వోలేటి దివాకర్
రానున్న ఎన్నికల్లో ఒకవేళ కొంత మంది నాయకులకు సీట్లు దక్కకపోతే సొంత పార్టీ వారికి, మిత్రపక్షాల వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఈసారి కూడా రాజమహేంద్రవరం రూరల్ సీటును ఆశిస్తున్నారు. సిటీ నియోజవర్గం నుంచి కూడా ఆయన పోటీకి సై అంటారు. ఈసారి గెలిస్తే గోరంట్లకు మంత్రి పదవి గ్యారంటీ అన్న అంచనాలు ఉన్నాయి. రూరల్ సీటును పొత్తులో భాగంగా జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిటీ సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఇప్పటికే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో గోరంట్లకు పోటీ చేసే అవకాశం లేకపోతే రాజమహేంద్రవరంలో సొంత పార్టీతో పాటు రూరల్‌లో జనసేన పార్టీ అభ్యర్థికి కూడా తలనొప్పులు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు, రూరల్‌లో కూడా గోరంట్లకు కొంత సొంత కేడర్ ఉంది. సీటు దక్కకపోతే అసంతృప్తితో గోరంట్లతో పాటు, ఆయన అనుచరులు కూడా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటంతో పాటు, వ్యతిరేక ప్రచారం చేసే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ పరిణామాలు పరోక్షంగా వైసిపి అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఆయన మాజీ శిష్యుడు పంపి మార్గాని భరత్ రామ్‌కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also read: రాజమహేంద్రవరంనకు ఎంపి అభ్యర్థులు కావలెను!
ఇక రాజమహేంద్రవరం సిటీలో అధికార వైఎస్సార్‌సిపిలో గ్రూపుల గోల ఇప్పటికీ తగ్గలేదు. భరత్ రామ్‌కు సహకరించేందుకు ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం ససేమిరా అంటున్నారు. వీరిద్దర్నీ కలిపేందుకు పార్టీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబం ఎంపి భరత్‌కు మధ్య విభేదాలు సమసిపోలేదు. జక్కంపూడి కుటుంబానికి, శివరామసుబ్రహ్మణ్యంకు రాజమహేంద్రవరం నగరంలో చెప్పుకోదగిన కేడర్ ఉంది. ఈపరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో రాజా, శివరామసుబ్రహ్మణ్యం వర్గాలు భరత్ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేసే అవకాశాలే కనిపించడం లేదు.
Also read: దేశవ్యాప్తంగా బిజెపి సొంత సర్వే! తెలంగాణా ఫలితాలు ముందే తేల్చేశారు!
రాజానగరం నియోజకవర్గం సీటు, గెలుపు తదేనని జనసేన నాయకుడు బత్తుల బల రామకృష్ణ చాలా కాలం నుంచి కోట్లు వెదజల్లి ఊదరగొడుతున్నారు. రూరల్ సీటుతో పాటు, పక్కనే ఉన్న రాజానగరం సీటు కూడా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే పరవాలేదు. లేనిపక్షంలో బత్తులతో పాటు ఆయన కేడర్ కూడా తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే బత్తులతో పాటు, ఆయన సామాజిక వర్గం ప్రచారానికి దూరంగా ఉన్నా…వ్యతిరేక ప్రచారం చేసినా వైసిపి అభ్యర్థిగా బరిలో నిలిచే రాజాకు కలిసి వస్తుంది. బత్తులకు సీటు ఇస్తే బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గం నిరాశకు గురై ఆయనకు వ్యతిరేకంగా పని చేసే అవకాశం, బొడ్డుకు సీటు ఇస్తే ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న పెందుర్తి వెంకటేష్ వర్గం ఆయనకు పనిచేసే అవకాశాలున్నాయి.
Also read: సీటు కోసం పోటీ….పేచీ తప్పదా?!