- లధాఖ్ లో, ఉత్తరాఖండ్ లో జరిగింది క్లౌడ్ బరస్ట్ అన్నారు
- తెలంగాణలో సైతం కేసీఆర్ అన్నట్టు క్లౌడ్ బరస్టేనా?
- విదేశీ కుట్ర జరిగిందంటారా?
క్లౌడ్ బరస్ట్…. మూడునాలుగు రోజుల నుంచి ఈ మాట తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వినిపిస్తోంది. రాజకీయ యవనికపై విస్ఫోటంగా మారింది. దానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ నోటి నుంచి దీనిపై కొన్ని వ్యాఖ్యలు రావడమని గుర్తించాలి. “క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని వెనుక ఏవో కుట్రలున్నాయని చెబుతున్నారు. ఎంతవరకూ కరెక్టో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలనే మనదేశంలో అక్కడక్కడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది”.. ఇలా ఆయన మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు కెసీఆర్. భద్రాచలం ప్రాంతంలోని వరద ప్రభావిత ప్రదేశాలలో తిరిగి వచ్చి, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. గోదావరి ప్రాంతంలోని ఉధృతికి కూడా ‘క్లౌడ్ బరస్ట్ ‘ కారణమై ఉంటుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఆయనపై దాడి చేయడం ప్రారంభించాయి. ఈ రాజకీయ కోణాలను, కెసిఆర్ మాటలను అటుంచుదాం.
Also read: ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ లో ముసలం
క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
అసలు ‘ క్లౌడ్ బరస్ట్’ అంటే ఏంటో కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. గతంలో కశ్మీర్ దగ్గరలోని లద్దాఖ్, లేహ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో వరద ముంచెత్తి చాలా నష్టం జరిగింది. ముఖ్యంగా మంచుకొండల్లో వెలిసిన అమర్ నాథ్ సమీపంలో ఇటీవల సంభవించిన వరదలకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. అది క్లౌడ్ బరస్ట్ ప్రభావంతోనే జరిగిఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మేఘాల విస్ఫోటనం వల్ల జరిగే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల గతంలో మనం ఎంతో నష్టపోయాం. నష్టపోతూనే ఉన్నాం. ముఖ్యంగా వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో అకస్మాత్తుగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తూ వుంటాయి. మేఘాల భారీ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని అంచనా వేయడం కష్టమేనని తెలుస్తోంది. మనదేశంలో సంభవించే ఈ పరిణామాలపై మన దగ్గరున్న సమాచారం తక్కువే. తక్కువ సమయంలో కుంభవృష్టి సృష్టించే శక్తి ఈ విస్ఫోటాలకు ఉన్నదని అర్థమవుతోంది. ఇవి ఎత్తైన ప్రదేశాల్లోనే చోటుచేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో పలుచోట్ల భారీ వర్షాలు,వరదలు సంభవించాయి. ఈ ప్రతికూల వాతావరణం ఏర్పడడానికి ‘క్లౌడ్ బరస్ట్ ‘ కారణమనే అనుమానాలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ప్రకారం అతిస్వల్ప సమయంలో భారీవర్షాలకు దారి తీయడాన్నే ‘క్లౌడ్ బరస్ట్’ అని పిలుస్తారు. సుమారు 20 నుంచి 30చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఒక్కొక్కసారి ఉరుములు, పిడుగులతో ఊహాతీతమైన స్థాయిలో వచ్చే వర్షాల వల్ల ఆకస్మిక వరదలు కూడా సంభవిస్తాయి. ఒక్కొక్కసారి స్వల్పమైన పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెంటీమీటర్లకు అటుఇటుగా వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. వీటిని ‘మినీ క్లౌడ్ బరస్ట్స్’ అంటారు.
Also read: మంకీ పాక్స్ ఏమిటో?
ప్రతి భారీ వర్షాన్నీ క్లౌడ్ బరస్ట్ అనలేం
తక్కువ సమయంలో వచ్చే ప్రతి భారీ వర్షానికి కారణం క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం జరుగుతూ ఉంటుంది.ఈ ప్రక్రియ ఎక్కువసార్లు కొనసాగడం వల్ల మేఘాలు బరువెక్కుతాయి.ఏదో సమయంలో విస్ఫోటనానికి గురవుతాయి. దీనివల్ల తక్కువ పరిధిలో, తక్కువ సమయంలోనే కుంభవృష్టి కురిసి,భారీ వరదలకు కారణమవుతాయి. ఈ తరహా పరిణామాలు హిమాలయ ప్రాంతాల్లోనే ఎక్కువగా చోటుచేసుకుంటాయి. అక్కడ ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది.వాతావరణ శాఖ అందించే సమాచారన్ని బట్టి క్లౌడ్ బరస్ట్ లు 1970 ప్రాంతం నుంచి ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. హిమాలయ సీమలు కాకుండా తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ఇవి ప్రవేశించాయా? లేదా? అన్నదానిపై ఇంతవరకూ స్పష్టత లేదు.దీని వెనకాల విదేశీ కుట్రలు ఉన్నాయన్నదానికి శాస్త్రీయమైన ఆధారాలు తెలియరావడం లేదు. ‘క్లౌడ్ బరస్ట్’ సంగతి అటుంచగా, ”వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు”అనే సామెత ఉండనేఉంది. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఏ స్థాయిలో వస్తాయో పూర్తిగా అంచనా వేసే శక్తి మానవాళికి ఇంకా రాలేదు. అవకాశమున్న పరిధిలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడం, వరద ముంపుకు గురికాకుండా ప్రాజెక్టులను నిర్మించడం, ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా కలిసి సాగడం ముఖ్యం. వాతావరణ శాస్త్రంలో అధ్యయనాలు, పరిశోధనలు ఇంకా పెరగాల్సిఉంది.ఆ దిశగా ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించాల్సి వుంది.
Also read: అధికార మదాంధులకు శ్రీలంక గుణపాఠాలు