- పరుగుల యంత్రానికి సెంచరీల కరువు
- గత 28 ఇన్నింగ్స్ లో మూడంకెల స్కోరులేని భారత కెప్టెన్
ప్రపంచ క్రికెట్ నంబర్ వన్ బ్యాట్స్ మన్, భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తన కెరియర్ లో నాలుగోసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అలవోకగా శతకాలు బాదే కొహ్లీకి భారీస్కోర్లు మాత్రమే కాదు మూడంకెల స్కోర్లు సైతం కరువయ్యాయి. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లోని తొలి టెస్ట్ వరకూ 87 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ-20 మ్యాచ్ లు ఆడిన కొహ్లీకి 70 శతకాలు బాదిన అసాధారణ రికార్డు ఉంది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ప్రతిఐదు ఇన్నింగ్స్ కు ఓ సెంచరీ చొప్పున బాదుతూ వచ్చిన విరాట్ కొహ్లీ చివరిసారిగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో గత ఏడాది ముగిసిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో 136 పరుగులతో శతకం బాదాడు. ఆ తర్వాత నుంచి విరాట్ ను మూడంకెల స్కోరు వెక్కిరిస్తూ వస్తోంది.
20 ఇన్నింగ్స్ గా సెంచరీలేమి :
ఆ తర్వాత నుంచి ప్రస్తుత చెన్నై తొలి టెస్టు వరకూ క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలసి 28 ఇన్నింగ్స్ ఆడిన కొహ్లీ ఒక్క శతకమూ సాధించలేకపోయాడు. 2019 డిసెంబర్ 12 నుంచి 2021 ఫిబ్రవరి 9 వరకూ 28 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కొహ్లీ మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 72 పరుగుల స్కోరు మాత్రమే సాధించిన కొహ్లీ కెరియర్ లో సెంచరీలు సాధించకపోడం ఇదే మొదటిసారికాదు.
Also Read: సౌరవ్ సరసన విరాట్
ఇదే మొదటిసారి కాదు :
2014 ఫిబ్రవరి 28 నుంచి 2014 అక్టోబర్ 11 మధ్యకాలంలో 25 ఇన్నింగ్స్ పాటు విరాట్…శతకం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అంతేకాదు…2011 ఫిబ్రవరి 27 నుంచి 2011 సెప్టెంబర్ 11 మధ్యకాలంలో 24 ఇన్నింగ్స్ పాటు కొహ్లీ సెంచరీ లేకుండా గడిపాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 13 నుంచి జరిగే రెండోటెస్టులోలైనా విరాట్ కొహ్లీ తనదైన శైలిలో ఆడి సెంచరీ మాత్రమే కాదు ద్విశతకం బాదాలని అభిమానులు గట్టిగా కోరుకొంటున్నారు. చెన్నై తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో 72 పరుగుల ఫైటింగ్ స్కోరు సాధించిన కొహ్లీ రెండోటెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ అదేజోరు కొనసాగించగలిగితే…మూడంకెల స్కోరు ఏమాత్రం కష్టం కాబోదు. గతవారం వరకూ ఐసీసీటెస్ట్ ర్యాంకింగ్స్ మూడో స్థానంలో ఉంటూ వచ్చిన కొహ్లీ చెన్నై టెస్టు ముగిసిన వెంటనే ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 5వ ర్యాంక్ కు పడిపోడం భారతజట్టుకు మాత్రమేకాదు శతకోటి భారత క్రికెట్ అభిమానులకు సైతం మింగుడుపడని విషయమే మరి.
Also Read: భారత గడ్డపై అతిపెద్ద టెస్ట్ సమరం