Thursday, November 21, 2024

అన్నదాత అస్త్ర సన్యాసం చేస్తే?

“అణువు అణువూ అన్నపూర్ణయై ప్రేమతో పులకరించిన మమతల మాగాణి మన జనని” అన్నాడు మోదుకూరి జాన్సన్ అనే కవి. దేశంలో పాడిపంటలను సృష్టించిన బంగారుభూమిని, గంగ, యమున, గోదావరి, కృష్ణమ్మల పాలపొంగులను అభివర్ణించని కవికర్షకుడు లేడు. ఆ అన్నపూర్ణ లేకపోతే మనకు బతుకులేదు. నాగలితో నమస్కరించి, పారలతో ప్రణమిల్లి గుప్పెడు విత్తనాలను గుండె గుప్పెట పట్టి చల్లి, మన జన్మభూమిని బంగారుభూమిగా మార్చినవాడు రైతు. రైతు లేకపోతే రాజ్యం లేదు. పాలకులకు వీరభోజ్యం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ పల్లెల్లో రైతులు హాయిగా బతికారు. మనల్ని బతికించారు. తదనంతరం ప్రవేశించిన పెట్టుబడిదారీ వ్యాపార సామ్రాజ్యాల మధ్యన, రైతులను విస్మరించిన పాలకుల చెంతన, రైతుగతి అధోగతిగా మారింది. సాఫ్ట్ వేర్, మాల్స్, రియల్ ఎస్టేట్ తెచ్చిన  కొత్త మోజులో వ్యవసాయం పాలకుల దృష్టిలో దండగమారిదైపోయింది. పట్టణీకరణ, నగరీకరణ దీనికి ఊతమిచ్చింది. విద్యాఉపాధులకోసం పట్నవాసాలు మొదలయ్యాయి. ఈ మొత్తం దృశ్యంలో, వ్యవసాయంచేసే వారి సంఖ్య, వ్యవసాయభూమి సంఖ్య తగ్గుతూ వచ్చింది.

కొర్పొరేషన్లపై నాయకుల మోజు

 నాయకుల ఆకర్షణలు కార్పొరైట్ వైపు పెరుగుతూ వచ్చాయి. వీటి పర్యవసానాలే రైతులు కొన్నేళ్లుగా పడుతున్న పడరాని కష్టాలు. తల్లిని విస్మరించిన ఏ కొడుకూ జీవితంలో పైకి రాలేదు. అట్లాగే, రైతును విస్మరిస్తే ఏ రాజకీయ పార్టీ మన జాలదు. దీనికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఐ టి మోజులో రైతును మరచినందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించారు. అధికారమే కోల్పోయారు. అదే, వై ఎస్ రాజశేఖరరెడ్డికి వరమై నిలిచి, ముఖ్యమంత్రి గద్దెపై కూర్చోపెట్టింది. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా అంతే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ తప్పించుకోజాలరు.

వ్యవసాయ చట్టాలపై  తీవ్ర వ్యతిరేకత

ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అవి ఢిల్లీకి తాకాయి. గత కొద్దిరోజులుగా రైతు సంఘాలు ఢిల్లీని చుట్టుముట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఈ అంశం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది.బిజెపిని చికాకు పెడుతోంది.నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ, విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిప్పులు చెరుగుతున్నారు.ఇందులో ఎటువంటి రాజకీయం లేదు, రైతు క్షేమమే అంటూ ఉద్యమిస్తున్న రైతు సంఘాలు మోదీ మాటలను తిప్పికొడుతున్నాయి.

ఎట్టకేలకు చర్చలు ఆరంభం

ఎట్టకేలకు  రైతు సంఘాలతో కేంద్ర వ్యవసాయశాఖ  మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మరో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ మంగళవారం భేటీ అయ్యారు. సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయో చెప్పలేం. ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిగాయి. అక్టోబర్ 14, నవంబర్ 13వ తేదీన జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు చెయ్యాలన్నదే రైతు సంఘాల ఏకైక డిమాండ్. కానీ, చట్టాలను రద్దు చేసే ఆలోచన కేంద్రానికి లేనేలేదని అర్ధమవుతోంది. చర్చల్లో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించి, ఎలాగైనా ఒప్పించి, ఉద్యమాలనూ, నిరసనలనూ ఆపించాలని కేంద్రం చూస్తోంది.

చట్టాల రద్దుపై భీష్మించిన రైతులు

ఉభయుల మధ్య సయోధ్య కుదిరే వాతావరణం ప్రస్తుతానికి కనిపించడం లేదు. చట్టాల రద్దుపై రైతుసంఘాలు భీష్మించుకొని కూర్చున్నాయి. కరోనాను, చలిని కూడా లెక్కపెట్టకుండా తాడోపేడో తేల్చుకోవాలనే ఆలోచనలోనే ఉద్యమకారులు ఉన్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, ఢిల్లీకి చెందిన 35 రైతు సంఘాలు ఈ పోరాటాన్ని నడిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యమబాట పట్టిన  ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలోనే ఉన్నాయి. ఎటొచ్చీ పంజాబ్, ఢిల్లీలోనే విపక్షాలు అధికారంలో ఉన్నాయి. సామరస్య పరిష్కారం దొరక్కపోతే, మిగిలిన రాష్ట్రాలు కూడా ఉద్యమానికి జైకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీల రాజకీయాలు ఎలా ఉన్నా, వీటికి అతీతంగా,  రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.

వ్యాపారుల పార్టీ అనే ముద్ర తొలగించుకోవాలి

బిజెపికి వ్యాపారులపార్టీ అనే   ముద్ర ఎప్పటి నుంచో వుంది. అది తొలగించుకోవాల్సిన బాధ్యత వారిదే. తొలగించుకోక పోగా, కొత్త వ్యవసాయ చట్టాలతో ఆ ముద్ర ఇంకా బలపడింది. అదానీలు, అంబానీల వంటి వ్యాపార దిగ్గజాలకు గొప్పమేలు తలపెట్టడానికే  ఈ చట్టాలు తెచ్చారనే విమర్శలను  ప్రస్తుత బిజెపి ప్రభుత్వం పెద్దఎత్తున  ఎదుర్కొంటోంది. ఇవి  చల్లారకపోతే, దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో బిజెపిపై తప్పకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.తాజాగా బీహార్ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలిచి పాలన చేపట్టింది. గతంలో తెచ్చిన పెద్దనోట్ల రద్దు, వచ్చిన జి ఎస్ టి చట్టం 2019 ఎన్నికల్లో ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఇవ్వకపోగా,  బిజెపికి భారీ మెజారిటీ వచ్చింది.ఇప్పుడున్న   కరోనా కష్టాలు   తాజా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఇవ్వలేదు.

కొత్త చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విశ్వాసం

వ్యవసాయ కొత్త చట్టాలు కూడా ఎటువంటి దుష్ప్రభావాలు చూపించలేకపోయాయనే ధీమాలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద, తాము చేపట్టిన కొత్త చట్టాలు,  పరిపాలనపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆత్మవిశ్వాసంగా ఉంది. ఇటువంటి తరుణంలో,  వ్యవసాయ బిల్లుల విషయంలో,  బిజెపి ప్రభుత్వం  వెనక్కుతగ్గే దృశ్యం ఎక్కడా  కనిపించడం లేదు. రైతులు మొదటి నుండీ గగ్గోలు పెడుతోంది మద్దతు ధర కోసమే. ఇప్పుడేమో మార్కెట్ యార్డులపై స్పష్టత కూడా  కోరుకుంటున్నారు. కొత్త చట్టాలు ఎంతో మేలుచేస్తాయని, దళారీ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకళించామని, ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకొనే  ఓపెన్ మార్కెట్ ను రైతుల ముందు ఉంచామని బిజెపి పెద్దలు చెబుతున్నారు.

బంతి కేంద్రం కోర్టులో ఉంది

మొత్తంగా ఈ విధానమే పెనుమాయ అంటూ రైతుసంఘాలు మండిపడుతున్నాయి. ఎంత పట్టణీకరణ జరిగినా, ఎన్ని కొత్త వ్యాపారాలు వచ్చినా, ఇప్పటికీ భారతదేశంలో ఎక్కువమంది వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు. రైతులకు వళ్ళు మండి, నాగలి పక్కనపెట్టి, అస్త్రసన్యాసం చేస్తే అందరూ ఆకలికేకలు వేయాల్సిందే. రైతులకు రక్షణకవచంగా చట్టాలు ఉంటేనే, దేశ ప్రగతి నిలుస్తుంది.ఆర్ధిక, రాజకీయ స్వార్ధాలకు రైతును బలిపెడితే ప్రజలతో పాటు ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదు.కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల మేళ్లు ఆచరణలో రైతులకు అర్ధమవనంత కాలం, ఈ ఉద్యమాలు ఆగవనే చెప్పాలి. బాల్  కేంద్రం కోర్టులోనే ఉంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles