Sunday, December 22, 2024

నిన్నటి లిటిల్ రిపబ్లిక్ లకు ఏమైంది? వాటికి గౌరవనీయమైన గొంతుక అత్యవసరం!

దేశ రాజకీయాలలో వెంకయ్య నాయుడిది బహు ప్రశాంతమైన, వివేకవంతమైన వాణి. రాజ్యసభ అధ్యక్షుడిగా అయిదేళ్ళు వ్యవహరించినా కూడా ఆయన తన అస్థిత్వాన్ని ఎన్నడూ విస్మరించలేదు. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన ఆయన యువతరంతో, పాతతరంతో, సంపన్నులతో, నిరుపేదలతో, గ్రామీణులతో, నగరవాసులతో, రైతులతో, ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారితో – సకల జన శ్రేణులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకోసం ఒక అద్భుతమైన అవకాశం వేచి ఉన్నది. కొన్ని దశాబ్దాల కిందట నానాజీదేశ్ ముఖ్ చేసినట్టు ఎక్కడో ఒంటరిగా తనకోసం అంటూ ఒక వ్యాపకం పెట్టుకోవడం కాదు. భారతదేశంలోని చిన్న గణతంత్రాలను (లిటిల్ రిపబ్లిక్స్), అంటే గ్రామాలను, పునరుజ్జీవింపజేయడానికి ఆయన అత్యంత సమర్థులు. గ్రామీణ భారతం వివేకాన్నీ, గ్రామీణ ఆత్మగౌరవాన్నీ పునరుద్ధరించే గొప్ప పాత్రకు ఆయన సరిగ్గా సరిపోతారు.

Also read:ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే కాదు

రాష్ట్రపతి గ్రామాలను స్ఫురింపజేస్తారు

ఒక కుగ్రామంలో పుట్టిపెరిగిన ఒక వినయశీలి మనకు రాష్ట్రపతిగా లభించడం గొప్ప పరిణామం. దేశంలోని అట్టడుగున ఉన్న గ్రామాలను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మనకు గుర్తు చేస్తూ ఉంటారు. భారత్ గ్రామాలలో నివసిస్తుంది అని లోగడ చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ మాట అనగలమా? స్వావలంబన సాధించిన గ్రామాలు కనుక వాటిని ‘లిటిల్ రిపబ్లిక్’ లు అని పిలిచేవాళ్ళు. తక్కిన దేశం గ్రామసీమలపైన ఆధారపడి ఉండేది. పంచాయతీ రాజ్ వ్యవస్థ రాకమునుపే, స్థానికంగా ఎన్నుకున్న పంచాయత్ లు వెలవడానికి పూర్వమే గ్రామాలలో స్థానిక ప్రభుత్వాలు ఉండేవి. అప్పుడు  ఎన్నికలు రాజకీయ పార్టీల చిహ్నాలతో జరిగేవి కావు. ఎన్నిక కావాలంటే వ్యక్తిగత విశ్వసనీయత ప్రధానం. గ్రామాలు బయటి నుంచి సహాయంపైన ఆధారపడేవి కావు. ఈ రోజుకి కూడా భారతీయులలో అత్యధికులు గ్రామాలలోనే నివసిస్తున్నారు. చట్టసభల సభ్యుల ప్రాథమ్యాల ప్రకారం చూసినా, వారి ఉపన్యాసాలలో ముఖ్యమైన అంశాలను గమనించినా, విధాన నిర్ణేతల ప్రాతినిధ్య స్వభావం పరిశీలించినా గ్రామాలను అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు. పత్రికలూ, టీవీలు కానీ ఇటీవల విజృంభించిన సోషల్ మీడియా కానీ రాజకీయ ఊకదంపుడు ఉపన్యాసాలనూ, ఘటనలూ, అత్యాచారాలూ, ఆత్మహత్యలూ, ఎన్నికల వంటి అప్రధానమైన ఘటనలను వార్తాంశాలుగా పరిగణిస్తాయి. లేకపోతే రైతులు సంవత్సరాల తరబడి నిరసనదీక్షకు పూనుకోవలసిన అవసరం ఉండేది కాదు. నగర జీవిత శైలిని గుడ్డిగా అనుకరించడం, నగరాలలో ఉన్న ఇళ్ళను పోలిన ఇళ్లు నిర్మించడం, గ్రామాలను నివాసయోగ్యమైనవి కానట్టు పరిగణించడం ఎక్కువైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వయంసమృద్ధిని కోల్పోయింది.  గ్రామీణ కుటుంబాలలో అత్యధిక కుటుంబాలు అప్పుల వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి.

Also read: మన గణతంత్రం గాడి తప్పుతోందా?

గ్రామాలకు దేనిపైనా అధికారం లేదు

ముప్పయ్ సేవలపై అజమాయిషీ ఉండాలనీ, రెవెన్యూ ఆదాయం వికేంద్రీకరణ చెంది గ్రామాలకు లబ్ది చేకూరాలనే అపేక్షతో చట్టాలు చేసినా ఫలితం లేకపోయింది. వాస్తవానికి గ్రామాలకు చెరువులపైన కూడా హక్కు లేదు. గ్రామాలలో పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయంపైన అధికారం లేదు. ఎంఎన్ఆర్ జీఎస్ లకూ, డ్వాక్రా మహిళలకూ చెల్లింపులు ఆలస్యమైతే మాత్రం న్యూస్ చానళ్ళ ప్రతినిధులు గ్రామాలకు క్యూ కడతారు. జీవన ప్రమాణాలూ, జీవించే విధానంలో హాయి తగ్గుతూ వస్తున్నాయి. పాతతరం గ్రామీణులలో సైతం గ్రామాలలో నివసిస్తున్నామనే ఆత్మవిశ్వాసం, దర్పం ఇప్పుడు కనిపించడం లేదు. మన గ్రామాల నుంచి పట్టణాలకూ, నగరాలకూ వలసలు పెరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎన్నికైన ఎంఎల్ఏలూ, ఎంపీల వంటి ప్రజాప్రతినిధులకు ఇప్పుడు గ్రామాలలో ప్రజలంటే పట్టదు. వారికి కావలసింది ఓటర్లే. గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయన్నదే వారి యావ. గ్రామాలలో శాంతినీ, సుహృద్భావాన్నీ ఎన్నికలు నిర్దయగా ఛిన్నాభిన్నం చేశాయి. గ్రామాలలో సౌభాగ్యం అన్నది మరచిపోయిన అంశం. గ్రామాలు నగరాలకు ఉపగ్రహాలైనాయి, రాజకీయ నాయకులకు ఆటపట్టులైనాయి.

Also read: ప్రపంచ సంస్థల సూచీలలో ర్యాంక్ లను పట్టించుకోకుండా ఉందామా?

ప్రభుత్వంపైన ఆధారపడిన బతుకులు

గ్రామలు ప్రభుత్వంపైన ఆధారపడి బతుకుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం దయాభిక్షపైనే గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. లోగడ గ్రామాలకు పట్టుగొమ్మలుగా ఉండిన సహకార సంఘాల వంటి సంస్థలు సైతం కళ తప్పి వెలతెల పోతున్నాయి. ఇదంతా పంచాయతిరాజ్ చట్టం (1992-73వ రాజ్యాంగ సవరణగా ప్రఖ్యాతి చెందింది) 1999లో అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న భాగోతమే. వికేంద్రీకరణ పేరుతో నిస్సిగ్గుగా కేంద్రీకరణ జరిగిపోతోంది. ప్రభుత్వం తక్కువగా ఉండాలని చెబుతున్నప్పటికీ గ్రామాలలో ప్రభుత్వ సంస్థలు ఇబ్బడిదిబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఒక గ్రామానికి చెందిన వ్యక్తిగా, కొన్ని దశాబ్దాలుగా క్షేత్ర పరిశోధన చేస్తున్న అధ్యయనశీలిగా నేను సమగ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాను. రాజకీయ ఉపన్యాసాలు ఇలాగే కొనసాగితే గ్రామాలు మరింత అథమస్థాయికి చేరుకుంటాయి. పార్టీ చిహ్నాలతో పంచాయతీ ఎన్నికలు జరిపించే వరకూ ఇవి ఏవీ మారవు.

నేను రాసిన పుస్తకం ‘గ్రామాలు గర్వించేలా ఉండాలిగా?’ ఎమెస్కో వారు ప్రచురిస్తున్నారు. ఆ పుస్తకంలో ఇటువంటి అంశాలనూ, మరెన్నో ప్రశ్నలనూ లేవనెత్తాను. ఇంకెన్నో సలహాలు చేశాను. గ్రామసీమల స్థితిగతులపైన (ఈ గ్రామాలకు ఏమైంది?) పరిశోధన జరపవలసిందిగా సూచించాను.

Also read: టెలికాం వైతాళికుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles