి, మణిపూర్ లో రాష్రపతి పాలన విధించాలని పలు సంస్థలు కోరుతున్నాయి. మణిపూర్ లో పరిస్థితిని అదుపు చేయడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని అమిత్ షా ముఖ్యమంత్రికి చెప్పారు. చెప్పడం తేలికే కానీ చేయడం కష్టం.
అఖిలపక్ష సమావేశం
మణిపూర్ సమస్యపైన అఖిల పక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భద్రతాదళాలపైన మహిళలు తిరగబడటం గురించి షా ప్రస్తావించారనీ, మహిళా ప్రతినిధులతో మాట్లాడవలసిందిగా ముఖ్యమంత్రికి హోంమంత్రి చెప్పారనీ అంటున్నారు. 1200 మంది మహిళల ఒత్తిడికి లొంగి సైన్యం శనివారంనాడు 12 మంది మిలిటెంట్లను విడుదల చేసింది. ఏదో ఒక వర్గం (మైటీల) పక్షాన ఉన్నట్టు ముఖ్యమంత్రి కనిపించకూడదనీ, అన్ని పక్షాలనూ కలుపుకొని పోవాలని అమిత్ షా ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కు చెప్పారు.
మణిపూర్ విషాదంలో తాజా ఘట్టం మే 3న రెండు ప్రధాన సామాజికవర్గాలైన మీటీస్, కుకీస్ ల మధ్య పోరాటంతో ఆరంభమైంది. ఈ ఘర్షణలలో 120 మంది మరణించారు. 45 వేల మంది వివిధ శరణాలయాల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా జరగవలసింది అన్ని పక్షాల ప్రతినిధులనూ ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితిని కల్పించడం. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. కుకీలూ, మీటీలూ, నాగాలూ విడివిడిగా జీవిస్తున్నప్పటికీ ఒక వర్గం చేసే పనులు మిగిలిన రెండు వర్గాలపైనా ప్రభావం వేస్తాయి. భౌగోళిక భాగస్వామ్యం చెదిరిపోకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. భూటాన్ లో దొక్లాంలో చైనా పాత్రను ఇండియా, ఉక్రేన్ లో నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ప్రమేయాన్ని రష్యా ఖండిస్తున్నట్టు ఒకరి భౌగోళిక ప్రాంతంలో మరొకరు ప్రవేశించడానికి అభ్యంతరం చెప్పడం సహజం. కొండలూ, లోయల్లో నివసిస్తున్న మైటీలూ, కుకీలూ, నాగాలూ ఒకరి సంక్షేమం కోసం మరొకరు పాటుపడాలి కానీ పోరాడితే వచ్చేదేమీ లేదు. మణిపూర్ సమగ్రతకు ప్రమాదం ముంచుకొస్తున్నదనే భయాందోళనలు మైటీలకు ఉన్నది. మణిపూర్ లో నివసిస్తున్న నాగాలు నాగాలండ్ లో ఉన్న నాగాలకు మానసికంగా సన్నిహితం ఉంటారు కానీ మైటీలతో ఉండరు. అదే విధంగా మైటీలకూ, కుకీలకూ మధ్య ఘర్షణ అనాదిగా ఉన్నది.
బ్రిటిష్ పాలకుల నిర్వాకం
బ్రిటిష్ పాలకులు ఈశాన్య ప్రాంతంలో 1826లో అడుగుపెట్టారు. ఏ ప్రభుత్వాన్నీ గుర్తించని, ప్రభుత్వం మాట వినని అడవి జంతువులను వేటాడే మానవుల సమూహాలతో ఎట్లా వ్యవహరించాలో బ్రిటిష్ వలస పాలకులకు తెలియలేదు. వరి పండించే ప్రాంతాలలో వేటగాళ్ల కంటే అధికారులతో స్నేహం చేయడం సాధ్యమని బ్రిటిష్ వాళ్ళు గ్రహించారు. అస్సాం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను నియంత్రించేందుకు 1873లో బెంగాల్ ఈస్టరన్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ నిబంధనలను అమలు జరపడం ప్రారంభించారు. మణిపూర్ 1891లో బ్రిటిష్ పరిపాలన పరిధిలోకి రక్షక ప్రాంతంగా వచ్చి చేరింది. మైటీస్ ను గుట్టలలో నుంచి తప్పించి మైదానాలకు తరలించి, అక్కడికే పరిమితం చేయాలన్న ప్రయత్నం భారత స్వాతంత్ర్య సముపార్జన నాటి నుంచి జరుగుతోంది. అందుకనే వారు తమను షెడ్యూల్డ్ జాతిగా పరిగణించాలని కోరుతున్నారు. మణిపూర్ హైకోర్టు ఈ డిమాండ్ ను ఆమోదించింది కూడా. చురాచంద్ పూర్ జిల్లాలోని బార్బంగ్ ప్రాంతంలో మే3న జరిగిన కుకీల దాడులకు మైటీలు తీవ్రంగా స్పందించిన సంగతి విదితమే. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని గ్రహించిన మైటీలలో అణచిపెట్టుకున్న ఆగ్రహం బయటకు వెల్లడయింది. దాంతో స్కూళ్ళపైనా, ఆస్పత్రులపైనా, పెద్దవాళ్ళపైనా, పిల్లలపైనా దాడులు జరిగాయి. మంత్రుల ఇళ్ళమీద కూడా దాడులు జరిగాయి. అరంబాయ్ తెలంగోల్, మైటీ లీపన్ లు విధ్వంసం సృష్టించిన సంస్థలని ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం. చంపడమో, చనిపోవడమో అన్న విధంగా తెగించినవారిని ఇంత పెద్ద ఎత్తున మైటీలను సమీకరించడం పరిశీలకను ఆశ్చర్యపరచింది.
గసగసాల సాగుపై ఆంక్షలు
గసగసాల సాగు కుకీల ప్రదాన జీవనాధారం. దానిపైన నియంత్రణ పేరుతో కుకీలను హింసపెట్టిన ప్రభుత్వ విధానం కూడా ఈ విషయంలో తప్పుపట్టదగినదే. గసగసాల సాగుకోసం రిజర్వు ఫారెస్టు ప్రాంతాన్ని కుకీలు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని మణిపూర్ ప్రభుత్వ వాదన. మైటీలను గిరిజనుల జాబితాలో చర్చాలన్న డిమాండ్ కు వ్యతిరేకంగా చేసిన ఊరేగింపులో కుకీలూ, నాగాలూ ఉన్నారు. కానీ మైటీల హింసాకాండకు కుకీలు స్పందించారు కానీ నాగాలు స్పందించలేదు. దానికి కారణం అప్పటికీ కుకీలలో తమకు అన్యాయం జరిగిపోతోందనీ, బీరేన్ సింగ్ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నదనే ఆగ్రహం ఉన్నది. మైటీల దాడులతో ఆ ఆగ్రహం పెరిగి కట్టలు తెంచుకున్నది. హింసాకాండను ఎవరు ప్రారంభించారో, ఎవరు హింసకు పాల్పడ్డారో అన్న ప్రశ్నలు సంధించుకోవడం, నిందలు వేసుకోవడం మణిపూర్ లో కొత్తేమీ కాదు. చౌరీచౌరా హింసాకాండ తర్వాత సహాయనిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలన్న మహాత్మాగాంధీ 12 ఫిబ్రవరి 1922న ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో అదే విధంగా గిరిజన హోదాపైన ఉద్యమం నిర్వహిస్తున్న మైటీలూ, దానిని వ్యతిరేకిస్తున్న నాగాలూ, కుకీలూ పోరుబాటను వీడి శాంతి చర్చలకు సిద్దపడాలి.
గసగసాల సాగు, భూమి హక్కులు, అక్రమ వలసలు, గిరిజన హోదా వంటి అంశాలకు శాశ్వత పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. జాతుల మధ్య వైరానికి ప్రధాన కారణం గతం ప్రాతిపదికగా భవిష్యత్తు గురించి భయాందోళనలు ఉండడం. ఈ భయసందేహాలను రూపుమాపడానికి ఇంతవరకూ గట్టి ప్రయత్నం జరగలేదు. నాగాల భయం నాగాలకు ఉన్నది. మొత్తం మీద నాగాల సమస్యను ప్రభుత్వం ఎట్లా పరిష్కరిస్తుందో తెలియక మణిపూర్ లో నివసిస్తున్న నాగాలు కూడా అస్థిరతను ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా మైటీల ఆధిక్యం ఎదుట చిన్న రాజకీయ శక్తిగా మిగిలిపోవలసి ఉంటుందని నాగాల బాధ. మైటీలకూ, నాగాలకూ మధ్య కుకీలు నలిగిపోతున్నారు.
ఒక్క మాటైనా మాట్లాడని ప్రధాని మోదీ
కుకీలను రక్షించుకోవడం కోసమే కుకీల సాయుధ యోధులు రంగంలోకి దిగారు. కుకీల భౌతిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక భద్రతకోసం దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటామనే విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కుకీ పోరాట యోధులు పోరాటాన్ని 2008 నుంచీ విరమించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వారి సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గట్టి చర్యలేమీ తీసుకోలేదు. ప్రధాని నరేంద్రమోదీ గత నెలన్నరగా జరుగుతున్న మణిపూర్ పరిణామాలపైన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
నాగాల్యాండ్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్ సిఎన్)లో సైతం ఇదే పరిస్థితి. 2015లో ఎన్ ఎస్ సీఎన్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ సమస్య పరిష్కారం దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎన్ఎస్ సీఎన్ మిలిటెంట్లు ఇప్పటికీ సాయుధంగా, నిర్భయంగా తిరుగుతుంటారు. మైటీ అజ్ఞాత యోధుల శిబిరం మయన్మార్ లో ఉంది. మిలిటెంట్ల కార్యకలాపాలను చూసీచూడనట్టు వదిలివేయడంతో వారు బలోపేతమైనారు. మైటీ అజ్ఞాత యోధులతో ఎటువంటి ఒప్పందం లేదు. మయమ్నార్ సరిహద్దులో కాపలా పెంచాలనీ, ఉగ్రవాదులూ, మిలిటెంట్లపైన నిఘా పెంచాలనీ ఎన్ని సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదని మణిపూర్ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2010లో మణిపూర్ లో జాతీయ రహదారుల బంధనం 68 రోజులు చేశారు. 2011లో 121 రోజులు దిగ్బంధనం చేశారు. 2016-17లలో 139 రోజుల దిగ్బంధనం చేశారు. ప్రభుత్వ పట్ల విశ్వాసం సడలటంతో ప్రజలు సాయుధులై వీధులలోకి వచ్చి వీరంగం వేస్తున్నారు. వీరిని అదుపులోనికి తీసుకొని రావడం ప్రధానం. తర్వాత అన్నిగ్రూపులతో చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి.