మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత నియోజకవర్గానికి వెళ్ళి ప్రజలను సంప్రదించి తదుపరి చర్య తీసుకుంటానని మీడియా ప్రతినిధులతో సోమవారం ఉదయం రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ లో ప్రజలను కలిసిన తర్వాతనే పార్టీకీ, ఎంఎల్ఏ పదవికీ రాజీనామా సమర్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇంతకీ కేసీఆర్ కు ఇంత ఆగ్రహం ఎందుకు కలిగిందో, రాజేందర్ చేసిన తప్పిదం ఏమిటో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. రాజేందర్ కు మొదటి నుంచి ఆత్మాభిమానం ఎక్కువ. తనను సవ్యంగా గౌరవించకపోయినా, తనకు తెలియకుండానే తన మంత్రివర్గానికి సంబంధించిన నిర్ణయాలను అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి తీసుకున్నా తల్లడిల్లిపోతారు. దాని గురించి సన్నిహితులతో మాట్లాడతారు. ఫిర్యాదు చేస్తారు. ఎవరో ఒకరు ముఖ్యమంత్రికి చేరవేస్తారు. ఇది కొంతకాలంగా జరుగుతున్న ముచ్చటే. రాజేందర్ పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారనే సంగతి బహిరంగ రహస్యం. అందరికంటే బాగా రాజేందర్ కే తెలుసు. తన మంత్రివర్గంలో బదిలీలూ, ఇతర కీలక నిర్ణయాలూ తన ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకు తగినట్టే రాజేందర్ లో అసహనం కూడా పెరుగుతోంది. ఎప్పటికైనా మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమనే విషయం తెలిసినప్పటికీ కోవిడ్ రెండో తరంగంపైన ముమ్మర సమరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యమంత్రిగా రాత్రిబవళ్ళూ పని చేస్తున్న తనపైన వేటు పడుతుందని రాజేందర్ ఊహించి ఉండరు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన సందర్భంలో తనకు ఉద్వాసన చెప్పవచ్చునని ఊహించారు కానీ పనివేళా తనపైన భూకబ్జా ఆరోపణలు చేసి, పరువుతీసి, బయటకు పంపుతారని ఊహించలేదు. ఇంతకీ ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.
కేసీఆర్ అసాధారణ రాజకీయ నాయకుడు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. వేరే పార్టీ పెట్టే యోచన చేస్తున్నారనీ, వేరే పార్టీలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారనీ, మరి కొందరు ఎంఎల్ఏలను కూడగట్టుకునే అవకాశం కూడా ఉన్నదనీ రకరకాల ఇంటెలిజెన్స్ రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈటలపైన వేటు వేయక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ఈటలపైన వేటు వేస్తే ఎవరు ఎట్లా స్పందిస్తారో కూడా ఊహించగల తెలివితేటలు కేసీఆర్ కి ఉన్నాయి. ఎవ్వరూ నోరెత్తరని ఆయనకు తెలుసు. ఈటల వలెనే మరెవరైనా వేరే పార్టీ గురించి ఆలోచించినా, తన గురించి తన వెనుక చెడుగా మాట్లాడినా రాజేందర్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించేందుకు కూడా ఈ వేటును వినియోగించుకుంటారు. కానీ ఇప్పుడే ఎందుకు?
ఒక వేళ విశ్వేశ్వరరెడ్డి, కోదండరామ్ లతో కలసి ఈటల ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, దాన్ని వచ్చే ఎన్నికల వరకూ, మరో రెండేళ్ళకు పైగా, సజీవంగా ఉంచడం ఎంత కష్టమో కేసీఆర్ కి తెలుసు. సర్వసాధారణంగా కొత్త పార్టీలు ఎన్నికలు ఒక ఏడాది ఉన్నాయనగా పురుడుపోసుకుంటాయి. సంవత్సర కాలంలో పార్టీని నిర్మించి ఎన్నికలకు సమాయత్తం కావచ్చు. అంతకు మించి పార్టిని నడిపించాలంటే ఖర్చుతో కూడిన పని మాత్రమే కాకుండా నాయకులలో ముఠాలూ, విభేదాలూ ఏర్పడి తలనొప్పులు వస్తాయి. ఇప్పుడే పార్టీ పెట్టడానికో, వేరే పార్టీలో చేరడానికో అవసరమైన ఒత్తిడి రాజేందర్ పైన పెడితే ఎన్నికల సమయానికి ఆయన మసకబారుతారనే ఆలోచన కేసీఆర్ చేసి ఉండవచ్చు. ఈ లోగా అధికారులు ఇచ్చే నోటీసులకు సమాధానాలు ఇచ్చుకుంటూ, అవసరమైతే జైల్లో కొంతకాలం ఉంటూ, కోర్టులో లిటిగేషన్ తో కాలక్షేపం చేస్తూ రాజేందర్ ఉంటారని కేసీఆర్ అంచనా కావచ్చు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి కొత్త పార్టీ పెట్టడానికి రాజేందర్ సాహసిస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆలోచించడానికీ, ప్రణాళిక రచించడానికి కూడా కేసీఆర్ కు సమయం ఉంటుంది. అందుకే మునిసిపల్ ఎన్నికలు కూడా అయిపోయినాక, ఇప్పట్లో ఎన్నికలు లేవని నిర్ధారించుకున్న తర్వాత వేటు వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని భావించవచ్చు.
Very Well said Sir🙏